పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఒకప్పుడు నాకూ వినిపించేవాఁడు గాఁదు. “ఏటికి నాకు నీదురద" అంటూ వ్రాసి జమాయించి ప్రచురించేవాఁడు. సమయోచితంగా తప్పించుకునేశక్తి అతనికివుండేది. నాకు వున్నదున్నట్టుగా చెప్పి వొప్పించవలసిందేకాని సమయోచితంగా నడిచేశక్తి యిప్పటికీకూడా లేదు. అందుకే వక్రమార్గం తొక్కే వారికి శరణంటాను.

యీలాటిభేదాలు వ్యక్తిగతాలు కొన్ని వుండకుండా యెక్కడా ఐక్యం తటస్థించదుగదా! సభాముఖంలో వంకరమార్గం త్రొక్కి ముఖపిధానంచేసి, యెదటివాళ్లకు నోరాడనివ్వక పోవడంలో అతనికి మంచి శక్తి వుండేది. కాని అది తావన్మాత్రంలో ఆఁగిపోతే యేంలాభం? మర్నాడు మళ్లా అడిగితేకూడా నిలిచే పద్ధతివాదంగాని పనికిరాదనేవాణ్ణి నేను. అందుకోసం తాత్కాలిక విజయానికి యెన్నఁడూ ప్రయత్నించక, వొక్కొక్కదానికి యెన్నో ప్రయోగాలు వెదికివెదికి వేసారి అప్పడు దాన్ని బయటికి పెట్టడమే అప్పటికీ యిప్పటికీ నా ప్రకృతి. యిందుకోసం అతఁడు నాయందు ఆంతరంగికంగా చాలా కృతజ్ఞత చూపేవాcడు. నా మాటను పరమప్రమాణంగా భావించేవాఁడు. పోట్లాడినప్పుడు పోట్లాడేవాఁడే అనుకోండి. పోట్లాడినా ఆంతరంగిక విశ్వాసం మాత్రం యెక్కువగా వుండేది. ఆ కారణంచేతనే పయికి "కైకురుబొయికు" ర్లాడుకుంటూవున్నా మా మైత్రికి అప్పడేకాదు, యెప్పటికిన్నీ భంగంకలుగ లేదు. భంగంకలిగించాలని మా బాల్యంలో ప్రయత్నించిన పుణ్యజనులు కూడా కొందఱు కొంత ప్రయత్నించి విఫలు లైనారు.

వేంకటగిరిలో అలవేళ - అంటే, అబోధవేళదాఁకా అవధానంలో కూర్చో పెట్టడంచేత కొంచెం లోపం వస్తుందేమో అనే సందేహం సభ్యులకే కాదు నాకున్నూ కలిగింది. అది శ్రీ ముద్దుకృష్ణయాచేంద్రులవారి సభ. అంతకుపూర్వం శ్రీ చెలికాని గోపాలరావుగారు చేయించిన సభలో నేను అవధానం చేసివున్నాను. అది యేలోపమూ లేకుండా నెఱవేఱింది. యీసారి వంతు తిరుపతిశాస్త్రిది; కనక అతఁడు చేయవలసివచ్చింది. అక్షరం అక్షరంవంతున చెప్పడమూ, మూఁడేసి వ్యస్తాక్షరులు వేఱువేఱుగా యివ్వడం వగయిరాలు నేను చేసిన అవధానానికీ వున్నాయి. దీనికీ వున్నాయి. భేదమేమిటంటే - సమయం ఉదయం 8 గం. మొదలు సాయంకాలం ఆరుగంటలవరకున్నూనా సభకు తటస్థించింది. తి. శా, చేసేదానికి మధ్యాహ్నం 4 గంటలు మొదలు రాత్రి వంటిగంటవరకూ చెప్పవలసివచ్చింది. రాజుగారికేమి, ముఖ్యులైన సభ్యులకేమి, అవధానంచేసే మాకేమి రాత్రిభోజనం లేనేలేదు. పయిగా అవధానం ముగించేవేళ అబోధవేళ అయింది. కొన్నిటిలో ఈషద్వైషమ్యం కలిగింది. అట్టి సమయంలో వక కలహప్రియుఁడు నన్ను చాటుగాపిల్చి "మీయిద్దఱిలో కుడి యెడమభేద మేమేనా వుందా? అని శ్రీరాజావారు కనుక్కోమన్నారు"