పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

377

ఆ యీ సందర్భాలు మా గ్రంథాలు పరిశీలకతాదృష్టితో చదివిన వారికి విధిగా గోచరించేవే అయినా నేను వ్రాయడం పునరుక్తిప్రాయం.

లోకం యేమనుకుంటేయేం గాని, అతనిశక్తి నాకూ, నాశక్తి అతనికి యెంతా నచ్చకపోతే మామైత్రి అంత నిరంతరాయంగా సాఁగదుగదా. నేనా, గర్విష్ఠుణ్ణి. అతఁడా, ఆ విషయంలో నావృద్దప్రపితామహుఁడు. యిట్టి మాకు విద్యావిషయంలో కలవడ మంటే, అన్యోన్నాన్ని బంధించే ప్రబలకారణాలు యెన్నేనా వుండితీరాలి. అతని పద్యాలవల్ల నన్ను అతను ప్రేమించడానికి, తగ్గహేతువులు యిదివఱకే చదువర్లు గుఱితించి వుంటారు. నావాట్లవల్లా అతణ్ణి నేను ప్రేమించడానికి తగ్గగుణాలు - అతనికి సంబంధించినవి - గుఱితించే వుంటారు. అయినా దిఙ్మాత్రం రెండింటికీ ఆధారాలు యింకా చూపుతాను.

“ఒరులు నచ్చని నాదుగరువంబు సడలింపఁ జాలె నెవ్వని మనీషాబలంబు” యీసీసచరణం యెంత అంతరంగశుద్ధితో వ్రాసిందో చదువరులు గమనించవలసి వుంటుంది. అతని బుద్ధి చాకచక్యము యెంతటిదీ కాకపోతే అతని మరణానికి సంబంధించిన సానుభూతిసభలో నైనాసరే నేను ఇంతగా పొగడడం తటస్థించదు. గురువుగారు అతణ్ని మెచ్చుకొనేవారని మొట్టమొదట యెత్తుకొన్న “గురుఁడు బ్రహ్మయశాస్త్రి కొనియాడు నెవనిఁ గర్నాట సీతారాముసాటిఁ జేసి” అనే సీసచరణానికి యెందఱికో సంప్రదాయార్ధం తెలియదు. యీ కర్నాట సీతారామశాస్త్రులుగారు యీ లోకానికే కాక మూఁడులోకాలకీ సరిపడ్డ మహా తార్కికులు. యిట్టివారితో తిరుపతిశాస్త్రికి గురువుగారు పోలిక చెప్పడ మంటే సామాన్యంకాదు. ఆ సీతారామశాస్త్రులుగారి వాదమంటే అందఱూ 'యిది బంగారం' అంటే 'కాదు, మన్ను' అనిన్నీ, మట్టి అంటే 'కాదు బంగారమే' అనిన్నీ సమర్థించేది. అట్టివాదం ప్రమాణప్రమితమా, కాదా అనే ప్రశ్న వేఱు. యిక్కడ పాండిత్య ప్రతిభనే విమర్శకులు గమనించాలి. “కర్తుమకర్తు మన్యధాకర్తుం సమర్థు” లంటే అట్టివారికే చెల్లుతుంది. “మయి జల్పతి కల్పనారినాథే రఘునాథే మనుతాం తదన్యథైవ” అనేది తర్కశాస్త్రజ్ఞుల ప్రతిజ్ఞావాక్యమే. కాశీ కాశీఅంతా యేకీభవించినా సీతారామశాస్త్రులుగారి వాదాన్ని భంగించలేక పోయినారని మా గురువులు సెలవిచ్చేవారు. నేనైతే కాశీ వెళ్లినప్పుడు సదరు శాస్త్రులుగారిని సందర్శించానేకాని, వారి సామర్థ్యం తెలుసుకోతగ్గంత వ్యక్తి విశేషం అప్పటికే కాదు యిప్పటికీ నాకు లేకపోవడం చేత ఆ యా విశేషాలు తపిసీలుగా వ్రాయఁజాలను.

అట్టి మహావ్యక్తితో తిరుపతిశాస్త్రిని గురువుగారు పోల్చి మాట్లాడడంకన్న జన్మకు యింకొక అదృష్టం వుంటుందా? అంతటివాఁడు కనకనే నేను అతణ్ణి ఆమోదించానని