పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వెళ్లేవారనడంచేతనే అప్పటి గురువులకు విద్యార్థులందుండే వాత్సల్యం యెలాటిదో తెలుసుకోవచ్చును. యీ సంగమేశ్వర శాస్త్రుర్లుగారు తర్కశాస్త్రంలో వొక క్రోడగ్రంథం కూడా రచించి పండిత సమ్మతిని పొందిన మహావిద్వాంసులు. వీరితో మన దేశంలో గ్రంథకర్తృత్వం దాఁకావచ్చిన పండితులు ఆఖరయినారని అనుకోవచ్చును. వ్యాకరణానికి రాయుఁడు శాస్త్రుల్లుగారితో స్వస్తి. తర్క వ్యాకరణాలు యిప్పుడు కూడా క్రొత్తమార్గంలో డిగ్రీ సంపాదన పరమలక్ష్యంగా పెట్టుకొని అభ్యసిస్తున్నవారు లేకపోలేదుగానీ, యీ బాపతునుంచి గ్రంథకర్తలదాఁకా వచ్చేవారుంటారని తోఁచదు. (భాషామంజరీ సమాప్తా) సరికదా? అసలు చదివిన గ్రంథాలేనా వీరికి అవగతమై వుంటాయో లేదో అని సంశయించవలసే వుంటుంది. విద్యావిధానంలో వొకటేమిటి? యిప్పుడు సర్వమూ మాఱింది. విద్యార్థివర్తన యెంతమార్పు చెందిందో చెప్పలేము. శాస్త్రం చదువుకొనే విద్యార్థులుగాని, చెప్పే గురువులుగాని చాకింటి బట్టకట్టు కోవడం నేనెఱుఁగను. అట్లనిమురికి బట్టలు కట్టుకొనేవారేమో అంటే అదిన్నీ లేదు. “గన్నేరు పూవన్నె గల్గిన కట్టుదోవతుల నీర్కావిసంపద నటింప" అనే శ్రీనివాసవిలాసపు సీసపద్య చరణాన్ని జ్ఞాపకంచేసే శుభ్రవస్త్రాలు కట్టుకొనేవారు. యేపూటకాపూటగాని లేదా యేరోజు కారోజుగాని వుతికి ఆఱవేసిన బట్టలు కట్టుకోవడమేగాని పాచిబట్ట కట్టుకోవడం గాని బారగోచీ పెట్టడంగాని ఆనాఁటి విద్యార్థులలో వుండేవి కావు. క్రాపింగులు వగైరాలు అప్పటికింకా సర్వేసర్వత్ర ప్రారంభం కానేలేదు. ఆ తెగవాళ్లు యెక్కడేనా వున్నా వెలేసినమాదిరిగా వుండేవాళ్లు. ఆ విద్యార్థుల వా క్కెంత పవిత్రంగా వుండేదో ముఖవర్చస్సూ అంత పవిత్రంగానే వుండేది. ఆలాటి మహా విద్యార్థులతో ఆనాఁటి పండితులు బయలుదేఱి వస్తూవుంటే పురాణాల్లో చదువుకొన్న ఋషులు జ్ఞాపకం వచ్చేవారు. యిప్పుడు పాశ్చాత్యవాసన ఆ యీ విద్యార్థులని మాత్రమేకాదు, గురువులనికూడా ఆవరించింది. వీని బాస వేరన్నాఁడు భారతంలో వొక సందర్భంలో నన్నయ్యభట్టు, అలాగే యిప్పటిచదువున్నూ పరిణమించింది. దేశాటనం చేసి, కుటుంబ భరణం యథాకథంచిత్తుగా చేసుకునే పండితులే యిప్పుడు కనపడరు. ఆలాటివారు వున్నట్టయితే ఆదరించే గృహస్థులున్నూ కఱవైనట్టే. యిప్పుడల్లా ప్రయివేటు ట్యూషను చెప్పుకొనేవారు కనపడతారు. ఉచితంగా విద్యార్థికి విద్య చెప్పే పండితులున్నూ చాలాభాగం అంతరించారు. యీ విద్యలగతి - “హా సీతే! కిం భవిష్యసి" అన్న దగ్గఱికి వచ్చింది. వారిది భిక్షాటకప్రాయమైన జీవనమే అయినా గౌరవనీయంగానే వుండేది. యిప్పడో? యీ విద్యకు యెంత దైన్యం పట్టాలో అంతా పట్టింది. యెక్కడో, కనీసం యెలిమెంటరీ స్కూల్లోనే అనుకుందాం, మాస్టరీ సంపాదించుకోవడానికి యిప్పటి డిగ్రీల పండితులు పడేపాట్లు వర్ణించడానికి వశంకావు. మునుపు దండం పెడితే పుచ్చుకోని