పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనకటి పండితులు

303


పండితులు యిప్పుడు ఆయావ్యక్తులకు నమస్కరించినా ఫలితం కనపడడంలేదు. ఒకటేమిటి, చూస్తూ వుండఁగా యెన్నో సందర్భాలుయెంతో మార్పు చెందాయి. పెళ్ళిళ్లు చూడండి! యెంత చిత్రంగా మారిపోయాయో? అయిదురోజులలో కావలసిన బ్రహ్మవివాహం అయిదు గంటలలో ముగుస్తూవుంది. యెక్కడా సదస్యం అన్నమాట లేనేలేదుకదా? యింక కొన్నాళ్లకు.

ఉ. లేవరు లెండు లెండనిన లేచిన వారయినం దటాలునం
    బోవరు పొండుపొండనినఁ బోదుము పోదుము పోదుమంచుఁదా
    మీవరు సందు గేస్తునలయింతురు పెండిలిలో సదస్య సం
    భావనవేళజూడవలె బాపనసాముల సాములన్నియున్

అన్న దాసువారి పద్యం శుద్ధ అబద్ధంగా పరిణమిస్తుందేమో అనుకుంటాను. విష్ణుపురాణాదులలో వర్ణాల కేదో ముప్పు మూడుతుందంటూ వ్రాసివుంటే ఆ ముప్పు బలాత్కారమూలంగా తటస్థిస్తుంది కాఁబో లను కొనేవాణ్ణి. కాని పాపం ఆయా జాతులు అలాటి దౌర్జన్యం యీ క్షణం వఱకు యెక్కడఁగాని చేసినట్లు లేదు. అగ్రజాతులే యేదో లోక కల్యాణాన్ని అభిలషించి ఆయీ కాశ్మల్యాన్ని ఆపాదిస్తున్నారు. “విధం చెడ్డా ఫలమేనా దక్కితే" కొంత బాగుండును. తుదకు అది పూర్ణానుస్వారంగానే కనఁబడుతూవుంది. “జగతి శిరచ్ఛేద సమయమందునఁ దనకుండలమ్ముల యానఁగొనె ననంగ" అన్నట్టుంది మనంకోరే లోకకళ్యాణం. భోగలాలసత్వానికి దాసులై కొందఱు వారిలోవారికి భాగాలు తెగకతుదకి “మూలచ్ఛేదీ తవపాండిత్య ప్రకర్షః" దగ్గఱికి వచ్చింది ప్రపంచకప్టితి. యిది యెప్పడో గుర్తించే అనుకుంటాను మనఋషులు పూర్తిగా దీన్ని నిషేధించి వర్ణిస్తూ యితరులకుకూడా తమప్రవృత్తిని బోధించి వున్నారు. వారు బోధిస్తే మాత్రం "సానిమెఱుఁగూ సంతమెఱుఁగూ"గా భ్రమను కలిగించే నాగరికత ముందర ఆబోధ పనిచేఁగలుగుతుందా? అయినా కొందఱు సనాతన పండితులు పడరాని పాట్లు పడి పూర్వపు విద్యలు నిల్పడానికిన్నీ పూర్వాచారాలని పోకుండాపట్టడానికిన్నీ యత్నిస్తున్నారు. నానాఁటికి అధోగతికి వెళ్లవలసిన కాలంలో వారిప్రయత్నం సఫలంకావడం కలలో వార్తె అయినా, "యత్నేకృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష” కనక వారిని అభినందిచక తప్పదు.

“శా. వ్యాసాదుల్ ఋషులై నిజమ్ములయి తద్వాక్కుల్ భవిష్యద్గతిన్
      బూసం గ్రుచ్చినరీతిఁజెప్పు టదియున్ బోకుండి యౌరౌర వీ
      రే సారజ్ఞులు? వీరి కయ్యెడల లేనేలేదు విశ్వాస మీ
      యీసట్లే నెటులుండు భ్రష్టులగువారే తన్మతోద్ధారకుల్."