పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/347

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

351


   ర్తురు కవికుక్కురమ్ములయి తోఁపఁగ వేంకటశాస్త్రి వీరకే
   సరిగ శతావధాన మను "సర్కసు” చూపితివమ్మ! శాంకరీ!

అని సవరణచేసివున్నాఁడు. మొత్తం యెవరో వెనకాల వుండి ముల్లుకఱ్ఱతో పొడుస్తూవుంటేనే తప్ప రచన సాగించడం వుండేదికాదన్నది ఫలితార్థం. ప్రాచీనకవులలోనేకాదు, నవీనకవులలోనేకాదు యేదో తప్ప యొవళ్లకవిత్వమూకూడా అతనికి నచ్చడమంటూ వుండేదికాదు. అందుచేతే నే నెవరికేనా సర్టిఫిక్కట్టు యిస్తే విధిలేక దానిలో చేవ్రాలు పెట్టడమైతే జరిగేదిగాని అది వొక్కొక్కప్పుడు అన్యథాగా పరిణమింపచేసేవాఁడు. గుంటూరుసీమ గందరగోళానికి అదేకదా కారణమయింది - పోట్లాట తేవడంలో అంతలో తెచ్చేవాఁడు. తరవాత శాంతుఁడుగా వుండేవాఁడు. దాన్ని పట్టి పల్లార్చేదాఁకా నేను విరమించడం వుండేది కాదు. “ఆసీమాంత" పద్యం చూచుకోండి. యీ విషయం పలువురు యెఱిఁగిందే కనక విస్తరించేది లేదు. సర్వసామాన్యంగా మాత్రం "వెంకట శాస్త్రి పట్టుదలమనిషి" అనే పేరు నాకు వచ్చింది. పట్టుదల నాకు వున్నమాట సత్యమే కాని,ముందుగా కలహం తేవడంమట్టుకు అతఁడు తెచ్చేవాఁడు. అది నానెత్తిని బడేది. అందులోనుంచి బయటికి వచ్చేటప్పటికి రక్తమాంసాలు క్షీణించేవి. యెప్పడేనా నాలుగుపద్యాలు పంపితే పంపేవాఁడు; లేకపోతే లేదు ఉపేక్షాభావంతో వూరుకొనేవాఁడు. "యెవరితోఁగాని వివాదము లేకుండా మనకార్యం మనం నెఱవేర్చుకుందా"మని నేను మనస్సా అనుకొనేవాణ్ణి. కాని యెక్కడోగాని నా కోరిక నెఱవేఱేదికాదు. ఆఖరికి కలహప్రియుఁడనేమాట నాకు వచ్చేది. యిది యీరసంలో మాత్రమేకాదు; రసాంతరాల్లో కూడా డిటో ప్రకారమే. అవన్నీ వివరిస్తే గ్రంథం చాలా పెరుగుతుంది. అందుకు సంబంధించిన పద్యాల రికార్డుకూడా వుంది. ఆ పద్యాలు యిక్కడ వుదాహరించడంకన్న యితరుల వల్ల భవిష్యత్కాలంలో చదువరులు తెలుసుకోవడం వుచితంగా వుంటుంది.

మా యిద్దఱిలోనూ అతఁడు అమాయకుఁడని పలువురి అభిప్రాయం. యెవరిదాఁకానో యెందుకు? శ్రీ పోలవరపు జమీందారుగారే వొకమాటు యీ విషయం తేల్చారు. కాని, . అతcడు అమాయకుఁడు కాఁడు; చాలా గడుసువాడు. కవిత్వంలో ఎంత గడుసుతనం వుండేదో, ప్రవర్తనలోకూడా అంత గడుసుతనమూ వుండేది. అతి సాహసం కలవాఁడు. యేదేనా వివాదసందర్భపు పద్యాలల్లో నేను పద్యం వ్రాయవలసివస్తే మొట్టమొదట ఘాటుగా నడిచినా యెంతో తటపటాయించి, యెందఱికో వినిపించి, ఘాటు తగ్గించిగాని ప్రకటించేవాణ్ణిగాను. యీ విషయాన్నే శ్రీ వేమవరపు లాయరుగారు ఆ మధ్య చెన్నపురిసభలో వ్యాఖ్యానించి వున్నారు. అతఁడో? నాకు మాత్రం వినిపిస్తే వినిపించేవాఁడు. ^