పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/335

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

339

శ్లో. ఆస్థా స్వాస్థ్యే యదిస్యాతాం 1 మేధయా కిం ప్రయోజనమ్
    తే ఉభేయది నస్యాతాం ! మేధయా కిం ప్రయోజనమ్.

పూర్వజన్మసుకృత బలిమిచేతనే పుస్తకం విప్పి పాఠం వల్లించకుండానే వ్యాకరణపాండిత్యాన్ని ఆర్జించాడు.

“ఎవఁడెన్నఁడును బొత్తమెలమి విప్పకయె వ్యా
            కరణపాండిత్యప్రకర్షమూనె.”

అని సానుభూతిసభలో నేను వ్రాసినదాన్ని యిదివఱకే వుదాహరించి వున్నాను. గురువుగారు చెపుతూవుంటే వినేవాఁడు. అదేనా ఒకప్పుడు ఆయనక్కూడా గంగవెఱ్ఱులెత్తించే శంకలుచేసి వేధించేవాఁడు. ఆలాటప్పుడు గురువుగారికి కోపమైతే వచ్చేదిగాని, అంతరంగంలో సంతోషంకూడా కలిగేది. యెందుచేత? కొన్ని శంకలు పిచ్చిశంకల్లా వున్నా కొన్ని శంకలు యేభాష్యంలోనో, యేశేఖరంలోనో వున్నవిగా వుండేవి. (యీ విషయంలో యితఁడు బందరు “డుండుం” వంటి వాఁడు. ఆయనను గూర్చి అన్యత్ర వ్రాశాను) అప్పటికి ఆ గ్రంథాలు చదవకుండా వున్న వాcడినోట ఆలాటివిశేషాలు వెలువడుతూవుంటే యే గురువునకు సంతోషం కలగదు? యీలాటిశిష్యులను గూర్చే "గురూపదేశం ప్రతిభేవ తీక్ష్ణా" అని నైషధంలో వ్రాసివున్నాఁడు. తీవ్రమైనబుద్ధి గురువు చెప్పేదాఁకా నిరీక్షించలేదనీ దానితాత్పర్యం. ఆ లక్షణం మన తి. శా. గారి బుద్ధికి పూర్తిగా పట్టింది. కాని అట్టి గ్రహింపుతోపాటు కొంచెం మననం చేయడంకూడా వుంటే యింకా యెక్కువ వుపయోగపడేది. అది లేక పోవడంచేత యెప్పటికప్పుడు దాcటుకునే మార్గాలు తొక్కి ప్రతిపక్షులకు లొంగకపోవడమే తటస్థించేది గాని దాన్ని గ్రంథరూపంగా ప్రచురింపవలసివస్తే చిక్కురాక తప్పేదికాదు. యీ విషయం అతనికి పూర్తిగా తెలుసును. తెలిస్తేమాత్రం యేంచేస్తాడు? మొదటినుంచీ అలవాటు ఆలా పడింది.

యిది విద్యావిషయంలో మాత్రమేకాదు. శరీరారోగ్యవిషయం కూడా యీలాగే వుండేది. తుట్టతుదిరోజుల్లో అతిమూత్రవ్యాధి కనపడిందని నాపేర వుత్తరం వ్రాస్తే నూజవీటిసంస్థానాన్నించి నానిమిత్తం తెచ్చి వుంచుకున్న మంచి మందును పంపించాను. కొన్నాళ్లువాడి, వ్యాధి నివారణయిందని సంతోషిస్తూ జవాబు వ్రాశాఁడు. దానికి జవాబు వ్రాస్తూ వ్రాశానుకదా - అయితే అయిందిగాని యిఁకమీఁదట కాఫీ అలవాటు పూర్తిగా తగ్గించవలసిందని కఠినంగా వ్రాశాను. అంగీకారం తెలుపుతూ జవాబు వ్రాశాఁడు. మళ్లా అన్నవరం కొండమీఁద సత్యనారాయణ స్వామివారి వుత్సవసందర్భంలో కలుసుకున్నాం. అక్కడ ధర్మకర్తగారు వగయిరాలు కాఫీ పుచ్చుకుంటూ వుంటే వీఁడుకూడా