పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

375


“చింతచెట్టుకింద పిచికి సమర్తాడింది" అని పాఠం చెపితే దాన్ని జాగ్రత్తగా వల్లించి వొప్పగించడమే కాని, "పిచికేమిటి? సమర్తాడడమేమిటి? అథవా ఆడిందే అనుకుందాం. అది యితరులకు గోచరించడం యేలాగ?” అనే విచారణ అంతగా తగలదు. అందుచేతే “క. విద్యలలోపల నుత్తమ విద్య కవిత్వంబు" అని యెత్తుకొని పూర్వలాక్షణికులు "అది తెలియుట లోకమెల్ల నరయుటకాదే?” అని పరిసమాప్తి చేశారు. “వ్రతానా ముత్తమ వ్రతమ్" అన్నట్టుగా పై వాక్యాన్ని అర్థంచేసుకోకూడదు. కవికి యావత్తు-సామగ్రిన్నీ హృదయంలో లీనమై వుంటుంది. దాన్ని వెలువరించడానికి గురువులున్నూ, ప్రపంచకమున్నూ సహాయపడడ మనుకోవాలి. యిది నా అనుభవంలో సంగతి.

నేను తిరుపతిశాస్త్రికి కవితాగురువనన్నా నాకు తిరుపతిశాస్త్రీ వగయిరా సతీర్థ్యుల సాంగత్యం సాహిత్యంలో గురువయిం దన్నా అదంతా యీలాంటిదే._అందుకే అతఁడు స్పష్టంగా నన్నుగూర్చి "తత్కృపం గవియయ్యు" అని వ్రాసినా, నేను అతని జీవితచరిత్రలో దాన్ని అన్యథాకరించి "అన్యోన్యం గురవో విప్రాః” అని వ్రాయవలసి వచ్చింది. అతఁడు ఆలా వ్రాయడమే యుక్తం. నేను ఈలా వ్రాయడమే యుక్తం. నేను అంత యథార్థంగా అహంకారనిరాసార్థం ప్రయత్నించినా అందులో యింకాయేదో కృత్రిమం చేసినట్టే ఒక పూజ్యులు “మూఁకవుమ్మడి మాట" ఒకటి వ్రాసి వున్నారన్నది అందఱున్నూయెఱిఁగిందే. అట్టి స్థితిలో మాటదక్కాలంటే యేలా దక్కుతుంది? అందుకే “యేగతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరేకదా?" అన్నాఁడు అన్యాపదేశంగా విజయవిలాసగ్రంథకర్త. అందులోనూ ఆత్మ వంచకులను గూర్చి మఱీ భయపడాలి.

తిరుపతిశాస్త్రికీ నాకూ వుండేభేదం ఒక్క స్వయంకృషిలోనే. నేనెప్పుడూ - "చింత కవులందుఁ దపసుల చిత్తమందు" అని మొల్ల వ్రాసిన పద్యపాదానికి వుదాహరణంగా వుంటాను. అతడు నావలెకాక యెప్పుడో పనిపడ్డప్పుడు రచన చేసినా చాలాకాలం స్నేహితులతో యితర కాలక్షేపంతో వెళ్లించేవాఁడు. అందుచేతనే నాకంటే అతని ఆరోగ్యం బాగా వుండేది. నా ఆరోగ్యం యెప్పుడూ అంతంతగానే వుండేది. ఆరోగ్యంలో వున్నప్పటికంటే కూడా అనారోగ్యంలో వున్నప్పడే నాకు విశేషించి రచన సాగడం అనుభూతం.

మేమిద్దఱమూ పట్టుదలకలవాళ్లమే కాని, నాకు ఎవరేనా ఎక్కడేనా శబ్దతప్పో, అర్థతప్పో పడితే దానికి సమాధానం వ్రాసేదాఁకా అన్నమూ పానమూ, నిద్రా గిద్రా యేమీ తోcచదు. యీ బాధ అతనికి లేదు. యిప్పటికికూడా నా కీ పీడ వదలే లేదు, శేష జీవితంలో కూడా వదులుతుందని తోఁచదు. అట్లని 'పిడివాదా'నికి సిద్ధపడను. వొప్పు \