పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

340

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సిద్ధపడ్డాఁడు. అప్పుడు నే నన్నానుగదా - "తొందరగా నిష్కారణంగా యెందుకు చస్తావురా? మళ్లా కాఫీ మొదలెట్టి" అన్నాను. దానికి వాఁడిమనస్సు చివుక్కుమంది. దానిమీఁద కాఫీపుచ్చుకొనేదైతే మానలేదుగాని “వొరేయి! నీనోరు విషపునోరు. నువ్వల్లా అనకురా!" అని మాత్రం అన్నాఁడు. వాఁడికి నావాక్కునందు 'తథాస్తుదేవత' లుంటారనే నమ్మకం పూర్తిగా వుండేది. పైకి 'యేమిరా' అనే పిల్చేవాఁడే అయినా వుత్తరాలల్లో “గారూ, నమస్కారాలూ పెట్టేవాఁడు. నే నెప్పుడో వొకప్పుడు అతనికి కూడా "గారూ, నమస్కారాలూ" పెట్టి వ్రాస్తే యెంతో నొచ్చుకుని “యిక యెన్నఁడూ యిట్టి అకార్యాన్ని చేయవ"ద్దని వినయపూర్వకంగానే మందలించాఁడు. నావాక్కునుగూర్చి వాఁడనుమాన పడ్డట్టే సత్యనారాయణ కొండమీఁద పూర్వోక్తమైన ఆ ప్రసంగం జరిగిన ఆఱుమాసాలకు అతఁడు స్వర్గతుఁడైనాఁడు. సకాలమందు వ్రాసిన జాతకం లేకపోవడంచేత అతని స్వర్గతికాలం గుఱితించడానికి వీలిచ్చిందికాదు. యిటీవల 20 వత్సరాల ప్రాయంలో తల్లిదండ్రులను కనుక్కుంటే ఉననకాలాన్ని వొక రొకలాగా, మఱొకరు మఱోలాగా చెప్పడం తటస్థించింది. దాన్నిబట్టి వేస్తే యేం రుజువిస్తుంది? ఆ జాతకాన్నిబట్టే అయితే యిప్పటిదాఁకానే కాదు. యింకా కొంత కాలందాఁకా అతcడు సజీవుఁడై వుండి కొడుకుల సంపాదన తినవలసినవాఁ డని అనుకొనేవాణ్ణి. అతడు *[1]కుంభలగ్న జాతకుడు, పంచమాధిపతి అయిన శుక్రుఁడు అంటే సంతానస్థానాధిపతి మీనమందు ఉచ్ఛపట్టి వున్నాఁడు. యీ శుక్రదశ రాకుండానే, మధ్య కేతుదశ ప్రారంభించిందో లేదో అనుకునే కాలంలో మారకం జరిగింది. అవసానానికి కొంచెం ముందుగా నాపేర వ్రాసిన ఉత్తరంలో "కేతుదశ ప్రవేశించినట్టున్నది" అని వ్రాసేవున్నాడు. ఆ వత్తరం అతని జీవితచరిత్రలో వుదాహరించి వున్నాను. ఆ కేతుదశ యేడేళ్లు జరిగాక, శుక్రదశ 20 సంవత్సరాల్లో అధమం పద్దెనిమిది యేళ్లదాఁకానున్నూ వెరశి 25 యేళ్లు అతఁడు వుంటాఁడనిన్నీ నేను 60 వత్సరాల ప్రాంతంలోనే అస్తమిస్తాననిన్నీ అందుచేత నాకన్న అతని ఆయుర్ధాయం హెచ్చనిన్నీ అనుకొనే వాణ్ణి. కాని 49 వత్సరాలు దాఁటకుండానే అతఁడు స్వర్గతుఁడైనాడు. నాకంటే కూడా అతఁడు చాలాకాలం సన్నంగానే వుండేవాఁడు. కాని ఆత్మకూరు సంస్థానానికి కృతి యివ్వడానికి

  1. *ఆయీ సంపుటంలోని “అతడు కుంభలగ్న జాతకుడు. పంచమాధిపతి అయిన శుక్రుడు అంటే సంతానస్థానాధిపతి మీనమందు ఉచ్ఛపట్టి ఉన్నాడు" అనే వాక్యాలు వ్యాసరచయిత పరిశీలనలోని ప్రమాదపతితాలే కాని వేరుకావు. కుంభలగ్నమునకు పంచమ (సంతాన) స్థానాధిపతి బుధుడేకాని శుక్రుడుకాడు. మీనం బుధునకు ఉచ్ఛరాశికాదు. ఈ జాతకం ఇప్పుడు లభ్యపడనందున ఈ ప్రచురణలోనే ఆవిషయం సవరింప వీలుచిక్కినదికాదు. ఈ విషయం భోగట్టాచేసి పునర్ముద్రణలో సవరింతును- దుర్గేశ్వరశాస్త్రి.