పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

370

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


స్పష్టమవుతూవుందిగాని ఆ వ్రాఁతను లోకం అంతా విశ్వసించలేదని అవగతమవుతూవుంది. అంత విస్పష్టంగా వకరు మా యిద్దఱినీ యెఱిఁగిన పరమపూజ్యలు వ్యంగ్యంగా కాకుండా వాచ్యంగా కూడా తెల్పినప్పటికీ తేలకపోతే యింకా తేలడం యేలాగ? బహుశః వారి వ్రాయడం అసూయాప్రయుక్తంగా తోసేసి, మళ్లా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూన్నా రన్నది సత్యదూరం కాదు. అయితే వినండి.

వ్యాకరణం యిద్దఱమూ సమానంగానే చదువుకున్నాం. మధ్య కాలంలో నేను కాశీ వెళ్లినా చాలామంది మహాపండితులను సందర్శించడంతప్ప దేశంలోవున్న తిర్పతిశాస్త్రికంటే విశేషం చదివిందేమీలేదు. మళ్లా దేశంలో యిద్దఱమూ కలిసే తరవాయిగ్రంథాలు మొదటి గురువు గారిదగ్గిఱే అభ్యసించాము. సంస్కృతంలో కావ్యనాటకాలు చదవడంలో నాకన్న అతని గురుశుశ్రూష హెచ్చు. నాశుశ్రూష ఆ విషయంలో అతని కంటె కొంచెం లొచ్చు. యీభేదం మేము కలుసుకొన్న కొన్నియేళ్ల వఱకు - అంటే, అధమం రెండేళ్లవఱకూ - వుండేది. పిమ్మట సరిసమానంగానే మామాసాహిత్యాలు తయారైనాయి. ఆతఁడు తీవ్రమైన బుద్ధిశాలి. అయినా నాలాగ సర్వదా విద్యావ్యాసంగాన్ని చేస్తూ దాన్నే వక తపస్సుగా పెట్టుకొనే స్వభావం కలవాఁడు కాఁడు. నేనో? సర్వదాదాన్నే మననం చేస్తూ కాలక్షేపం చేసే స్వభావం కలవాణ్ని అందుచేత శుశ్రూషావిషయంలో తక్కువ అయినా పరినిష్ఠిత సాహిత్యంలో అతనికంటే కూడా అంతో యింతో నా శక్తి అతిశయించిందని పరిశీలకులు గుర్తించవలసివస్తుంది. యీ అతిశయం దేనిలోను? యేవేనా ఖండన మండనాల ప్రసక్తిలో మాత్రమే. దేనేనా అన్వయించడం వస్తే నాకన్న అతఁడే అధికంగా అన్వయించేవాఁడు. యీలాటి స్వల్పభేదం వున్నా అతనివాదం "యే యెండకు ఆ గొడుగు" గా వుండేదవడంచేత దురుద్ధరంగా పూర్వపక్షాలు చేయడానికే కాని శాశ్వతమైన సిద్ధాంతకల్పనకు పనికివచ్చేది కాదు. యీ వ్రాసిన సోదెవల్ల ముఖ్యఫలితం, సంస్కృత సాహిత్య విషయంలో అతనిది సర్వమూ అంతో యింతో గురుశుశ్రూషా లబ్దం; కాని తక్కిన యావత్తూ స్వయంకృషిచేత, తోడివిద్యార్థులతో కయికురు బొయికురులాడడం వగయిరా వ్యాసంగంవల్ల సంపాదించుకున్నదనిన్నీ చదువరులు తెలుసుకోవలసి వుంటుంది. అందుకు మా కాలంలో వారినే వుదాహరణంగా చూపుతాను.

శ్రీయుతులు కాశీభట్ల బ్రాహ్మయ్యశాస్త్రుల్లుగారిని యొఱగనివారే లేరుగదా? వారితమ్ములు సుబ్బయ్య శాస్త్రుల్లుగారున్నూ సుప్రసిద్దులే. బ్రహ్మయ్యశాస్త్రుల్లుగారు పూర్వపు మెట్రిక్కులేషన్ చదివి ఆ యింగ్లీషుతో పాటు యేమాత్రమో ప్రయివేటుగానో, లేక స్కూల్లోనో రఘువంశమో, కుమారసంభవందాఁకానో సంస్కృతంలోకూడా గురుముఖతః అభ్యసిస్తే