పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

388

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తటస్థించినట్టు ఒక యితిహాసం విన్నాము. ఆపిల్లవాడి పేరుమీఁదనే దేవాలయం కట్టించి ఆ కేశవస్వామికి యేఁటేఁటా జరిగించే వుత్సవాల మిషమీఁదనే కార్తిక మాఖమాసాలలో వేద శాస్త్ర కవిత్వ గానాదివిద్యలకు యోగ్యతానుసారంగా సుమారు యేభైవేలదాఁకా ఖర్చు చేస్తారు. ఆభక్తి తాత్పర్యాలు వర్ణనాతీతాలు. యీ ధర్మఖర్చుకుగాను శ్రీనైజాం ప్రభువు ముజరాకూడా యిస్తారని వినడం. ఆకేశవభొట్లు బ్రాహ్మణ్యమందు వుండే గౌరవాన్ని పూర్తిగా ప్రదర్శించడంవల్ల ఆయీ సందర్భాలు కలిగాయి. ఆ యితిహాసం వ్రాస్తే చాలా పెరుగుతుంది. చాలామంది యెఱిగిందే. సుమారు రెండువందలేళ్లనాఁటిది. యిప్పుడు ఆ మాత్రం బ్రాహ్మలే లేరో? లేదా, అప్పుడు కూడా లేకపోయినా ఆ సంస్థానంవారు అమాయకులై యీబ్రాహ్మణపూజకు వుపక్రమించారో నేను నిశ్చయించలేను. యీ సందర్భమంతా ఒక్క గద్వాల సంస్థానానికి సంబంధించిందే. వీరు యేదో మిషమీద వేదాదివిద్యలను సమ్మానించి యశస్సుపొందుతూ తద్ద్వారా పరమార్ధాన్ని సేకరిస్తూవున్నారు కదా అని సమీపంలోనేవున్న ఆత్మకూరు, వనపర్తి సంస్థానప్రభువులున్నూ చిరకాలాన్నుంచి గద్వాలవారితోపాటు యీవిద్వత్సమ్మానాన్ని ఆచరించి యశస్సును పొందుతూ వున్నారు.

మళ్లా ప్రసక్తి కలగడంచేత యితర విషయమే రాసినట్టయింది. తుట్టతుదకు పిశాచం పట్టుకొనీ మనుష్యులను కొట్టడానికి బదులు భూత వైద్యులు ఆ మనిషినీడను కొట్టినట్టు ఆ వైష్ణవపండితులను వదలి వారి శిష్యుణ్ణి భట్రాజును అరెస్టుచేసి శిక్షించికూడా మా సమ్మతిమీఁద వదలిపెట్టారు. యెన్నఁడూకూడా పాండిత్యం పాండిత్యంవల్ల తేల్చుకోవడ మందేకాని వక్రమార్గాలచేత తేల్చుకోవడమంటే మాకు గిట్టదు. ఈ సందర్భమంతా కీ. శే. శ్రీ గద్వాల రామభూపాలుడిగారి సాంవత్సరికం నాఁడు అంటే, ప్లవ సం|| మాఖ శుద్ధ ద్వాదశినాఁడు జరిగింది. “మ. ప్లవసంవత్సర మాఖమాసమున శుక్లద్వాదశిన్" అనే పద్యం సందర్శనంలో వుంటుంది. దాదాపు 40 యేళ్లనాcటిది యీ ముచ్చట. ఆ సందర్శనంలో వుండేపద్యాలకు వొక్కొక్కదానికి యీలాగే యెంతో గాథ కొన్నిటికి వ్రాయవలసి వుంటుంది.

ఆయీ గాథలు యెందఱో యెఱిఁగే వున్నవే. ఎందఱో చెప్పుకొనేవేకాని యెన్నో మార్పులు చెందుతూ వుంటాయి. ఆదేశంలో మాకేమో ప్రయోగతంతు తెలుసునని చెప్పుకుంటారు. అది అసత్యం. యెవరిదాఁకానో యెందుకు? మా తిరుపతిశాస్త్రిచెప్పేటప్పుడే అక్కడి దిక్కడా, యిక్కడి దక్కడా పడవలసి వచ్చేది. సందర్శనపద్యాలు చదవవలసివస్తే అతనికి అంత వాచోవిధేయంగా వుండేవికావు. వల్లించడం నేనూ లేదు, అతఁడూ లేదు గాని తాత్కాలికధారణ తప్ప చిరకాలధారణా గుణం అతని బుద్ధిలో లేదనుకోక తప్పదు.