పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

376

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తప్పంటేనే పరాక్రమిస్తాను గాని తప్పు తప్పంటే వొప్పుకుంటాను. తప్పుకూడా మార్గాంతరంగా సాధిస్తానుగాని, దానితత్వం యీలాటిది అని వెంటనే కాకపోయినా నిజం మఱి కొన్నాళ్లకేనా చెప్పేస్తాను. "నా౽మూలం లిఖ్యతే కించిత్” అని వ్రాసిన పెద్దిభొట్లుగారి వాక్యం నాకు యెక్కువగా ప్రాణపదం. ఆ "మూలం" కోసం యెంత వెదకాలో అంతా వెదకడం నాకు అలవాటు. యిప్పటివారిలో నాలాగ పరిశ్రమ చేసేవారు మిక్కిలి తక్కువగానే వుంటారో, అసలే వుండరో? ఆ విషయం నిర్ణయించుకొనే భారం లోకానిది గాని నాది కాదు. నేను వ్రాసుకోవడం మాత్రం - -

“శ్లో. పాపం భవేదపిచ పుణ్య మహం యథార్థం
     వచ్మీశ! మత్సమవయస్కజనేషు కో౽-పి,
     నా౽ తిక్రమే న్మమ పరిశ్రమ మాత్తవిద్యః
     కావ్యజ్ఞతావిషయ ఇత్యభితో౽ స్తి గర్వః"

యీలా వ్రాయడం, కాదు వ్రాసుకోవడం తప్పయినా వ్రాశాను. యీమాట సాక్షాత్తు సర్వజ్ఞుఁడైన పరమేశ్వరుఁడితో చెప్పేమాటగాని మనుష్యమాత్రులతో చెప్పేదికాదు. నిన్న మొన్నవ్రాసిన "క్షమాపణ" గ్రంథంలోది. యిట్టి ధైర్యస్థైర్యాలు విద్యావిషయంలోనేనా నాకు యెంత వఱకూ వుంటాయంటే ఆవలివారు "లీగల్" చర్యలోకి దింషేవఱకే. ఆలా దింపడానికి వుపక్రమించిన వుత్తరక్షణమందే ఆవలివారు యేవిధంగా క్షమాపణ చెప్పమంటే ఆ విధంగా క్షమాపణచెప్పి విరమించడమే నాకృత్యం. ఆలా చెప్పడం గురుత్వం వున్న విషయంలోనే కాదు యితరవిషయంలోకూడా అంతే. యిది బొత్తిగా వోపికలేని హేతువు చేతనే అనుకో నక్కఱలేదు. వోపికవున్న రోజుల్లోనేనా ఆ విషయం విద్యావిషయానికి అర్హమయిందని నాకు విశ్వాసం లేదు. యిది విషయాంతరం.

చాలా సోదె వ్రాయడంవల్ల ముఖ్యాంశం తేల్చుకోవడం కష్టమవుతుందేమో అని సంశయంగా వుంది. అందుచేత ముఖ్యమైన అంశాన్ని యిక్కడ మళ్లా వ్రాస్తాను. తిరుపతిశాస్త్రిన్నీ నేనున్నూ సమాన బుద్ధిమంతులం. వ్యాకరణంలో సమానంగా చదువుకున్నాము. సంస్కృత సాహిత్యం అతనిది యావత్తూ గురుశుశ్రూషా సంపాదితం. నాది కొంత శుశ్రూషాసంపాదితమున్నూ, కొంత స్వయంకృషి సంపాదితమున్నూ, స్వయంకృషిసంపాదితంలో నాకు తిరుపతిశాస్త్రి మొదలైన తోడివిద్యార్థుల గొండ్లాటలు గురువులు, నేనతనికి కవిత్వరహస్యాదులకు నామ మాత్రగురువును. నాకుసర్వదా కవిత్వమే వ్యాపారము. అతనికి దీనిలో నా అంతటి వ్యసనంలేదు. ఆలాగే అతనికూడా వ్యసనం వుంటే మాగ్రంథాలు యింకా చాలా సంపుటాలు పెరిఁగేవి. ఆయీ ముఖ్యాంశాలు చదువరుల కొఱకున్నూ, భావివిమర్శకుల కొఱకున్నూ వ్రాయడం తప్పదని వ్రాశాను.