పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

358

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నన్నుఁగూర్చి పేర్కొని వున్నాను. మాకు వున్న బిరుదులన్నీ వుమ్మడి దమ్మడిగా వుండవలసినా యిదివొక్కటీ పృథక్కుగా వుండడానికి కారణం యీ “వుత్పన్న మందబుద్దులే" అని విజ్ఞులరయుదురుగాక! యీ సందర్భాలు నేను వ్రాయడం అపహాస్యాస్పదమయినా వ్రాయవలసి వచ్చింది, క్షంతవ్యమని కోరుతాను.

తిరుపతిశాస్త్రులుగారు ముక్కుకు సూటిగా వెళ్లేవారేకాని యీ మార్గంలో వారు కారన్నంతలో ఆయనకి వచ్చేలోటులేదని నా నమ్మకం. దీనివల్ల అధఃకృతి రాకపోవడమే కాక పురస్కృతికూడా కలుగుతుందనే ధైర్యంతో దీన్నిందు పేర్కొన్నాను.

కలహం యెవరితోనేనా సంఘటించినా నేను దాన్ని పాటించకుండా ఆవలివారు మాట్లాడితే మాట్లాడడానికి యిష్టపడతాను. మావాఁడికి అదికిట్టేదికాదు. కొప్పరపువారిని తిరుపతిశాస్త్రితో సంప్రతించకుండానే అభినందన పద్యాలు వ్రాసి బందరుకు అవధానార్థం రావలసిందని ఆహ్వానించింది నేను మాత్రమే. ఆ విషయం “అయ్యా! కొప్పరపుం గవీశ్వరులు" అనే పద్యాలు చెపుతాయి. అతనిసమ్మతికూడా వున్నట్టు అందలి "తిరుపతి వేంకటేశ్వరులు" అనే చేవ్రాలు చెప్పినా అది మా ఆచార ప్రకారం చేసిన చేవ్రాలేకాని అతనిసమ్మతిని నిరూపించేదికాదు. అప్పుడే కాదు యిప్పుడే కాదు, వారియందు నాకు పరమాదరమే. వారికున్న శక్తి సామర్థ్యాలను యెంతవఱకు గౌరవించాలో అంతవఱకేకాక హెచ్చుగా గౌరవించడం నాకు యిష్టమే. అయితే యేంచేసేది? మా తిరుపతి శాస్త్రికి సమకాలికులలో యెవరికవిత్వమూ నచ్చేదికాదు. అందులో వారి కవిత్వమంటే మఱీ యెదురు తిరిగాఁడు. "ముసుఁగులో గుద్దులాట" తటస్థించింది. యెవరికేనా "సర్టిఫికట్టు" యివ్వవలసివస్తే “బ్రహ్మిష్ఠో బ్రహ్మం" మీఁద నాతో పాటు చేవ్రాలుచేసేవాఁడే కాని మనఃపూర్వకంగా కాదు. (యీ సర్టిఫికెట్టుగాథకు సంబంధించిన వక చిత్రమైన విషయం నెల్లూరులో జరిగిందివుంది. దాన్ని శ్రీ వేమూరి శ్రీరామశాస్త్రులుగారు బాగా యెఱుఁగుదురు. వారు చెపితే వినఁగలందులకు కోరుతాను.) “నీకు బాగుండని కవిత్వమంటూ లేనేలేదు. అన్నీ బాగానేవున్నాయంటావు. నీమాటకు విలువేమిటి?” అని నన్ను సణిగిపోసేవాఁడు. యెంత సణిగినా చేవ్రాలుమాత్రం చేసేవాఁడు. యీ విషయంకూడా ఆలాగే జరిగిపోతుం దనుకున్నాను. పూర్తిగా పట్టుపట్టాఁడు. ఆ కవీశ్వరులున్నూ మఱికొందఱు పెద్దలున్నూ వచ్చి మమ్మల్ని విందుకు ఆహ్వానించే సందర్భంలో నేను వారిని అభినందిస్తూ వుంటే అనభినందనానికి ప్రారంభించాఁడు. యేంచేసేది? మళ్లా అతని వాక్యాలు ఖండించి అభినందనానికే వుపక్రమించాను. కాని మళ్లాపూర్తిగా యెదురు తిరిగాండు “తోఁటకూరలో పురు"గన్నట్టుగా వారి ఆశుధారాప్రజ్ఞను యీసడించడానికి ఆరంభించాఁడు. నాకు