పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనకటి పండితులు

301


సంపాదించుకుందామనిగాని వారికి వాంఛ వున్నట్టే లేదు. పెట్టేబేడా వున్నట్టు లేదు. విభూతిసంచి మాత్రం వొకటి వుండేది, అందులోనే రూపాయి, అర్ధా వుంటే నిలవచేయడం.

ఉ. పెట్టెలు లేవు కల్గినను బీగమునున్న విభూతిసంచియే
    పట్టుదొకండు భూతి నిడు బంగరపున్ గనిగాఁగ రాజు రా
    జట్టులు శిష్యవర్గమున కన్నము విద్యయు నిచ్చు వేలుపుం
    జెట్టుల మద్గురూత్తములఁజెప్పి మఱొక్కరి నెట్లు సెప్పుదున్.

ఆయీ విశేషాలు వ్రాస్తే చాలా వ్రాయాలి. మఱొకప్పుడు చూచుకుందాం. తెల్లవారుజామున పాఠాలకు ప్రారంభం చేసేవారు. తక్కువ పాఠం వాళ్లకి ముందు ప్రారంభం. ఆ పాఠాన్ని పై తరగతివాళ్లంతా వినడం ఆవశ్యకం. యీ నియమం శాస్త్రపాఠాలకి మాత్రమే. కావ్యపాఠాల వాళ్లకి గురువుగారు చెప్పడంలేదు. విద్యార్థులలో పెద్దతరగతివాళ్లే చెప్పేవారు, గురువుగారివద్ద చెప్పుకొన్న శాస్త్రపాఠాన్ని క్రిందితరగతి వాళ్లకి పై గ్రంథాలు చదువుకొనే విద్యార్థులు చింతన చెప్పేవాళ్లు. ఆయీ విధంగా కష్టిస్తేనే తప్ప శాస్త్రం స్వాధీనంకాదు. యీ విధంగా అభ్యసించి నప్పటికీ యేకొందఱికోతప్ప సర్వేసర్వత్ర శాస్త్రం స్వాధీనంకాదు. (శ్లో. కేచిద్భగ్నాః ప్రక్రియారంభకాలే... సర్వేభగ్నాః కారక ప్రక్రియాఃయామ్) యీలాటి శాస్త్రాన్ని చదవకుండానే చదివినట్లు (పుస్తకం మాత్రం సంపాదించి స్వయంగా చూచుకొని అన్నమాట) నటించేవారికి శాస్త్రం యెంతవఱకూ స్వాధీనపడుతుందో వ్యాఖ్యానించనక్కఱలేదు. తర్క పాఠాలకు కూడా విధానం అంతా యిలాగే వుంటుంది. మా గురువుగారికి సమకాలీనులు శ్రీపాద రామశాస్త్రుల్లుగారిని గూర్చి లోఁగడ వుదాహరించే వున్నాను. వారి శిష్యులలో అగ్రేసరులు సంగమేశ్వర శాస్త్రుల్లుగారు. వీరి గ్రామం యేదో నాకు బాగా తెలియదుగాని శిష్యులకు అన్నోదకాలు నిరంతరాయంగా దొరకే గ్రామమని చెప్పి వీరు కాకరపర్తిలో ప్రత్యేకించి మకాంపెట్టారు. వొక పుష్కరకాలం సుమారు వీరు ఆ గ్రామంలోనే వుండి ఆ గ్రామవాస్తవ్యులకే కాక యితర గ్రామాలనుంచి వచ్చిన విద్యార్థుల క్కూడా పుష్కలంగా విద్యాదానం చేశారు. ఆ రోజుల్లోనే రేగిళ్ల అబ్భిశాస్త్రుల్లుగారి శిష్యులు మహాప్రసిద్దులు మంధా చెన్నయ్యశాస్త్రుల్లుగారు పేరూరు గ్రామంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారుండేవారు. తర్కశాస్త్రంయావత్తూ అనర్గళంగా పాఠంచెప్పేవారే అయినా ప్రకరణాలు మాత్రం వారు చెప్పినట్టు యెవ్వరూ చెప్పనే లేరనేప్రతిష్ఠ వారికి రిజిష్టరయి వుండేది. అక్కడ ప్రకరణాలమట్టుకుచదువుకొని తరవాయికి సంగమేశ్వర శాస్త్రుర్లుగారి దగ్గిఱికి వచ్చేవారు. విద్యార్థుల భోజన సౌకర్యం కొఱకు గురువులు స్వగ్రామం వదిలిపెట్టి వలస