పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/367

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

371


అభ్యసించారో, లేక ఆ మాత్రమో అభ్యసించనేలేదో - కాని యేదేనా విషయం వ్యాకరణశాస్త్రానికి సంబంధించింది వచ్చినాసరే, మఱో శాస్త్రానికి సంబంధించింది వచ్చినాసరే ఆయన దాన్ని గురించి వ్రాయవలసి వస్తే ఆ శబ్దాన్ని గూర్చి పాణిని మొదలుకొని మII తాతారాయఁడు శాస్త్రుల్లుగారి పర్యంతమూ వున్న గ్రంథకర్తలు ఎక్కడెక్కడ యేయే పంక్తి వ్రాశారో దాన్నంతనీ సవిమర్శంగా వుదాహరించి, చర్చించి సిద్ధాంతీకరించేవారు. ఆ వ్రాఁత చూచినవారు వీరు పాణినీయం మొదలయిన శాస్త్రాలు పూర్తిగా గురుశుశ్రూషా పూర్వకంగా అధ్యయనం చేసిన వారే అని గోచరించేది. వారి తమ్ములు సుబ్బయ్యశాస్త్రుల్లు గారున్నూ, నేనున్నూ లఘుకౌముదిలో చామర్లకోట విద్యార్ధిత్వంలో సతీర్థ్యులం. తరవాత ఆయన శ్రీ మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, షడ్దర్శనీవేత్తలు, యింకా యెన్ని విశేషణాలు వేసి వర్ణించినా తృప్తికలగని పాండిత్యం వున్న శ్రీ పరవస్తు రంగాచార్యులవారి శుశ్రూషచేసి వ్యాకరణాన్ని సమగ్రంగా అభ్యసించారు. యింకా వీరు శ్రీనోరి సుబ్రహ్మణ్యశాస్త్రుల్లుగారి శుశ్రూషకూడా చేస్తే చేసివున్నారేమో? యిట్టి తమ్మునికన్న అన్న బ్రహ్మయ్యశాస్త్రుల్లుగారు చేసిన శుశ్రూష చాలా తక్కువ దనడానికి వొప్పనివా రుండరు. అయితే సుబ్బయ్యశాస్త్రుల్లుగారు కచేరీవుద్యోగం అప్రధానంగానూ, యీ వుద్యోగం ప్రధానంగానూ పెట్టుకోవడంచేత సర్వదా గ్రంథావలోకనంతో కాలక్షేపం చేయవలసి వచ్చింది. మాయిద్దఱికీ వుండే ప్రభేదంకూడా కొన్నాళ్లదాఁకా యీలాటిదే. పిమ్మట యీ ప్రభేదంకూడా లేదు.

"నేను చదవనిగ్రంథం పాఠం చెప్పవలసి వచ్చిందనుకోండి. గురుశుశ్రూషచేసి చదవని కారణంచేత "సపాదం భక్షయేత్ అని వుంటే "సః వాఁడు, పాదం కాలిని, భక్షయేత్ తినవలసినది” అని అసంప్రదాయార్ధమే చెప్పాననుకోండి; వెంటనే నన్ను వెక్కిరిస్తారుగా! వెక్కిరించి వూరుకుంటారా? “అక్కడ సపాదం అనేది సమస్తపదం, సేరుంబావు అనే అర్థం చెప్పాలిగాని మీ గురువుగారు చెప్పింది సరిగాదు" అని వానితో అంటారు. అప్పుడు వుండే దశను పట్టి నాదే న్యాయమైన అర్థం అంటూ బుకాయించినా యథార్థం వాళ్లు చెప్పినదే అని గోచరించక పోతుందా? అయితే యీలాటి అసంప్రదాయాలు సర్వత్ర వుండడానికి నేను బొత్తిగా కావ్యాలే చదవనివాణ్ణి గానుగదా! ఆలాటి వాళ్లయితే “కుండంతా వోటుగా" వుండవలసి వస్తుంది. (లోకంలో వుండే సాహిత్యపరులేనా ప్రతీకావ్యమూ అంతా చదవడం వుండదు.) యీలాంటి సంప్రదాయాలు యెంత శుశ్రూషచేసిన వాళ్లకీకూడా పండితులవల్లనే కాక పామరులవల్ల కూడా తెలుసుకోఁదగ్గవి మఱికొన్ని యావజ్జన్మమూ తెలుసుకోవలసే వుంటాయి.