పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/368

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

372

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

సంస్కృత కవిత్వంలో శ్లోకం నాలుగుచరణాలూ యేకసమాసం పెట్టడం తప్పనే సంగతి మాకు యేలాతెలుసుకోవలసి వచ్చిందో ఆమధ్య బహుశః "మహదైశ్వర్యాభివృద్ధి" అనే వ్యాసంలో వివరించినట్టు జ్ఞాపకం. ఆవివరణఘట్టంలోనే “ఉ. ఒక్కొకచోట నొక్కొకనియొద్ద నొకొక్కొకమాట చొప్పునన్, జక్కఁగ సంగ్రహించితిమి" అనేపద్యంకూడా వుదాహరించినట్టున్నాను. ఆయీపద్యం శ్రీ విజయనగరం మహారాజులుంగారి మీఁద చెప్పిన పద్యాల్లో వుంటుంది చూచుకోండి.

విద్యాసంపాదనకు, నన్నడిగితిరా, గురుశుశ్రూష నిమిత్తమాత్రం కాని స్వయంకృషే ముఖ్యం. (శాస్త్రాలకు మాత్రం అల్లాకాదు “అనభ్యాసే విషం శాస్త్రమ్") సాహిత్యాదికానికి గురువు మార్గప్రదర్శకుఁడు. అంతేనేకాని సమస్తమూ చెప్పఁడు. ఆయన చూపిన మార్గాన్ని పట్టి శిష్యుఁడు స్వయంకృషితో పైకి రావాలి. భోజరా జేమన్నాఁడు? "మధు మయఫణితీనాం మార్గదర్శీ మహర్షిః" అన్నాఁడు, మా యిద్దఱికీ బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారు పరమగురువు లంటే, యెందులోను? వ్యాకరణంలోనే. ఆంధ్రాని కెవరు? స్కూలుమాస్టర్లు, భాగోతాలు, వీథినాటకాలు, యివన్నీ యీలా వుంచుదాం.

యిప్పుడు యేశాస్త్రాన్నిగూర్చి వ్రాయవలసివచ్చినా దస్తాలకొలఁది నేను బరుకుతానుగదా! ఆయాశాస్త్రాలు నాకు వచ్చునా? రావు. నేను చదివింది వ్యాకరణం వొక్కటే. తరవాత నిన్న మొన్న బందరువుద్యోగం చాలించుకునివచ్చే రోజుల్లో శ్రీ జంధ్యాలగౌరీశాస్త్రుల్లుగారి వద్ద సూత్ర భాష్యాన్ని చతుస్సూత్రిదాఁకా చదివాను. చదివింది యింతే అయినా దానిలోకూడా “వుప్పులేనిదే ముప్పందుంగా" వుపన్యసిస్తాను, రాస్తాను. యిదంతా గురుశుశ్రూషాలబ్ధమేనా? దేవీభాగవతం పద్దెన్మిదివేల గ్రంథం ఆంద్రీకరించడంలో యెంతో వేదాంతవిషయం వెడుతుంది. దానికి ఆ పురాణమే గురువు. దానిలోవున్న వేదాంతానికీ భగవద్గీతా వేదాంతానికీ యెక్కడో భేదంగాని అట్టే భేదం వుండదు. గీతలు నేను గురుముఖతః చదివింది లేదు. నూటయెన్మిది వుపనిషత్తులున్నూ ఆవేదాంతాన్నే భంగ్యంతరంగా బోధిస్తాయి. అవికూడా తిరగేస్తూవుంటే యెక్కడేనా సంప్రదాయార్థం తెలియకపోయినా అంతా తెలియకపోదు. ఆలాటిది వకటి చూపుతాను.

శ్లో. "యదా చర్మవ దాకాశం వేష్టయిష్యంతిమానవాః
      తదా శివ మవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి"

యీశ్లోకం శ్రీ దేవీభాగవత సప్తమస్కంధంలోనిది. శ్వేతాశ్వత రోపనిషత్తులోనున్నూ వుంది. యిది ఆంద్రీకరించే రోజుల్లోనే కాక యిటీవల జరిగిన ముద్రణనాఁటికి కూడా అర్ధం - అంటే ముడి అర్థంకాదు. తాత్పర్యార్ధం - మా యిద్దఱికీకూడా గోచరించిందే