పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


భుజంగరావుపంతులవారు. వీరెవరి వద్ద నేమిచదివిరో తెలుసుకోవాలని యెంతో కుతూహలం వుండేది. వక పర్యాయం అడిగేనుకూడా. శ్రీమద్భాగవతంలో పదకొండు శ్లోకాలు ఓగిరాల జగన్నాథంగారివద్దనో, రంగయ్యగారివద్దనో అన్వయం చెప్పకొన్నట్టు చెప్పారు. ఆ సోదరులు నీలపల్లె కాపురస్టులు. వారు పూర్వకవుల తరగతిలో తుట్టతుదివారు. వీరివద్ద సంస్కృతం చదివిన దింతమాత్రమేయైనా పంతులవారు సాహిత్యగ్రంథాలన్నీ పాఠంచెప్పేవారు. తెలుగులో సరేసరి. కొంచెం ఇంగ్లీషు, జ్యోతిషం. యివన్నీ యీలా వుండగా వైద్యం ఇప్పుడు పంచాంగాల్లో భుజంగరాడ్వైద్యశాల అనేదానిలోవున్న భుజంగరావుగారు వీరే. ఔషధాలు స్వబుద్ధినే కల్పనచేసి ఆ శిష్యుడు కిచ్చారు. దానివల్ల ఆ శిష్యుడు లక్షకో, కొన్నివేలకో అధికారైనాడు. అది ఆలా వుంచండి. ఒక భేదం మాత్రం వుండేది. అందఱిపాఠం ఒక మోస్తరు. వీరిపాఠం మరియొక మోస్తరు. దాన్నిబట్టి శిష్యులకు చిక్కుగా వుండేది. ఏమంటే! మిమ్మల్ని ఎవరేనా పరీక్షించినప్పుడు మా గురువుగారు చెప్పినట్టే ఆ పండితులకి పరీక్ష యిచ్చేవాళ్లం. దానిమీద వారు, “యిది పంతులవారి శిష్యరికంలే” అని హేళనగా అనేవారు. ఆ మాటకు మాకు యిబ్బందిగావుండేది. ఏమండీ? పండితులు యిలా అంటారని గురువు గారిని అడిగేం కూడాను, దానిమీద పంతులవారన్నారుకదా! “వొరే! వాళ్లు శుద్ధ ఛాందసులు. వాళ్లకీ సుళువులు తెలియవు. విద్యార్థిని బాగుచేసే తోవలు కొన్ని వున్నాయి. ఆ మెళుకువలు తెలియక పైగా వెక్కిరిస్తారు. “సీతాపతినా రామేణ” అని వుంటే, వాళ్లు, 'రామేణ కదంభూతేన' అని ఆకాంక్షించుకొని, రాముడెటువంటివాడు అని చెప్తారు. అది తప్పకాదుగాని, మనంచెప్పే 'యెటువంటి రామునిచేతను’ అన్నదే వీలయిన మార్గం, యేమంటే, అర్థంలోకూడా విద్యార్థికి అది తృతీయావిభక్తి అని తెలుస్తుంది' అని ఇలాటి సూక్ష్మాలుచెప్పి వారిపద్ధతిని చక్కగా సమర్థించేవారు. ఈ మహాసముద్రంముందు ఆనాటి పండితులలో నెవరోగాని నిలవ బడనేలేరు. కాని అక్కడక్కడ ఆక్షేపణమాత్రం చేస్తూవుండేవారు. వీరు ఆగర్భశ్రీమంతులవడంచేత వీరి విద్యార్థులతో తప్ప ఇతర పండితులకు యే సదస్యపు సభలలోనూ వీరితో సాక్షాత్తూ సంబంధం కలిగేదే కాదు. అందుచేత పరస్పరవాదాల కవసరం పట్టలేదు. వేయేల? మా పంతులవారు అప్పటి పండితులలో “సుల్తాను” అంటే సరిపోతుంది. “ప్రపేదిరే ప్రాక్తనజన్మ విద్యాః" అన్న కాళిదాసోక్తి కీలాటివారే ఉదాహరణం. ఆ విగ్రహం చూస్తే సమస్త విద్యారాశి అని తోచకపోదు. విద్యకు మించిన ఐశ్వర్యం. అది అనాదిసిద్ధం కూడాను. తరువాత పలువురివద్ద చదివినా, ఈ గురువుగారే నా విద్యకు పునాది. శిఖరం బ్రహ్మయ్యశాస్త్రులుగారు.


★ ★ ★