పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

322



నా గురుపరంపర

అయిదోవత్సరం దాటకుండా నాకు అక్షరాభ్యాసం జరిగింది. అక్షరాభ్యాస గురువు మా తండ్రిగారికి అక్షరాభ్యాసం చేసిన ధనుకొండ వెంకన్నగారనే వృద్దులే. నేను మఱునాడే బడికి వెల్లకపోవడంచేత అక్షరాభ్యాసానికి ద్వితీయవిఘ్నమే తటస్థించింది. ప్రతిరోజున్నూ ఆ బడికి సమీపంలోవున్న మాపెద్దమేనత్తగారింటికి మజ్జిగ పట్టుకెళ్లడం నామీదవుండేది. ఆ కారణంచేత బడిపిల్లలు అప్పుడప్పుడు నన్ను బలవంతంగా సాయంపట్టుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నించేవాళ్లు. కాని, ఆలాటి చిక్కులో వున్న నన్ను మా మేనత్తగారి కూతురు వచ్చి వాళ్లని పాఱదోలి తప్పించేది. ఈలా అయిదారునెలలు బడికి వెళ్లకుండానే గడిచి పోయాయి. అంతట్లో మా అమ్మగారి పెద్దమేనత్తగారు చనిపోయినట్లు కబురువచ్చింది. ఎప్పుడేనా వీథులో కర్మంచాలక బడిపంతులుగారు కనపడి, "యేమిరా బడికి రావడంలే” దంటే, “మాకు మైలవచ్చింది” అని చెప్పేవాణ్ణి. అది ఆయన మనస్సుకు నచ్చక, కారణం అడిగేవారు. నేను మా అమ్మ మేనత్తగారి సంగతి చెప్పేవాణ్ణి. "వోరి! అలాగబ్రా?” అని ఆయనలో ఆయన నవ్వుకొని వెళ్లేవారు. -

ఆ యీ వంకలతో చాలారోజులు గతించాయి. వ్యవసాయం తొందరచేత మా నాన్నగారు నా బడిసంగతి కనుక్కొనేవారేకారు. తుదకు యేడాదికో, యేణ్ణర్ధానికో బడికి వెళ్ళడం మొదలెట్టేను. గుంటవానమాలు వ్రాసియిచ్చారు. అప్పటికే పలకలు వచ్చాయిగాని, పూర్వపురకం బళ్లలో యింకా వాటిని వాడడంలేదు. ఓనమాలూ, అఆలూ, అయిదుబళ్లూ, గుణింతం, పేర్లూ నాకు త్వరగానే వచ్చాయి. పుస్తకం పట్టించారు. "వాగీశాద్యా” వగయిరా బాల రామాయణం శ్లోకాలు వ్రాసియిచ్చారు. ఇంకా ఆశ్లోకాలు వప్పగించకుండానే నా చదువు లోకల్‌ఫండు స్కూలుకు మాఱింది. యేమంటే : అంతకు పూర్వంనుంచిన్నీ అప్పటి లోకల్‌ఫండు స్కూలు మాస్టరుగారు యేలేశ్వరపు శ్రీరాములుగారు మా తండ్రిగారిని నన్ను తమస్కూలుకు పంపించవలసినదని కనపడ్డప్పుడల్లా ప్రేమతో అడుగుతుండేవారు. ఆ కారణంచేత లోకల్‌ఫండు స్కూలు విద్యార్థినిగా మాఱడం తటస్థించింది. "కాకుదీర్ఘమిస్తేకా" వదలిపెట్టి "కకారా కారములు కా" లోకి చదువున్నూ మాఱింది. కొత్తపద్ధతి అయినా నాకంత చిక్కుగా కనిపించలేదు. మొదటిరోజులోనే ఆమార్పు వంటికి పట్టింది. మాస్టరుగారికి నామీద అనుగ్రహం కలిగింది. మఱునాడే ఫస్టుక్లాసులో చేర్చేరు.