పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

381

ఓహో! మొదలెట్టిన విషయం మళ్లా విషయాంతరంలోకి దూఁకుతున్నట్టుందే! తి. శా. స్వర్గస్థుఁడైనా నాకున్నూ అతనికిన్నీ వున్నసంబంధం విడిపోలేదనేది ప్రస్తుతం. అధమం నెలకొక మాటేనా మేమిద్దఱమూ కలుసుకుంటూనే వుంటాము. ఆయీ స్వప్నగాథలు వ్రాయవలసివస్తే గ్రంథం చాలా పెరుంగుతుంది.

శరీరాలు పృథక్కుగా వుండడంచేత శారీరకధర్మాలు మాకువేఱు గావలసివచ్చింది గాని మానసికప్రవృత్తి కవితావిషయంలో మాయిద్దఱిదీ ఒకటిగానే వుండేది. కవితారచనకంటె అన్యవిషయాలలోనో? మనస్సులు కలవడమూవుంది. కలవకపోవడమూ వుంది. ఒకటి దీనికి వుదాహరిస్తాను. నేను చప్పట్లపర్వానికి పూర్వం కాకరపర్తి వెళ్లి వద్దాం రమ్మన్నాను. అక్కడ అల్లరి జరుగుతుంది, వద్దని అతఁడన్నాఁడు. ఆలా జరగడం ముందుగాథకు మనకు మఱీ మంచిది కనక వెళ్లితీరాలన్నాను నేను. అయితే నీకర్మం నీవొక్కఁడవే వెళ్లు, నేను రానన్నాఁడు. నేను చేసే ఆలోచన దూరాలోచనో, ఆతఁడు చేసేదే దూరాలోచనో చదువరులే పరిశీలించుకోండి. చదరంగంలో యెత్తులు మాదిరిగా యిల్లాటివిషయాలల్లో నా ఆలోచన ప్రసరిస్తుంది. అతనిది పేకాటవైఖరిగా నడుస్తుంది. “అడుసుతొక్కనేల? కాలు కడుగనేల?” అని అతనితాత్పర్యం. "తొక్కితే మలిఁగిపోయిం దేమిటి? పిమ్మట బాగా పాదప్రక్షాళన చేసుకుంటే, కొత్తదీ పాతదీకూడా మాలిన్యమంతా పోయి నిష్కళంక మవుతుం"దంటాను నేను. యింకోటికూడా వుదాహరిస్తాను. కొప్పరపువారికీ మాకూ, యేలాగయితేనేం కలహ మారంభ మయిం దనుకోండి. అందులోకి మనం స్వయంగానే వెళ్లాలి గాని మనశిష్యులను ప్రవేశించడానికి అంగీకరించకూడదని నావాదం. ఆలాకాదు, శిష్యులచేతనే వోడించే ప్రయత్నం మంచిదని అతనివాదం. నా వుద్దేశ మేమిటంటే సోదరకవులు చాలా కాలాన్నుంచి గంటకు వందలలెక్కని చెపుతూ వున్నారాయె. మన శిష్యులు కొత్తగా మొదలుపెట్టి ఆ భారాన్ని నిర్వహించంగలరో, లేదో మనకీపరాధీనవ్యాపార మెందుకని నాతాత్పర్యం. శిష్యులు వోడినా మనం వోడినట్టే అనిపించుకోవలసి వస్తుందికదా! అందుచేత ఆతోవ మంచిది కాదని నావాదం. యీలా నేను చెప్పినా వాఁడికి తోఁచినట్టే చేశాఁడు చివరికి. శివరామశాస్త్రి చేతా, చౌదరిగారి చేతా “ఛాలెంజి” పద్యాలు నాతో చెప్పకుండానే తాను బాసటగా వుండి నడిపించాఁడు.

యిప్పటివారి కొత్తపోకళ్లు కొన్ని అతనికి యిష్టం, నాకు యేం కర్మమో, వాట్లయందు యిష్టం వుండేదికాదు. దీనికి వకటి వుదాహరిస్తాను, ఎవరితోటో విద్యావివాదం తటస్థించిందనుకోండి; ఫలానా తేదీని యిన్ని గంటల యిన్ని నిమిషాలకు ఆ వివాద జరిగేసభకు రావాలని యేర్పఱచుకొన్నా మనుకోండి. మేము ముందుగానే వెళ్లి సభలో