పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా గురుపరంపర

327


శివాలయంలోకి వెళ్లినా, ప్రసాదం పుచ్చుకొన్నా, దాన్ని మాత్రం తినేవాణ్ణిగాను. ఈ మతంబాధ క్రమంగా మాఱింది కాని కొన్నాళ్లు మాత్రం చాల పట్టుదలగా వుండేవాణ్ణి. ఆయన నాకు వుపదేశించిన వుపదేశమేనా అంత విస్తారమేమీలేదు. ఇద్దఱిని ఆశ్రయించడం వల్ల యేమీ లాభం వుండదు, వారు రక్షిస్తారని వీరు వూరుకొంటారు. వీరు రక్షిస్తారని వారూరకొంటారు, తుదకు భక్తుడు వ్యర్ధుడైపోతాడు అని చెప్పేవాడు. ఆయన సహాధ్యాయిగా వున్నది స్వల్పకాలంమాత్రమే గురుత్వంవల్ల నైతేనేమి, సహపాఠిత్వంవల్ల నైతేనేమి, నాకు ముక్కుపొడుం పీల్చడం అభ్యాసమయింది. అది యిప్పటిదాకా నిల్చివుంది. ఇంకనూ వుండేటట్టేవుంది.

ఈ రోజుల్లోనే నేను నృసింహదేవర సుబ్బారాయుడుగారివల్ల కాపీ పెట్టించుకొని దస్తూరీ కొంత బాగుచేసుకొన్నాను. ఈయన దస్తూరీ చాలామంచిది. ఈయన భార్యయున్నూ మా తల్లిగారున్నూ పినతండ్రి పెత్తండ్రి బిడ్డలు. ఈయన అత్తవారి గ్రామం యానామే కనుక తఱుచు వస్తూండేవారు. ఆ సమయంలో నా కీ వుపకారం జరిగింది. ఈ రఘువంశం చదివే రోజుల్లోనే కుమ్మరి కామయ్య అనే మార్దంగికునివద్ద కొంచెం మద్దెలవరసలు చెప్పుకొన్నాను. సేవమోళాపాటకులున్నూ, శ్రుత పాండిత్య పౌరాణికులున్నూ అయిన ముక్కామల జోగయ్యగారివద్ద నీలపల్లెవెళ్లి స్వరాలుకూడా మొదలెట్టేనుగాని, యీ రెండున్నూ కొన్ని రోజుల్లోనే ఆగిపోయినాయి. ఈ జోగయ్యగారు తఱచుగా దేవతా కార్యాలూ, సంతర్పణలూ జరిగిస్తూ జీవితం గడపిన పుణ్యపురుషులు. యీయన్ని గుణించి వ్రాస్తే చాలా వ్రాయాలి. ఆ రోజుల్లోనే కొంచెం కుస్తీ వగయిరాలల్లోకూడా కొంతకృషి జరిగింది. పేకాట చెప్పనే అక్కఱలేదు. వున్న స్నేహితులందఱూ ఆటలకు సంబంధించినవాళ్లే అయినా, యేనాల్గు రోజులకో కాపులపాలెం రఘువంశ పాఠానికి తప్పకుండా వెళ్లేవాణ్ణి. ఆ గురువుగారు, వెళ్లినప్పుడు పాఠం చెప్పడమేగాని, నిన్న వచ్చేవు కావేమని యెప్పుడూ అడిగేవారే కారు. వారిది నవాబుచూపు. సదాచారసంపత్తిలో ఏ విధమైన లోపమున్నూ లేదుగాని, వారికి కొంచెము మాదుం అభ్యాసం. ఆ మాదుంలో గంజాయి కొంచెం పడుతుంది. ఆ కారణంచే నవాబుచూపుగా వుండేవారు. వారువైదిక పండితుల వంటివారుకారు. ఆగర్భశ్రీమంతులు, ప్రతివత్సరమూ అయిదారు వేలరూపాయీలు ఆరోజులలో రాబడికలవారు. రాత్రి తెల్లవార్లూ విద్యా గోష్టితో మేలుకోవడము, అప్పుడు పరుండి పగలు పదకొండు రమారమీని మేల్కోడం. అప్పుడు దేవతార్చన బ్రాహ్మడు దేవతార్చన చేశాక వీరు స్నానాదికృత్యాలు జరిగేక సాలగ్రామతీర్థం పుచ్చుకొని భోంచేసేవారు. చదువే కాకుండా నా భోజనం కూడా చాలారోజులు వీరింట్లోనే. పంతుల వారిభార్య పంతులవారికన్నా నన్ను పుత్రప్రేమగా చూసేవారు.