పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

357


మొదటిచరణం నువ్వు చెప్పడం ఆచారం కనక చెప్పమన్నాను కాని చేతకాక కాదు. తప్పని తెలుస్తూ వున్నప్పుడుకూడా తప్పులే చెప్పమన్నానానే" నన్నాఁడు. యిక్కడికి “సభంతా గొల్లలే” అన్నట్టయిందా? అయినా యింకా యెవరేనా యీగుట్టు తెలుసుకున్నవారు సభలో వున్నారేమో అని "అయ్యా! తప్పిందని మావాళ్లందఱూ అంటూ వున్నారు. నాకు తప్పలేదని తోస్తూవుంది; మీ రేమంటా"రన్నాను. వారున్నూ "తప్పినట్టే వుం"దన్నారు. “అలా అయితే యిప్పడు చూడండీ” అంటూ “వరాం భాస్వరామ్" అనే అక్షరాలు తుట్టతుదనుచేర్చి స్వరంకాదు, గమనాన్ని మార్చి చదివేటప్పటికి పృథ్వీవృత్తపాదంగా కనపడడంతోబట్టే అందఱూ డిల్లపోయారు.

ఈ వ్రాతకు ఫలితం నాకు సంబంధించిన వుత్తరకుమారప్రజ్ఞలను ఈ “ముదిముప్పన బాలపాపచిన్నె"గా లోకానికి వెల్లడిచేసి తద్ద్వారాగా అపహసించబడడమేనా? నాటి అవధానాని కేమేనా వుపకరిస్తాయా? అంటే, నాకు తోcచినమాటలు వ్రాస్తాను వినండి. యీపోకడ తప్పుకాని దాన్ని తప్పుగా కొమ్ములు తిరిగిన పండితకవులను, అందులో నాకన్నా మిన్నా అనుకోతగ్గ తిరుపతిశాస్త్రి అంతటివాణ్ణి నమ్మించి మళ్లా వొప్పుకింద వొప్పించడం జరిగింది. కనక, యీపైని నిజమైన తప్పుచెప్పినా పృచ్ఛకులు తలవంచుకొని కిక్కురుమనక వ్రాసుకోవడమేగాని మళ్లా నోరు మెదపడం అంటూ వుంటుందా? దానితో అవధానభారం యెంతో తేలికవుతుంది.

యీలాటి లబ్జులు నావద్ద వుండడం తి. శాస్త్రికి బాగా తెలుసును. నా సహవాసం వల్లకూడా యివి అతనికి అబ్బలేదు. యివి యేలాటివి? అంటే "పుట్టి నేర్చుకొనెనొ, పుట్టక నేర్చెనో చిట్టి బుద్దు లిట్టిపొట్టి వడుగు" అని పోతరాజుగారు చెప్పినమాదిరివి. ఆ యీ చిట్టిబుద్దులకు సంబంధించిన యితిహాసాలు యింకా చాలా ఉన్నాయి. వీట్లనుబట్టే మాతిరుపతి శాస్త్రికి నాయందు యెక్కువగౌరవం వుండేది. దాన్నే నేను అతని అనంతరమందు జరిగిన సానుభూతిసభలో

“ఎవఁడు నా కెక్కుడయ్యు నాయెడలఁ గార
 ణాంతరమ్మున గురుభావ మంతరంగ
 ముననెకాక పయికిఁగూడఁ గనఁగఁజేసె
 నట్టి తిర్పతికవి దివికరిగె నకట."

అని గూఢంగా, సూత్రప్రాయంగా వుటంకించి వున్నాను.

యీలాంటి “వుత్పన్నమందబుద్దులకు" సంబంధించిన నా చేష్టలను బట్టేనేను “అభినవ రామలింగ బిరుదాంకుఁడను" అంటూ వక రాజసభలో వొకానొక సందర్భంలో ప్రత్యేకించి