పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

326

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


రోజుల్లో ఆ పనిలో కాస్త పెద్దగా వుండి వుండును. ఈ యప్రస్తుతప్రశంస శేషయ్య వ్యాకరణంమీద వచ్చింది. ఆ వ్యాకరణంలో “తటం, ఏతటం” అంటూ రెండు సంజ్ఞలు వుండేవి. వాట్ల అర్థం అప్పుడు తెలియలేదు సరిగదా. ఇప్పటికీ తెలియనేలేదు. పుస్తకం కనపడితే ఇప్పుడు తెలుస్తుందేమో కాని అది దొరకడం మానేసి చాలా వత్సరాలయింది.

ఈ మోస్తరు పుస్తకాలతో నీలపల్లెలో "లోవరుఫోర్తు" అనే పరీక్ష యిచ్చి సర్టిఫికెట్టు పుచ్చుకొన్నాను. సర్టిఫికెట్టు యివ్వడం ఇనస్పెక్టరుగారే. అప్పుడు యినస్పెక్టరు జిల్లాకు వక్కరుగా వుండేవారు. వారి పేరు క్రోవి దక్షిణామూర్తి శాస్త్రులుగారు. జిల్లాకూడా ఇప్పటి కృష్ణలో చాలాభాగం తూర్పుగోదావరిలోనే వుండేది. ఇనస్పెక్టరుగారు సవారీ బోయీలతో వచ్చేవారు. నేను ప్యాసైన లోవర్‌ఫోర్తుప్యాసైతే స్కూలు మాస్టరీ చులాగ్గా యిచ్చేవారు. ఇదికూడా ప్యాసుకాకుండా యెంతోమంది మాస్టరీపని సంపాదించినవాళ్లు ఆ రోజుల్లో వుండేవారు. యినస్పెక్టరుగారి అనుగ్రహం సంపాదిస్తేచాలు, ఆ రోజులవి. ఈ రోజులను గూర్చి యెఱుగనివారు లేరు గాన విస్తరింపనక్కఱలేదు. ఆ నీలపల్లెలో చదివేటప్పుడు మమ్మల్ని పొరుగూరువాళ్లమనే కారణంచేత మధ్యాహ్నమున్నూ, సాయంకాలమున్నూ సుమారు వక గంట ముందుగా వదలిపెట్టేవారు. ఆ టయిములో మేము త్రోవలోవున్న శీతాఫలపుతోటల్లోనూ, జామతోటల్లోనూ యథేచ్ఛగా కాలక్షేపం చేసేవాళ్లం.

ఈరీతిగా నీలపల్లె చదువు ముగిసింది. తరువాత యానాంలోనే మాకు దగ్గఱచుట్టాలు చక్రవర్తుల బాపయ్యగారి బడిలో ప్రవేశించాను. ఈయనకు అంతో యింతో ఫ్రెంచి, ఇంగ్లీషుకూడా వచ్చును. తెలుగులో మంచిసమర్థులు. కొంతజ్ఞానం ఈబల్లో కలిగింది. ఈ బళ్లో చదివే రోజుల్లోనే కాగితపు అట్టలతో తోలుబొమ్మలుచేసి, నేనున్నూ, ఇంకొక సాతానుల పిల్లవాడున్నూ తోలుబొమ్మలాటాడించడం మొదలు పెట్టేటప్పటికి ఈ సంగతి శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమీందారుగారికి తెలిసి మమ్మల్ని పిలిపించి ఆడించారు. ఏదోకొంచెం సమ్మానం కూడా చేసినట్టు జ్ఞాపకం. బాపయ్యగారిబళ్లో వకరోజున డిక్టేషన్ వ్రాయడంలో కామాలో, పులుప్టాపులో పెట్టడం పొరబడ్డది. ఆయన దానికి కోప్పడ్డారు. ఆ మఱునాడు ఏమితోచిందో యిప్పుడు జ్ఞాపకం లేదుగాని, ప్రతీ అక్షరానికీ, కామా, లేదా, పులుస్టాపు - యిల్లా వుంచాను. దానిమీద పూర్తిగా మందలింపు తగిలింది.

ఈపైన కాపులపాలెంలో శ్రీ భుజంగరావుపంతులవారిదగ్గఱ రఘువంశం చదవడం, ఈ చదివేరోజుల్లో వక వైష్ణవునివద్ద సంగీతం గాలిపాట అంతోయింతో నేర్చుకోవడం, ఈయన యింటిపేరు పురాణంవారు. పేరు నరసింహాచార్యులు. ఈయన నాకు రఘువంశం చదవటంలో సహాధ్యాయి. ఈయన వుపదేశాన్ని బట్టినేను ఆ రోజుల్లో వైష్ణవమతస్థుడుగా వుండేవాణ్ణి. పైకి ఆ మతచిహ్నాలు ధరించకపోయినా శివుడంటే ద్వేషంగా వుండేవాణ్ణి.