పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

365


వాక్యంవలె వ్రాసినా యెవ్వరూ అసలు గ్రంథకర్త చెప్పేదాఁకా కనిపెట్టనేలేరు, యెందుచేత? “యేదో అర్థంలేకుండా వుంటుందా? మనకు గోచరించింది కా"దనుకుంటారు. అట్టిది శ్రవణానందంలో వకటి వ్రాశాను. యిక్కడ వుదాహరిస్తాను.

ఉ. "వేసవి వచ్చె భాస్కర నవీనగవీ నమితా౽మితాచ్చ గు
     చ్ఛాసవ వాసనైక వలనా కలనా కులనాయికా సము
     చ్ఛ్వాసన శాసనాదికృతి ఝంకృతి సంకుల షట్పదావళీ
     భాసుర శుష్కపుష్ప విటపప్రకర ప్రతిభాసమానమై.”

యీ పద్యంలో అర్థంలేదని యెవ రనుకుంటారు? వుందే అనుకుంటారు. తీరా లేదని యెవరేనా సాహసించి అంటారే అనుకుందాం. యెవరో చెప్పి సమన్వయిస్తారు. మా జీవితకాలంలో అయితే మేమే చెపుతాము. దీనిపేరేమిటి? కవిత్వంకాదు; పాండిత్యం అనిపించుకుంటుంది. చూడండి, యీమధ్య బ్రహ్మశ్రీ చర్ల భాష్యకారశాస్త్రులుగారు "మేకాధీశా” అనే నాలుగక్షరాలు పల్లవిగాగ్రహించి, సుమారు క్రౌనుసైజులో అయిదారు వందల పుటలగ్రంథం వ్రాశారు. దానిలో భారత, భాగవత, రామాయణాదులన్నీ వ్యాఖ్యానించారు. యేమీ ఆలా యెందుకు వ్యాఖ్యానించకూడదు? ఓంకారంలో సమస్తవేదాలూ, స్మృతులూ, శాస్త్రాలూ అన్నీయిమిడి వున్నాయని ఋషులు చెపుతూవున్నారా, లేదా? అది అసత్యమా? కాదు. ఆలా వున్నట్టు నిరూపించడం యేమనిపించుకుంటుంది? కవిత్వమనిపించుకుంటుందా? అనిపించుకోదు, పాండిత్యమనిపించుకుంటుంది.

చాలాదూరం వ్రాశాను. బాగా విచారిస్తే కవిత్వం వేఱూ, పాండిత్యంవేఱూకాదు. కాఁబట్టే "సూరిః పండితః కవి" అని అమర కారకుఁడు పర్యాయపదాలుగా వాడివున్నాఁడు, కాని కవిపదం వేదాల్లోకూడ తఱుచు వాడఁబడి వుంది. పండితపదం కూడా వాడఁబడి వుందేమోకాని కవిపదానికి వున్నంత ప్రయోగబాహుళ్యం దానికి లేదేమో? యేమీ వేదం రానివాళ్లకు కూడా “శుచిర్విప్రశుచిః కవిః" "కవిం కవీనా ముపవశ్రమస్తమమ్” అంటూ బోలెఁడు ప్రయోగాలు దొరుకుతాయి.

యేమైనాసరే, క్రమంగా కొన్నాళ్లకు కవివేఱూ, పండితుఁడు వేఱూగా వాడకంలోకి డేఁకింది ప్రవృత్తి, సామాన్యుల ప్రవృత్తి అనుకున్నారేమో? మహాపండితుల ప్రవృత్తే. అందుచేతేకదా అప్పయ్యదీక్షితులవారు "పిళ్లః కవిరహం విద్వాన్" అనడం తటస్థించింది. యీ అనడంలో పిళ్ల'కుఁ యెక్కువగౌరవం యిద్దామనికాదు. కవికంటే విద్వాంసుఁడే మాననీయుఁడనే తాత్పర్యంతోనే దీక్షితులవారి నోటమ్మట ఆవాక్యం దొర్లింది. అప్పయ్యదీక్షితులు మహాకవి. అయినా ఆయనకు పండితుణ్ననిపించుకోవాలనే కుతూహలం.