పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

341


వెళ్లిన సందర్భంలో మే మందఱమూ సర్వసేనా మూర్చగా జ్వరపడడం తటస్థించి దానితో సుమారు రెండేళ్లు తీసుకు తీసుకు తేఱుకున్నపిమ్మట నేను యధాపూర్వకంగానే వున్నానుగాని, అతఁడుమాత్రం కొంచెం సూలకాయుఁడైనాఁడు. యెప్పుడూకూడా దేహారోగ్యానికంటూ యే మందులో మింగుతూ వుండడం నాకు అలవాటు కాని, అతఁడికి లేశమూ ఆలాటి అలవాటులేదు. పైఁగా నన్ను “అస్తమానమూ ఏపాడుమందులో మింగడమే నీపని” అని తిడుతూ వుండేవాఁడు కూడాను. యెప్పుడో స్వల్పంగా లంఖణాలు చేసినా అది వక లెక్కలోనిదికాదు. జబ్బు అంటూ యెఱక్కుండానే యావత్తుజీవితాన్ని గడిపాఁడు. యిఁక జాముకో, అఱజాముకో జీవితం చాలిస్తాఁడనఁగా, కొడుకుచేత వ్రాయించిన పద్యత్రయంలో యీ సందర్భం అతఁడే చెప్పి వున్నాఁడు.

“మ. జననంబెత్తిన దాదిగా నెఱుఁగ నే జాడ్యంబు."

అనే పద్యం జీవితచరిత్రలో వుదాహరించి వున్నాను. మరణకాలం నాఁటికి అతని వయస్సు 50కి లోపే గాని అతఁడు తుట్టతుదకు చెప్పినట్టు “పంచాశాబ్దమేగంగ" అన్నది కాదనికూడా వ్రాసివున్నాను. ఇతఁడు తన వయఃపరిమాణాన్ని గూర్చికూడా యిదమిత్థమని నిర్ణయించే శ్రద్ధకలవాఁడు కాఁడని, జీవితకాలంలో జాతకం వుండికూడా పరిశీలించ లేదనిన్నీ యిటీవల అన్యులు ఆ నిర్ణయం చేయవలసివచ్చిందనిన్నీ విస్పష్టమేకదా! ఆ కారణంచేతనే యితఁడి విద్యావిశేషం సమస్తమున్నూ ప్రతిభాయుక్తమే కాని "ఆస్థాస్వాస్థ్య" ప్రయుక్తం కాదని నేను వ్రాయవలసివచ్చింది. "ఆస్థాస్వాస్థ్యము" లకు బొత్తిగా దాసుఁడుగాక లోకంలో నెవ్వనికిని లక్ష్యపెట్టనంతటి విద్యావిశేషం కలవాఁడు కావడానికి యెట్టి ప్రతిభ అంటే, "నవనవోన్మేషశాలిని" గా వుండే ప్రజ్ఞ అవసరమో చదువరులు గమనింతురుగాక.

నావలె యే రహస్యంగాని యితరులతో చెప్పే స్వభావం అతడిది కాదు. చాలా గుట్టుగా వుండేది అతని నడవడి. వోకవేళ యితరులవల్ల తెలిసి నేను అడిగినాకూడా “శనగలు తింటూ ఆముదాలు చేతులో పెట్టడానికే" శక్యమైనంతవరకు ప్రయత్నించేవాఁడు. అవధానాదులలో కొన్ని విషయాలు కొత్తరకాలు ప్రవేశపెట్టాలని అతనికి వుత్సాహం వుండేది. వాట్లకు నేను వొప్పుకునేవాణ్ణి కాను. యెందుచేతనంటే - ఆ విషయాలు గారడీబాపతులో చేరతాయి గాని కేవలం ప్రతిభైకస్ఫోరకాలు కావు. సార్వత్రికంగా కాకపోయినా క్వాచిత్కంగానేనా ఆ విషయాలు యితరులున్నూ చేసే కిటుకులు, మనం అవధానంలో ప్రవేశపెడితే ఆ కిటుకు కాస్తా బయటఁ బడ్డప్పుడు మన అవధానమంతా యీలాటిదే అనే అపప్రథకు అది కారణం కావలసివస్తుందని నాకుభయం. అతఁడు అప్పటికప్పుడు దాఁటుకుపోవడమే చూచేవాఁడు కాని, భవిష్యత్తునుగూర్చి విచారించేవాఁడే కాఁడు.