పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా గురుపరంపర

331

ఈలావుండగానే కాశీ ప్రయాణం. ఆ ప్రయాణం విశాఖపట్నంతోనే సమాప్తమై వెనక్కి వచ్చి చామర్లకోటలో ప్రతివాది భయంకరం రాఘవాచార్యులుగారి సన్నిధిని చదువుకోవడం, అక్కడనుంచి మళ్లా స్వగ్రామంవచ్చి కొలదికాలం పిల్లంకకూ, పల్లెపాలెముకూ వెళుతూ చామర్లకోటలో చదివిన లఘుకౌముది తరవాయిన్నీ భారవి తరవాయిన్నీ అనంతాచార్యులుగారి యొద్దనున్నూ, మధునాపంతుల సూరయ్యగారివద్దనున్నూ చదవడం వగైరాలు కొంత తపిసీలుగా జాతకచర్యలో వుండడంచేత యిక్కడ విస్తరించలేదు.

ఇటీవల చాలాకాలానికి విజయనగరం మహారాజావారి దర్శనానికి వెళ్లినప్పుడు, దర్శనం చాలా ఆలస్యంగా కాని కాలేదు. వృథాగా వుండడమెందుకని అంతోయింతో ఫిడేలుమీద స్వరాలుమట్టుకు, కట్టు సూరన్నగారివద్దనూ, సాలగ్రామ గోపాలంగారివద్దనూ చెప్పుకొన్నాను. వీరుకూడ “యేకాక్షర" న్యాయంచేత గురువుగా స్మరింపవలసినవారే. లెక్కపెడితే బ్రహ్మయ్యశాస్త్రులవారి సన్నిధికి కడియెద్ద గ్రామం ప్రవేశించేటప్పటికి యెందఱు గురువులైనారో చదువరులే లెక్కపెట్టుకొంటారు. బ్రహ్మయ్య శాస్త్రులుగారివద్ద చదువుకొంటూ కాశీ వెళ్లినప్పుడు అంతోయింతో వ్యాకరణం నోరి సుబ్రహ్మణ్యశాస్త్రులవారి వద్ద పఠించాను. అందఱు గురువులకన్న విస్తరించి చదివినది శ్రీచర్ల బ్రహ్మయశాస్త్రుల వారివద్ద మాత్రమే. చాలామందికి గురుశుశ్రూష చేసినట్లు పలుచోట్ల సూచించి వున్నాను. చూడండి -

ఉ. ఒక్కొక్కచోట నొక్కొకరియొద్ద నొకొక్కొకమాట చొప్పునన్.
    (నానారాజ సందర్శనంలో & విజయనగరము చూ.)

కారణం చెప్పలేనుగాని, నా చదువు తఱుచుగా కకారాదిగ్రామాలలో జరిగింది. కడియం, కాపులపాలెం, కాటవరం, కాజులూరు, కడియెద్ద, కాశీ, కాకినాడ, ఈ తుదిప్రదేశంలో చదవలేదుగాని చదువుకోడానికి కొంత ప్రయత్నించాను. వరిబీజం భవిష్యదభివృద్ధికి కారణమైనట్టు ఇటీవల తటస్థించిన విద్యాభివృద్ధివల్ల తెలిసికోవచ్చును. “ఒక యిక్కట్టున విద్య" అని వ్రాసిన ఆరోగ్యకామేశ్వరిలో పద్యానికంతకూ ఈలాటి కారణాలున్నాయి. మొదటిమాటకర్థం పైనుదహరించిన ఇక్కట్టే గ్రామం వదలడంవల్ల విద్య వృద్ధి అయిందనిన్నీ వరిబీజం తగ్గినదనిన్నీ తెలుసుకోవలెను. విద్యార్థిదశలో కాదుగాని, యిటీవల బందరు స్కూలులో టీచరీ వదులుకొని వచ్చేరోజులలో జంద్యాల గౌరీనాథశాస్త్రుల వారి వద్ద నలభైయాఱో వత్సరంలో కొంచెం సూత్రభాష్యం పఠించాను. ఆయా గురువులలో చాలామందిని గూర్చి వ్రాస్తే చాలా వ్రాయవలసివుంటుంది. ఎవరున్నూ సామాన్యులుకారు. అందఱున్నూ చారిత్రకపురుషులే. వీరందఱిలోనూ మఱీ విలక్షణ పురుషులు