పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/321

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా గురుపరంపర

325


చాలా దయాశాలి. ఇంగ్లీషులో త, ద లోనగు కొన్ని వర్ణములవలెనే, ఫ్రెంచిలో ట, డ లోనగు కొన్ని వర్ణములు పలకవు. నన్ను ఆ మేస్టరు గారు “సెలపిల యెంకతసలం’ అని పిల్చేవారు. ఆ బడిలో పిల్లలు జీతమివ్వనక్కరలేదు. పుస్తకాలు వారే యిచ్చేవారు. పైగా యెక్కువ తెలివితేటలుంటే ప్రజంట్లు కూడా యిచ్చేవారు. మాలా - మాదిగా అందఱూ వుండేవారు గాని, యెవళ్లబెంచీ వాళ్లదే. ఒక హాల్లో మాత్రం కూర్చోవడం తప్పదు. వారానికి రెండు రోజులు పూర్తిసెలవు. కాని వరుసగా మాత్రం కాదు. గురువారమున్నూ ఆదివారమున్నూ పిల్లలుచేసిన తప్పేదైనా వుంటే వారాని కొకమాటు శిక్షించడం. దానిపేరు "పటుసారి" అనేవారు. డ్రాయరుమీద పడుక్కోబెట్టి తప్పునుబట్టి బెత్తంతో కొన్ని దెబ్బలు కొట్టడం.

ఆస్కూల్లో అయిదాఱు మాసాలకన్న యెక్కువరోజులు చదివినట్లు జ్ఞాపకంలేదు. "అల్ఫాబెత్తు" అనే మొదటి పుస్తకంలో కొంత అయింది కాబోలును. తెలుగు కడియంలో వచ్చిందెంతో అంతేకాని వృద్ధికాలేదు. అంతలో భగవదనుగ్రహంవల్ల, ఆ ప్రభుత్వం రిపబ్లికు ప్రభుత్వం కనుక, మాలమాదిగలనుకూడ అందఱితో కలిసి కూర్చోనివ్వాలి అనే రూలు ప్యాసయింది. దానితో అన్ని వర్ణాలపిల్లలూ మానేశారు. నేను మాత్రం కొలదిమంది పిల్లలతో ఆ అవకాశంలో ఆ వూరికి సమీపంలోవున్న ఇంగ్లీషు గ్రామం నీలపల్లెలో లోకల్‌ఫండు స్కూల్లో ప్రవేశించాను. పిల్లలంతా మానుకోవడంచేత మళ్లా ఫ్రెంచి స్కూల్లో ఆ రూలు తీసివేశారు. తీసివేసినా తక్కినవాళ్లు ప్రవేశించారు గాని, నేనున్నూ మణికొందఱున్నూ ప్రవేశించలేదు.

ఆ నీలపల్లె స్కూల్లో ముగ్గురు మాస్టర్లూ సుమారు అయిదాఱువందల పిల్లలూ వుండేవారు. నాలుగో క్లాసులో అఱవై, డెబ్బై మంది వుండేవాళ్లం. ఆఱువేల నియోగులు చేమర్తి వేంకటాచలంగారు హెడ్మాస్టరు. శేషయ్య వ్యాకరణం, హిందూదేశ చరిత్ర, సుఖాధారప్రకాశిక, విభక్తి చంద్రిక, శబ్దలక్షణం, ఇత్యాదులు పాఠ్యపుస్తకాలు, శేషయ్య వ్యాకరణం ఇప్పుడెక్కడా కనపడడంలేదు. అది వెంకయ్య వ్యాకరణానికి బదులుగా బయలుదేరింది. వీరభద్రపళ్లేనికి హనుమత్పళ్లెం వంటిది. శేషయ్య అనే ఆయన వ్రాశారని తోస్తుంది. వెంకయ్య వ్యాకరణం మాత్రం వెంకయ్య అచ్చువేయించింది గాని రచించిందికాదు. అయితే ఆయనపేరుతో వ్యవహరించబడడం “పుణ్యైర్యశో లభ్యతే " అన్న అభియుక్తోక్తి కుదాహరణం అనుకోవాలి. నన్నయభట్టీయ సూత్రాలకు బాలసరస్వతి వ్రాసిన టీకను విడదీసి తాడినాడ వెంకయ్యగారు అచ్చువేయించినారు. ఇప్పటికిన్నీ అది ఆ పేరుతోనే వ్యవహరింపబడుతూ వుంది. ఇట్లాగే హైదరాబాదులో హుసేనుసాగరం అనే చెఱువొకటి వుంది. అదికూడా హుసేను తవ్వించింది కాదు. అతడొక నవుకరు. ఆ చెఱువు తవ్వించే