పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

364

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

గీరతం మందలింపుపర్వాన్నుంచి వుదాహరించిన యీ పద్యాలు కూడా నారచనలో పూర్తి సమాసధారను బోధించవు. దానికి “శాంతింపుడని రాయబారమవురా!" అనేవిన్నీ లోకాభిరామాయణంలో వున్న "ఱంతుల్ మానఁడు తిర్పతిద్విజుఁడు" అనే పద్యాలలో కొన్నిన్నీ చూచుకోండి. ఆ “తిర్పతిద్విజుఁడు" అనే వాట్లలోమాత్రం నాలుగువంతులలో మూఁడువంతులు తిరపతిశాస్త్రివిగా తెలుసుకోండి అని గతంలో వ్రాసేవున్నాను. కవి యెవఁడుగాని, యెక్కడఁగాని సమాసం పెట్టాలని పెట్టడు, విడిపదాలేగా వ్రాయాలనీ వ్రాయడు, ఆయా రససందర్భాన్ని పట్టి "అర్ధాశ్శబ్దచయా" అని కుట్టికవి చెప్పినట్టు దొర్లుతాయి.

చ. "జిలిబిలిపల్కులున్ సొగసుc జిల్కెడి ముద్దులు తాఱుమారులున్
      వలపులచోద్యముల్ మిగుల వన్నెలు చిన్నెలుగల్గు కౌఁగిలిం
      తలు బతిమాలుటల్ కసరి తప్పులు వట్టుటలున్ జెలంగు కాం
      తలరతమే రతంబు మఱి తక్కిన వెల్లఁ గ్రియాప్రధానముల్."

అనే పద్యం తెలుఁగుమాటలతో చెప్పాలని “చెప్పిందేనా?” కొన్ని పద్యాలు తెలుఁగు పదాలతోటే ప్రారంభమవుతాయి. అంతట్లో సంస్కృతంలోకి దూఁకుతాయి. ఆ పట్లాన్ని యిఁక సంస్కృతంగానే పద్యమంతా పూర్తి అవుతుంది. కాఁబోలు ననిపిస్తుంది. అంతట్లో మళ్లా తెలుఁగులోకి దొర్లుతాయి. దీనికి తల్లక్రిందులుగా కొన్ని నడుస్తాయి. యీ కర్మాలన్నీ వివరించవలసివస్తే చాలా పెరుఁగుతుంది. యీ తుట్టతుదిమాటలకు కొంచెం వుదాహరణంగా వుండే వకపద్యాన్ని వుదాహరించి విషయాంతరం వుపక్రమిస్తాను.

మ. "ఉరువేగ స్ఫురణాగపాటన పటుద్యోవాహినీ వార్ఘరీ
       పరిణాహారభటీ పటాత్కృతులకున్ బ్రభ్రష్టసారంబులౌ
       తరుషండమ్ములు నిల్చెనేని భవదుద్యద్వాగ్ఘరాసారపు
       ష్కరకోలాహలమున్ సహింపఁగలుగున్‌గాకవ్యహంకారముల్

యీ పద్యంలో తి. శాస్త్రిగారి కవిత్వాన్ని వెం. శాస్త్రి వర్ణిస్తున్నాడు. సమాసంతో ప్రారంభమైంది. మళ్లా విడివిడి తత్సమ పదాలు కొంచెం దొర్లాయి. మళ్లా సమాసం ప్రారంభమయింది. మళ్లా విడివిడి తత్సమాలతో పూర్తిఅయింది. “మొనగాఁడొక్కరుఁడు" అన్నదో కేవలం తెలుగుతో ప్రారంభమైంది. మళ్లా సమాసంలోకి దూకింది. మళ్లా విడివిడి పదాలల్లోకి వచ్చింది. ఆయీవిధానమంతా తిరుపతిశాస్త్రిగారివని వుదాహరించినవాట్లల్లో కూడా చూచికోండి. వ్రాసినకొద్దీ వ్రాయవలసే వుంటుంది. లోకాన్ని మోసపుచ్చడానికి వ్రాయాలంటే, కొన్నిసమాసాలు వ్రాయవచ్చును. అందులో అర్థం లేకుండా "దశదాడిమాది"