పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

356

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నాకు యిప్పటికీ తెలియదు. అది నావద్దనే కాని యెక్కడా లేనేలేదని అతనికి పిచ్చినమ్మకం వుండేది. అందుచేత అసమర్ధుఁడుగా వున్నాసరే నన్ను ఆలా బలవంతపెట్టడం తటస్థించేది. దానికి తథ్యంగా నేను ఆవేళ చేసిన ఘనకార్యాన్ని కూడా వ్రాస్తూవున్నాను. దీన్నినేను యెంత మభ్యపెట్టి వ్రాసినా ఆత్మోత్కర్షగా వుండకపోదు. యేంచేసేది? “రోట్లో తల దూర్చి రోఁకటి పోటుకు జంకితే యేమవుతుంది?"

సరే! చెప్పడానికి ప్రారంభించాను. కొన్ని ప్రథమచరణాలు చెప్పడం జరిగింది. అంతా పండితులూ, కవులే పృచ్ఛకులు. అందులో వక పృచ్ఛకుఁడు పిచ్చివాఁడుగా వుంటాఁడు. కాని మంచి సాహితీపరుఁడున్నూ, కవిన్నీ అతఁడు అడిగినప్రశ్న లక్ష్మీదేవిని పృథ్వీ వృత్తంలో వర్ణించవలసిందని మాత్రమే. ఇందులో కష్టం లేశమున్నూ లేదు, సాబీగానే చెపితే తీరిపోతుంది. కాని “వుత్పన్నమందబుద్దు" లన్నట్టు తాత్కాలికంగా కన్నుమూసి తెఱచేలోపుగా పుట్టే అనేక చిత్రవిచిత్రాలు ప్రతిఫలించే బుద్ధిగల నేను వక అగమ్యగోచరప్పుంతగా ప్రథమచరణం ఆరంభించాను. ఆవూహ అంతలో నాకెలా తట్టిందో యిప్పటికీ నేను చెప్పలేను. యెవరేనా చెపుతారేమోకాన యిఁక ముందున్నూ నేను చెప్పలేను.

“సరోజనిలయాం సరోజనికరామ్"

అని చెప్పాను. యిది పృథ్వీవృత్తపాదం అనుకోవడానికి అవకాశం లేనేలేదు. యేలాటి లాక్షణికుఁడున్నూ పృథ్వీవృత్తపాదంగా మాఱుతుందని అనుకోఁడు. నాకేనా పాదారంభంలో యీలా మోసంచేదామనేదురూహలేదు. కాని సరోజనిలయాం దాఁకా చెప్పేసమయంలో చట్టనయీ దురూహ పుట్టింది. యిది దురూహే అనండి, లేదా సదూహే అనండి. యీలాటి చణుకులు సభలో - అందులో అవధానసభలో – మిక్కిలిగా వుపకరిస్తాయి. ఆ వుపకరించడం యేలాంటిదో వివరిస్తాను. యెప్పుడయితే నే నీచరణాన్ని చెప్పి పృథ్వీవృత్తపు నడకలోకాక వేఱొక వృత్తపు నడకలో లయవేసి చెప్పడానికి ఆరంభించానో, వెంటనే పృచ్ఛకుఁడు "బావా! వృత్తం తప్పిం"దన్నాఁడు. నేను “తప్పితే తప్పిందిలే. తరువాత తి. శా. సవరించుకుంటాడులే. వ్రాసుకో"మన్నాను. యిదంతా నా కొంటెతనపు నటనే. "కొంటెలలోనఁ గొంటెయున్ గావలెఁ" గదా! దానిమీఁద శివరామశాస్త్రి (శిష్యుడు) అన్నాఁడుకదా : "మళ్లా తి. శాస్త్రిగారు సవరించుకోవడమెందుకు? తమరేసవరించండి" అన్నాఁడు. "నాకు వోపిక లేనిసమయంలో తి. శాస్త్రిగారి బలవంతాన్ని పట్టి చెప్పే చెప్పడంలో యింతకంటె అనుకూలంగా చెప్పడం కుదరదు. "పుణ్యానికి పెట్టే అమ్మా, నీ మొగుడితో సమానంగా పెట్ట"మంటే యెలాగ? సవరించఁబోతే మఱీతప్పుతుందేమో" అన్నాను అతనితోటి. దానిమీఁద తిరపతిశాస్త్రి అన్నాఁడు కదా- "బాగుందిరోయ్! మొట్టమొదటినుంచీ