పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికటవిమర్శనం

283

 యింకో వూళ్లో యింకో చమత్కారం జరిగింది. టూకీగా దాన్ని కూడా వుటంకిస్తాను. వొక ప్లీడరుగారుండేవారు. ఆయనకి యింగ్లీషురాదుగాని సంస్కృతంలో మంచి పాండిత్యం వుండేది. భాష్యత్రయశాంతికూడా చేశారు. సదాచార సంపత్తిలో కూడా అగ్రగణ్యులు. వేఱే చెప్పేదేమిటి? స్నానం చేసిన తర్వాత ఆయన బ్రాహ్మణేతరుణ్ణి చూస్తే మళ్లా స్నానం చేయవలసిందే. పార్టీలతో స్నానానికి పూర్వం యేం మాట్లాడేవారో అంతే. ఆయన కవులను మెచ్చడంలో వాడే మాటలుకూడా వకమాదిరిగా వుండేవి. భవభూతిని గూర్చి మెచ్చేటప్పుడు, “అమ్మ మొగుడు” అనిన్నీ కాళిదాసుని మెచ్చేటప్పుడు, “అమ్మమ్మ మొగుడు” అనిన్నీ అంటూవుండేవారు. చెప్పేదేమిటంటే? ఆయనకు నవీన కవిత్వం అంటే బాగున్నదేనా సరే తావన్మాత్రంచేత యీసడించడం అలవాటు. దానికి మేమొక వుపాయం చేశాం. యేమిటంటే? మా స్వంతకవిత్వంలోవే యేదో ప్రసక్తిలో కొన్ని వినిపించాం. “యిది యెవరి కవిత్వ?"మంటూ ఆయన పృచ్చచేశాఁడు. ప్రాచీన కవి పేరునే చెప్పడం జరిగింది. దానితో “అమ్మమొగుడు" పదంతో అభినందించడమున్నూ జరిగింది. అప్పటికి వూరుకొని వొకటి రెండు రోజులైనాక యథార్థాన్ని చెప్పి, ప్రాచీనత్వ నవీనత్వాలు కవిత్వ ప్రాశస్త్యానికి హేతువులు కావని కాళిదాసుగారన్న మాటలను స్మరింపఁజేసి వుభయులమున్నూ స్నేహభావంతో ప్రవర్తించాం. యింక యీ యితిహాసాలల్లోన్నుంచి ప్రధానాంశానికి వస్తున్నాను. సర్వోత్తరమైన కాళిదాసుగారి కవిత్వాన్ని నేను ఏదోమాదిరిగా అపవదిస్తాను. లోకం నన్ను క్షమించాలి. నేను చూపే ఆక్షేపణలు సరియైనవైతే కావుగానీ సామాన్యుల దృష్టికి సరియైనవే కాఁబోలును అనే భ్రాంతిని కలిగిస్తే కలిగిస్తాయేమో? నిశ్చయంగా చెప్పలేను. కథలోకి దిగుతూన్నాను. - రఘువంశం ప్రథమస్సర్గ 47 వ శ్లోకంలో -

“అపి లంఘిత మధ్వానం బుబుధే న బుధోపమః

అనివుంది. దిలీపమహారాజు వసిష్ఠాశ్రమానికి ప్రయాణమై వెడుతూ భార్యకు తోవలోవున్న ప్రకృతి చిత్రాలు చూపుతూ తాను అప్పటికి ఎంతమేర ప్రయాణం చేశాఁడో తెలుసుకోలేకపోయాఁడు అని వర్ణించాఁడు కాళిదాసు. అట్టి సందర్భంలో - “బుధోపమః" అన్న విశేషణం దిలీప మహారాజుకు వాడడం యెందుకో? ఆ విశేషణం లేకపోతే వచ్చేలోపమేమిటో? విచారించవలసివుంది. నా మట్టుకు ఆ విశేషణం కేవలం “చవైతుహి చమైతుహి" అనే మాదిరిగా తోస్తూవుంది. దానికి పాదపూరణంకంటే అతిరిక్తఫలం కనపడడంలేదు. వ్యాఖ్యాత యేదో సార్ధక్యం వున్నట్టయితే కొంత కష్టించి తేల్చాఁడుగాని అది అంత నచ్చుఁబాటుగా లేదు. దీని తరువాత శ్లోకంలో

"సదుష్ప్రాపయశాః ప్రాపదాశ్రమం శ్రాంతవాహనః"