పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

355


యింట్లో లేకలేక కలిగే సంతానానికి పురుడువచ్చే రోజులు, వున్నదేమో పరదేశం. అట్టి సమయంలో నేను వెళ్లడానికి యెలా కాళ్లాడతాయి? అందుచేత రాలేనంటే “డాక్టరు శేషగిరి నీ శిష్యుఁడేకదా. అతన్ని వెంటఁబెట్టుకొని రా. వచ్చి వూరికే సభలో కూర్చో. లేదా, సభలోనే పడుక్కో సర్వమూ నేను నిర్వహిస్తాను” అని పట్టుపట్టి రప్పించితీరాఁడు కాని వదిలిపెట్టలేదు. పైఁగా నేనున్నానంటే చాలు, యేమీ చేయనక్కఱలేదు. మొట్టమొదటినుంచీ అతనికి ఆలా అలవాటయింది.

తీరా ఆ సభ జరిగేటప్పుడు మామూలు ప్రకారం మొదటిచరణం నీవే చెప్పాలన్నాఁడు. చెప్పేశక్తి నాకులేదు. స్వరం హీనస్వరంపడి అప్పటికప్పుడే నెల్లాళ్లయింది. అయినా తప్పదన్నాఁడు. ధారణ పట్టనక్కఱలేదులే అన్నాఁడు. అప్పుడే నే నీ పద్యాలు చెప్పవలసివచ్చింది :

చ: “దినదినమున్ జ్వరార్తిమెయి దేహబలమ్ముడివోయి యున్నప
     ట్టున ననుఁ జెల్లయాంబిక కడున్ ముదమారఁగఁ బిల్వనంపటల్
     మనమున భేదమోదము లమర్చుకతమ్మున “లంఘనమ్ములన్
     మనుగుడు” పన్నసామెతకు మంచియుదాహృతి చిక్కె నేఁటికిన్,

చ. జ్వరపడియున్న హేతువున సాయము నీ కొనరింపఁజాల నో
    తిరుపతిశాస్త్రి! నీకు నలదేవి పరాంబిక యుండ వేంకటే
    శ్వరుఁ డొనరించుసాయ మొక బ్రాఁతియె? నీవు దలంచినన్ ధరా
    ధరములు ముక్కముక్కలగు ధారుణి క్రుంగు నభం బభం బగున్.

ఉ. పూనుము కార్యభారమును “బూన సుదర్శన" మన్న దేవకీ
    సూను కథావిధానమును జూపఱు లాత్మల సంస్మరింప నే
    మౌనము పూని నీ శుభ సమగ్రతకై జపియించుచుందు నీ
    పై నొకచూపు తక్కుసభపైనొక చూపునుగా మెలంగుదున్."

యీలా యెంతచెప్పినా మొదటిచరణం నీవే మొదలుపెట్టాలని బలవంతపెట్టాఁడు. ముఖ్యకారణం గుట్టువిడిచి వ్రాస్తూవున్నాను. అవధానానికి ధారణాశక్తి ప్రథమసోపానం. పాండిత్యం వుంటే పండితులను సంతోష పెట్టవచ్చు - ప్రయోగవిశేషాలద్వారా. లేదా, లేకపోతుంది. అనేకులు అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తారు. ముందు చరణంలోనే ఆ చిక్కులన్నీ వుంటాయి. వాళ్లమనస్సు నొచ్చకుండా మృదువుగానే వాళ్ల ప్రశ్నలు తప్పని వాళ్లకు బోధించేలాగు పరాక్రమించాలి. ఈ విషయంలో వుండే తెల్విని యేమని పేర్కొనాలో