Jump to content

పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

324

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వంశంవారు. ఆ వంశంలో కల్లా ఆయనే తక్కువపండితులు. పెత్తండ్రిగారు వగయిరా మిక్కిలీ పెద్ద పండితకోటిలోవారు. తక్కువవారు కనకనే స్కూలు మాస్టరీకి వచ్చారు. వారి పాండిత్యం తక్కువ మా అదృష్టాని క్కారణమయింది. వారప్పుడప్పుడు తఱుచుగా భారతమో, రామాయణమో పురాణమో చదువుతూండేవారు. చిన్నప్పటినుంచీ ధారణ శక్తి వుండడంవల్ల వారు చదివిన కథంతా కొన్ని చిన్నపద్యాల సహితం నాకు ధారణకు వచ్చేవి. పైగా వారు చదివే ధోరణి కూడా కొంత పట్టుబడేది. కాని పదిసంవత్సరాల లోపుసంగతి అవడంచేత వారు చదివే ధోరణి మాత్రం యిటీవల నాయందు నిలవలేదు.

పదేండ్ల వయస్సులో నాచదువు ఫ్రెంచిటవును యానాముకు మాఱింది. అందుచేత కడియం మాస్టరుగారివద్ద మూడోక్లాసువఱకే చదువున్నూపల్లెటూరు ఆటలు, గోళీకాయలు, గుట్టాటా, ఒకమాదిరి కోతికొమ్మచ్చీ, బంతీ, ఈ ఆటలున్నూ, కొంచెం చుట్టకాల్చడమున్నూ మాత్రమే కడియంలో నాకు తటస్థపడ్డాయి. తుట్టతుది దురభ్యాసానికి కారణం యింట్లో విస్తరించి పుగాకుండడమే. అట్లా వుంచడానికి హేతువు మా తండ్రిగారి అమాయికత్వం. ఒకరైతు ఒక గృహస్థు దగ్గఱ అరవైరూపాయీలు ఋణం పుచ్చుకొంటున్నాడు, ఆ యిచ్చేటప్పుడు మా తండ్రిగారు అక్కడ వున్నారు. ఋణదాత "యేమండీ, కామయ్యగారూ, యితనికిస్తున్నాను, యివ్వవచ్చునుగదా?" అన్నారట. “అభ్యంతరమేమి" అని తల వూపేరట. ఈ మాత్రం తల వూపినందుచేత ఆ కాపువల్ల వసూలు కాని ఆ ఋణము మా తండ్రిగారు వారికి తీర్చారు. దానికై కృతజ్ఞత చూపుతూ ఆ రైతు తనంతటతాను రెండుపుట్ల పొగాకున్నూ రెండుకాళ్ల లేత దుక్కి గిత్తలున్నూ మా యింటికితోలిపెట్టేడు. ఆ కాలం యేలాంటికాలమో చూడండి. ఆ పొగాకు ఇప్పటి రోజుల్లో రెండువందలకు తక్కువ ఖరీదుండదు. ఆ యెడ్లు నాలుగున్నూ ఈ రోజుల్లో నూఱేనా చేయకపోవు. ఇదంతా కోర్డుద్వారా జరిగిందికాదు. గ్రామంలోనే. తమంతట తమకు తోచిచేసిన పనేగాని, వక తగవరీ గిగవరీ చెపితే చేసిన పనిన్నీకాదు. ఆ పొగాకు మా యింట్లో వుండడంచేత, ఆయా పదార్థాలు కొనడానికి చేతికి వచ్చినంత మా అమ్మగారు వాళ్లవాళ్లకి యిస్తూవుండేవారు. నేనున్నూ స్కూలుపిల్లల సహవాస దోషంవల్ల వాళ్లసహితంగా పొగాకును వాడుకోవడం తటస్థించింది. ఒకనాడు మా అమ్మగారు కనిపెట్టి మందలించారు. అంతతో అది ఆగిపోయినట్లయింది. కాని పూర్తిగా ఆగిందనడానికి వల్లకాదు. ఇటీవల కొన్ని యేళ్లకు కావ్యాలు చదవడం ఆరంభించాక పూర్తిగా ఆగింది.

యానాంలో ఫ్రెంచి స్కూల్లో ప్రవేశించాను. ఇప్పటి ఇంగ్లీషు స్కూళ్లలోవలెనే ఆ స్కూల్లో తెలుక్కంత ప్రాధాన్యంలేదు. సాతాని జియ్యన్నగారు తెలుగుమాస్టరు. ఫర్మా, విజే అను యిద్దఱు దొఱలు ఫ్రెంచి మాస్టర్లు. ఫర్మా హెడ్మాస్టరు. విజేగారు నాకు గురువు.