పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా గురుపరంపర

323

 అప్పుడు ఆస్కూల్లో నాలుగుక్లాసులు వుండేవి. నాలుగోక్లాసు పిల్లలు ఇప్పటి మెట్రిక్యులేషన్ విద్యార్థులకు భాషలో నేమాత్రమున్నూ తీసిపోరు. కాని నా అదృష్టంవల్ల బ్రాహ్మణపిల్లవా డొకడు కొంచెం ముసలాగ్రబుద్ధి వుండేవాడు. అతన్నియేదో వర్ణక్రమం అడిగేరు మాష్టరుగారు. అతడు సరీగా చెప్పలేకపోయాడు. యేం తోచిందో; ఆ మాటకి వర్ణక్రమం నన్నడిగి చూచారు. నేను సరిగా చెప్పేను. దానితో మాస్టరుగారికి అనుగ్రహం మఱింత హెచ్చింది. నిన్ను నేడే సెకండు క్లాసులో వేసేమన్నారు. సెకండుక్లాసులో వున్నప్పుడు కూడా ఆవిద్యార్థిని అడిగిన వర్ణక్రమప్రశ్న అతడు తప్పినప్పుడల్లా నన్ను అడుగుతుండేవారు. నేను చెబుతూండేవాడను. ఆలాచెప్పడంతో ఆ విద్యార్థికి సిగ్గురావాలని కాబోలు. నాకేం తెలుస్తుంది? అతనిచేత నాకు ప్రదక్షిణ నమస్కారాలుకూడా చేయిస్తూవుండేవారు. అది పొందడం నాకిష్టం లేకపోయినా, మాస్టరుగారి భయంవల్ల విధిలేక అనుభవించేవాణ్ణి. అతడిప్పటికిన్నీ బాగానే వున్నాడు. నాకంటె నాలుగైదేళ్లు పెద్ద.

ఈలా రొండోక్లాసు చదువు జరిగింది. అంతలో మూడోక్లాసు. ఈక్లాసులో నాకు తక్కినవి బాగానే వచ్చేవి గాని, లెక్కలుమాత్రంనట్టేవి. నాలుగోక్లాసు ప్రవేశించడంతోనే భిన్నపులెక్కలు అప్పటి స్కూళ్లల్లో చెప్పేఆచారం. ఈ లోపుగా వుండేలెక్కలన్నీ మూడో క్లాసుతోనే సమాప్తికావాలి. నాకు లెక్కలంటే అప్పటికీ, యిప్పటికీ కూడా సగమెఱుకే. ఈ లెక్కల టయిము, ప్రతిరోజున్నూ మధ్యాహ్నం వచ్చేది. తఱుచు నే నెగబెట్టడంచేతనేమి, మాస్టరుగారు చదరంగమాడుకొంటూ యెప్పుడోగాని మధ్యాహ్నం స్కూలుకే రాకపోవడంచేతనేమి, చాలాభాగం నాకు లెక్కల గండం తప్పేది.

నా చిన్నతనంలో మా వూళ్లో చదరంగం విస్తారంగా వుండేది. ఈ యాటలో తఱుచు వ్యసనం కలిగివుండడంచేత, లోకల్‌ఫండువారిచ్చే జీతంకాక, వారి గ్రామంలో వున్న బడి అనే అభిమానంచేత శ్రీ పిఠాపురం జమీందార్లు అదనంగా యిచ్చే జీతం మా మాస్టరుగారికి యెవరో అర్జీ యిచ్చి ఆపుచేయించారు. అలా జరిగినప్పటికీ మా మాస్టరుగారు లక్ష్యం చేయనేలేదు. అప్పటి మాస్టర్లు తృణీకృత బ్రహ్మపురందరులు తఱుచు బల్లోకి రాకపోయినా అప్పటిమాస్టర్లు వచ్చిన నాలుగ్గడియలూ చెప్పే చదువువల్లనే పిల్లలు చక్కగా ప్యాసయేవారు. మా మేస్టరుగారు అంటే ఇప్పటి బోర్డు పల్లెటూరువారివంటివారు కారు. ఇప్పటి కాలంలో బి.యే.క్లాసుకుకూడా వారు పాఠం చెప్పదగ్గవారని నేననుకొంటాను. వారు స్వదస్తూరీతో వ్రాసుకొన్న నీతిచంద్రిక (చిన్నయసూరి గారిది) నాకు వారెప్పుడో అనుగ్రహం కలిగి యిచ్చారు. ఇప్పటికీ అది నా వద్ద నిల్వవుంది. అది చూచినప్పుడల్లా వారి విగ్రహం నాకు జ్ఞాపకం వస్తూ వుంటుంది. ఆ వాగ్దోరణీ, ఆ బ్రహ్మతేజస్సూ, ఆ సదాచారసంపత్తీ, ఇప్పుడెక్కడ చూడగలం? ఆ కాలం పోయింది. ఆయన యేలేశ్వరోపాధ్యాయులుగారి