పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/355

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

359


“ప్రాణగొడ్డం"గా కనపడింది. తరవాత వూరువెలపలికి వెళ్లి రహస్యంగా మందలించాను. కాని ప్రయోజనం లేకపోయింది. తలతిక్కపట్టు పట్టి కూర్చున్నాఁడు. 'ససేమిరా’ అన్నాఁడు, ఆ యీ విషయం 'గుంటూరిసీమ'లో సూత్రప్రాయంగా వివరించే వున్నాను. పలువురు యెఱిఁగిందికూడాను. తుదకు సభలో యేదో యితఁడు రసాభాసు చేస్తాఁడని నాకు పూర్తిగా భయంకలిగింది. దానికి తథ్యంగా ఆసనచర్చ వచ్చింది. అప్పుడు అతఁడు చేసే రసాభాసు ముందు జరగఁబోతుందని యెఱిఁగివున్న నేను - అంతకంటే కొంత పాయంటు వున్నది గదా అని చెప్పి నేనే ప్రాచీనావీతిమార్గం త్రొక్కిసభలో తినవలసినతిట్లూ, దీములూ నేనే భరించవలసివచ్చింది. అతఁడుమాత్రం నిస్తరంగ సముద్రంలాగ వూరుకున్నాఁడు సమయానికి. అతఁడు చేయఁదలఁచిన రసాభాసేమిటంటే; అది నాకు ముందే వివరించాఁడు- "వారు గనక యీవేళ సభలో మనలనుగుఱించి అభినందన పద్యాలు ఆశువులో చెప్పేయెడల అవి రసవంతంగా, నిర్దుష్టంగా వుంటే వూరుకుంటాను. ఆలా వుండకపోతే వారిని నే నేమీ అనేది లేదు గాని నారాయణ! నారాయణ!’ అంటూ చెవులు మూసుకుంటా"నన్నాఁడు. అయ్యా! యెంతటి మహా కవికేనా గంటకు వందలకొలఁదిగా లెక్క వచ్చేటప్పుడు రసం రావడమున్నూ నిర్దుష్టత్వమున్నూ సాధ్యమవుతుందా? పయిఁగా వారు మమ్మును అభినందించే సందర్భంలో వారిని యీసడించడం యెక్కువ రసాభాసుగా వుంటుందని నాకు భయంవేసింది. యెంత చెప్పినా తోవలోకి రాలేదు. యీలాటి పెంకెపట్టుపట్టడం అతనికి తఱుచు వుండేది. అది అతని అన్నలదగ్గిరా వుంది. యింకా యిప్పటికీ వక అన్నగారు జీవించే వున్నారు. ఆయనతో కొత్తగా మాట్లాడవలసివస్తే విధిగా పోట్లాటవచ్చి తీరుతుంది. కాని యెంతో మంచివాఁడు. ఆ మంచి యెవరికి తెలుస్తుంది? అందఱికీ తెలిసేది “తలతిక్కపట్టే". యీ విషయం మనస్సులో పెట్టుకొనే

చ. "తిరుపతిసింగమున్ సరిగఁద్రిప్పి ప్రశాంతమొనర్ప వేంకటే
     శ్వరునకుఁ దక్క నీయనుఁగు బావకు గీవకు నోజగూర్చు నీ
     గురునకుఁ జర్ల చంద్రునకుఁగూడ వశం బెటు లయ్యెడున్ దురు
     ద్ధర మది నేను దానిబలు ధాటికి నొక్కొకవేళ జంకెదన్"

అని గీరతంలో వ్రాసివున్నాను. సర్కసులో సింహాలను ఆడించే మానేజరుకి దినదినగండంగా వుండడం అంతా యెఱిఁగిందే. ఒక్కొక్కప్పుడు యితఁడు యెదురు తిరిగితే నాగతికూడా ఆలాగే వుండేది.

సరే! గుంటూరువిషయం తుదకి నామీఁదకే వచ్చింది. అంతా నన్నే దూషించారు. తిరుపతిశాస్త్రి మంచివాఁడే అయినాఁడు. యేదో జరిగిపోయింది. ఆ తర్వాతకూడా కొప్పరపు