పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చూస్తూవుండఁగా యే వీసెఁడో, అఱవీసెఁడో తీసేస్తారనిన్నీ దానితో అది యావత్తూ తీసేశారనుకొని కార్యక్రమాన్ని జరుపుతుందనిన్నీ వినడం. దానికి ఆమాత్రం తీసివేయడమేనా అపేక్షితంగాని మావాఁడికి ఆమాత్రమున్నూ అవసరం వుండేదికాదు. యెంత బుద్ధిశాలీ కాకపోతే అంతకుముందు గోచీపెట్టీపెట్టని వయస్సునుంచిన్నీ కవిత్వం చెపుతూ లోపాయి కారీనైతేయేమి, పబ్లీకుగాఅయితేయేమి కొన్ని పండితసభలలో కొన్ని అష్టావధానాలు చేసివున్ననాతో కాకినాడ సభలో సంపూర్ణ శతావధాన శకటాన్ని నడపడానికి కొలఁదికాలంనుంచి మాత్రమే కవిత్వవ్యాపారంలో ప్రవేశించిన తిరుపతిశాస్త్రి సమానంగానో, నాకన్న అధికంగానో పూని పనిచేయంగలఁడా?

చెపితే నమ్ముతారో లేదోగాని కాకినాడ అవధానానికి ప్రారంభించేటప్పటికి అది చలికాలమైనా వొళ్లంతా చెమటతో తడిసిపోయింది. అప్పటికి మాకింకా శాలువులులేవు. సామాన్యమైన నూలుబట్ట పూర్తిగా కప్పుకున్నాను. ఆబట్టంతా తడిసిపోయింది. అతనికిమాత్రం యీ అవస్థ కలగలేదు. అతఁడు మహా సాహసుఁడు అని నేను వ్రాయడానికి యీలాటి వెన్నో కారణాలు అనుభూతాలే వున్నాయి. "గుండెలు తీసిన బంటు” అంటే అతఁడే. ముమ్మాటికీ అతఁడే. ఈ విషయాన్ని సమర్థించవలసి వస్తే చాలా సంగతులు వ్రాయాలి. యేదో వకటిరెండు ప్రస్తుతోపయోగంకలవి స్పృశించి విడిచాను. యింతకూ మా మైత్రిని భంగిద్దామని కొందఱు పుల్లింగాలు పెట్టఁదలఁచినా మామా శక్తులయందు మాకుమాకు వుండే గాఢమైన నమ్మికనుబట్టి వారి వారి పుల్లింగాలు విఫలమై మా మైత్రి ఆలాగే వజ్రలేపంగా నిలిచిపోయిం దనియ్యేవే.

యెల్లప్పుడూ పనిచేసి లక్ష్యలక్షణాలు సేకరించి సభలో ప్రతివాదులను ప్రమాణప్రమితమైన వాదంతో అరికడతాననిన్నీ సభారంజకతాశక్తి కలవాఁడననిన్నీ అతనికి నాయందు అమితమైన ప్రేమ వుండేది. బందరులో టీచరుగా ప్రవేశించాక యెక్కడికీ సభార్థం వెళ్లడానికి నాకు పూర్వంలాగ అవకాశంలేక "అబ్బాయీ! నువ్వు వెళ్లి వారిని సంతోషపెట్టి రారాదా?” అంటే దానికి అతఁడు నాకు వ్రాసిన జవాబు ఆతనికి నాయందు వుండే గాఢవిశ్వాసాన్నే కాక నిష్కపటత్వాన్ని కూడా వెల్లడిచేస్తుంది. గుంటూరు ఆహ్వానవిషయంలో అతణ్ణివెళ్లి రమ్మంటే వ్రాస్తాడు కదా, "నేను వెడతాను. అవధానాదికమున్నూ చేస్తాను. యెవరోవైదికప్పేరంటాలు వచ్చి వెళ్లిందంటారు. (యీమాట తలుచుకుంటే నాకు యిప్పుడు నవ్వు యేడుపూ రెండూకూడా వస్తాయి.) కనక నువ్వు వచ్చేదాకా వెళ్లేదిలే"దన్నాఁడు. శ్రీరావు చెల్లయ్యమ్మారావు బహద్దరువారి షష్టిపూర్తినాఁటికి నేను అప్పటికప్పుడే మూఁడు మాసాల నుంచి చలిజ్వరంతో కొట్లాడుతూవున్చాను. పైఁగా