పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

333



నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

తిరుపతి శాస్త్రిగారు ప్రజోత్పత్తి సం. ఫాల్గునమాసంలో జన్మించాఁడు. నేను ప్రమోదూత సం. శ్రావణమాసంలో పుట్టడంచేత నాకన్న రమారమీ వత్సరంమీఁద యేడుమాసాలు చిన్న. నేను శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారివద్ద చదువుకోవడానికి వెళ్లేపర్యంతమున్నూ మాయిద్దఱికీ యేవిధమైన సంబంధమూ లేకపోవడమే కాక, ఒకరివూరు పేరు వేఱొకరికికూడా తెలియనే తెలియదు. శాఖకూడా ఒకటికాదు. “అడవియుసిరికాయ" పద్యం చూచుకోండి. నేను శ్రీ శాస్త్రులవారి విద్యార్థిత్వానికి ప్రవేశించిన "టయిము” సర్వధారి సం. ఆషాఢమాస మవడంచేత, అప్పటికి నావయస్సు రమారమి 19 టికి లోపు. నాకంటే సుమారు 4-5 మాసాలు ముందుగానే అతఁడు ప్రవేశించాఁడని అన్యత్ర వ్రాసేవున్నాను. ఆలోగా అతఁ డెక్కడెక్కడ శిష్యత్వం చేసిందీ, యేమేమి చదివిందీకూడా అన్యత్ర వ్రాసేవున్నాను. అతఁడు తీవ్రమైన బుద్ధిశాలి. ఆ బుద్ధి తీవ్రత అతని పురాకృత పుణ్యలబ్ధమే అయినా పితృప్రసాద మనికూడా అనుకోకతప్పదు. అతని తండ్రిగారు ఘనాంతస్వాధ్యాయపరులున్నూ, షోడశకర్మాధి కారులున్నూ అయి వుండికూడా తిరుపతిశాస్త్రికన్నా మిన్నా అని వప్పుకోఁ దగ్గంత బుద్ధిసూక్ష్మత కలవారుగా యేదేనా శ్లోకం అన్వయించవలసి వచ్చిన సందర్భంలో కనపడేవారు. ఛాందసులలో యెక్కడోగాని సాహిత్యపరులు వుండరు. వీరు ఛాందసులుగా వుండి కూడా తగుమాత్రం సాహిత్యం కలవారుగా వుండి పెద్దపెద్ద సాహితీ పరులకన్న మిన్నగా అన్వయించే శక్తి కలిగి వుండేవారు. దాన్నిబట్టి వారి బుద్ధివిశేషాన్ని నే నింతగా కొనియాడవలసి వచ్చింది. అంతేకాని తిరుపతిశాస్త్రి యందుండే అభిమానంచేత మాత్రం కాదు. యిందులోతప్ప ఛాందసులకు వుండే ఛాదస్తాలు అన్నింటిలోనూ యితరఛాందసులకు లేశమూ తీసిపోయేవారు కారు సరిగదా, అతిశయించేవారుకూడాను. మొఖం యొక్క ఆకారమున్నూ కాటుకకళ్లున్నూ, బుద్ధి చాకచక్యమున్నూ, మఱికొన్ని పట్టుదలలున్నూ తిరుపతిశాస్త్రికి పిత్త్రియమైనసోత్తే, “కన్యా పితృముఖీ ధన్యా ధన్యోమాతృముఖ స్సుతః" అన్నశాస్త్రం యిక్కడ తారుమాఱయింది. తగుమాత్రం కావ్యపఠనంలో తండ్రిగారే గురువులు; కొంతవఱకు స్కూలు మాస్టరుగారు. అప్పటిస్కూలు మాస్టర్లలో కొందఱు నికరమైన సాహిత్య పరులుండేవారు. మన తి. శా.గారి మాస్టరు వారిలో వొకరు. వారినియిటీవల నేను సందర్శించి వున్నాను, యితనిబుద్ధి