పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

380

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పెళ్లి పేరంటాలుమాత్రం చేశాఁడు. చేసినా ఆత్మలో యీ కోరిక నిలిచే వుండడంచేత కాఁబోలును, యేపిల్లని తాను కన్యాదానం చేయాలని అనుకున్నాఁడో ఆపిల్ల పెళ్లిసమయానికి తిరుపతిశాస్త్రి ఆత్మవచ్చి ఆపిల్లని ఆవేశించింది. పిశాచమైనాఁ డనుకుందామా - అంతకు మునుపుకాని, యిటీవలఁగాని మళ్లాయెప్పుడూ యెవరికీ కనపడ్డట్టుగాని, పీడించినట్టుగాని లేదు. ఆ సమయానికి యింకా నేను ఆ పెళ్లిజరుగుతూవున్న “వుండి" అనే గ్రామానికి వెళ్లలేదు. నా భార్యా, పిల్లలూ మాత్రం వెళ్లివున్నారు. పూర్వకాలంలో యేవిధంగా మాట్లాడేవాఁడో ఆలాగే నాభార్యతోటి ఆ పెళ్లికూఁతురిద్వారాగానే మాట్లాడినట్టు తరవాత నాభార్యేనాకు చెప్పింది. వెం. శాస్త్రినికూడా చూచివెడతానని అన్నట్టున్నూ అతఁ"డీరాత్రికిఁ గాని రాఁడు, వచ్చేదాఁకా నీ ఆవేశం వుంటే శుభకార్యం అడ్డడమేకాక మనిషి నలిగిపోవడం తటస్థిస్తుం"దని అన్నగారు వగయిరాలు కోరినమీఁదట తావన్మాత్రంతో ఆ ఆవేశం తగ్గినట్టున్నూ చెప్పఁగావిన్నాను. కాని నేను వెళ్లి చూచేటప్పటికికూడా యింకా ఆ పెళ్లికూఁతురు తేఱుకున్నట్టు కనిపించలేదు. ఆవేశపుమాటలలోకూడా నాప్రసక్తి కొంత వచ్చినట్టు తి. శాస్త్రి అన్నగారు వగయిరాలవల్ల విన్నట్టయితే కొంచెం జ్ఞాపకం వుందిగాని ఆ మాటలు తబిసీలుగా జ్ఞాపకంలేక వ్రాయలేదు. బహుశః అప్పుడు తిరుపతిశాస్త్రి పెద్దకొడుకు వేంకటావధానికూడా దగ్గిఱవుండి చూచినట్టే విన్నట్టు జ్ఞాపకం. నే వెళ్లినతరవాత యేవేనా కొన్నిమాటలు మాట్లాడించి చూదామనిన్నీ తద్ద్వారాగా చిరకాలానికి మళ్లా ప్రాణస్నేహితుణ్ణి కలుసుకొని మాట్లాడినట్టు సంతుష్టి కలుగుతుందనిన్నీ ప్రయత్నించి చూచానుగాని, నేనంటే భయపడి మౌనం తాల్చినట్టు నాకే కాక అతని బంధువులందఱికిన్నీ తోఁచింది.

ఆత్మ నిత్యమనిన్నీ దేహం నశించినంతలో అది నశించేది కాదనిన్నీ మన విజ్ఞానులందఱూ చెవి నిల్లుగట్టుకొని పోరడానికి యీలాటి విషయాలెన్నో అనుభవించి వుండడమే కారణమనుకుంటాను. యీలాటి ప్రబలాధారాలెన్నో వున్నా నేఁటి సంస్కర్తలు పెడతోవలే పడతారు. మహాభారతయుద్ధంలో మృతులైన దుర్యోధనాదులనేమి, అభిమన్యాదులనేమి, వేదవ్యాసులు వారివారి సన్నిహితబంధుజాలానికి చూపినట్టు మహాభారతంలో స్పష్టంగా వుంది. ఆ భారతం పంచమవేద మని మనవిజ్ఞానులందఱున్నూ శిరసావహించినప్పటికీ యీకాలానికి అది పనికిమాలిన చెత్తకిందకూడా మాఱడంలేదు. వర్ణాశ్రమాచారాలకు సంబంధించిన ధర్మాలెన్నో అందులో "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మోభయావహః" అన్న వాక్యానికి వ్యతిరేకించే సంస్కారాలకే యిప్పటి వారు సర్వత్రా ప్రాధాన్యం యివ్వడంవల్ల పై సంగతి విస్పష్టమవుతూ వుంది. ఆట్టే చెప్పేదేమిటి? మునుపు యేవేవి అకార్యాలో అవి యిప్పుడు చేస్తే యెంతో గొప్ప, యెంతో గౌరవం.