పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/375

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

379

యిత్యాది పద్యములవల్ల అతఁడే నన్నుఁ గూర్చి ప్రసంగించవలసివస్తే యేలా ప్రసంగించేవాఁడో విస్పష్ట మవుతూవుంది. అయితే దైవం అన్యథాకరించాఁడు.

మామాసంబంధం యెట్టిదో నేను వివరించలేదు. కాని యిప్పటికీ కూడా మే మిద్దఱమూ కలిసి సభలు చేస్తూనే వుంటాము. అతఁడు గతించి 16 యేండ్లు కాఁబోలును అయింది. అయినా మా సాహచర్యం తప్పనేలేదు. జీవితకాలంలో నేనంటే అతనికి ఆంతరంగికంగా కొంత భయమూ, భక్తీ కూడా వుండేవి. పైకేమో “త్వంశుంఠా త్వంశుంఠా" గానే మాట్లాడేవాఁడు. యిప్పటి స్వప్నావధానాలల్లో కూడా అచ్చంగా ఆలాగే ప్రసంగం జరుగుతుంది. యీవ్యాసం వ్రాయడాని కారంభించాక అప్పుడే ఒక సభ జరిగింది. అతనికి యిప్పటికీ నామీఁద ప్రేమవున్నదన్నందుకు యిప్పటికి సుమారు పదియేళ్లనాఁడు జరిగిన ఒకగాథ వుదాహరిస్తాను.

అతనికి పురుషసంతానమే కాని స్త్రీ సంతానం లేదు. "ఒరేయ్! నేను కట్నం కానుకా పెట్టలేనని కాఁబోలును నాకు భగవంతుడు స్త్రీ సంతానాన్ని యిచ్చాఁడు కాఁ"డని చమత్కారంగా నాతో అనేవాఁడు. పయిఁగా “జన్మించి అంతరించినవాళ్లు కూడా కొందఱు మగవాళ్లేరా" అనేవాఁడు. అప్పటికింకా నాకును స్త్రీ సంతతి లేదుకాని, "లేకపోతే వకపిల్లనిపుచ్చుకోరా" అని అనేవాణ్ణి. మాకు శాఖాభేదంవున్నా శాస్త్ర విరుద్ధం గాని యితరశాఖాబాంధవ్యం అంగీకారమే. యేకులంతో పడితే ఆకులంతో చుట్టఱికం చేయడానికి తగ్గంత జ్ఞానం అతనికిఁగాని, నాకుఁగాని కలగలేదు. బ్రాహ్మలలో బ్రాహ్మల కేంచిక్కు? అందుచేతే నాకు సంతానంలేని రోజుల్లో నేను పెంచుకోవలసివస్తే అతని పిల్లవాణ్ణి పుచ్చుకుని మాశాఖపిల్లని పెళ్లి చేయాలనుకొనేవాణ్ణి. దీనికి మా తిరుపతిశాస్త్రి శిష్యుఁడున్నూ మా గురువుగారి స్యాలకుఁడున్నూ నా భార్యా మేనమామ కూఁతురిభర్తయున్నూ అయిన రాఘవభట్ల విశ్వనాథశాస్త్రి తనకు కూఁతురు కలిగితే సరేసరి, ఆలా కలక్కపోతే పెంచుకొనేనాసరే పిల్లనిస్తాననే వాఁడు. తుదకి యివేవీ జరగలేదు కాని మా మా అనుబంధం యేలాటిదో అంతా యెఱిఁగిందే అయినా యెఱఁగనివాళ్లు తెలుసుకోవడానికి వ్రాసూవున్నాను.

సరే, తి. శాస్త్రిగారికి స్త్రీ సంతతి లేదన్నది ప్రస్తుతం. ఆకారణం చేత అన్న సుందరరామశాస్త్రి కూఁతుళ్లలో మూఁడోదాన్ని తాను కన్యాదానం చేసుకుంటానని అనడమున్నూ అందుకు అన్న వగయిరాలు ఆమోదించడమున్నూ జరిగింది. కాని ఆ పిల్లకు వివాహపు. యీడువచ్చేదాఁకా తి. శా. జీవించడం తటస్థించలేదు. ఆకోరిక తీరకుండానే అతఁడు స్వర్గతుఁడైనాఁడు కాని యింకో శిష్యునిబాపతు ఆఁడపిల్లని దగ్గఱదీసి