పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

శ్లో. "నాళీకజాద్యదితిజాళీ శిరఃకలిత మౌళి ప్రభాంచిత పదా"

అంటూ కొన్ని శ్లోకాలు యిష్టదేవత కాళికను గూర్చిన్నీ

శ్లో. "బాలం సమస్త జగదాలంబ మంబుధర నీలం బలారివినుతం."

అంటూ శ్రీకృష్ణ భగవానుణ్ణి గూర్చిన్నీ వ్రాసివున్నాం. కాని యెక్కడి కెక్కడ? యమకంలోకూడా కాళిదాసుగారి రచనలో కొంత చక్కనిభావం యిమిడివుంది. మా రచనలోనో? యే కొంచె మే మాత్రమో భావం వందేమో కాని అట్టిభావం లేదు సరిగదా! అట్టి సమాసకూర్పు సమేతమున్నూ లేనేలేదు. యీ సంగతి రచనాకాలంలో మాకు పొడకట్టలేదుగాని యిటీవల క్రమక్రమంగా పొడకడుతూ వచ్చింది. అయితే యీ రహస్యం యెఱుఁగనివారు చాలామంది మమ్మల్ని యీ రచనను పురస్కరించి ప్రశంసించడం కలదు. యెవరికోకాని యీ తేడాపాడాలు పొడకట్టవు. అందుచేతే "కోవేత్తి కవితాత్త్వమీశ్వరో వేత్తివానవా అన్నారు పెద్దలు. ప్రాచీనత్వ నవీనత్వాలు దీనికి కారణంగానైతే కొందఱు పెద్దలు చెపుతారుగాని దానికి కాళిదాసే వొప్పుకోలేదు. దీన్ని గూర్చి నారోజుల్లోనే అనుభూతమైన వొకసంగతిని చదువరుల వినోదార్థం వుదాహరిస్తాను. వొకరైల్వే స్టేషనువద్ద పెద్దవుద్యోగంలో వున్నవొక పంతులుగారు కూర్చుని వున్నారు. వారిదగ్గర వొకాయన వొక ప్రాచీన గ్రంథంలో వున్నశ్లోకాలు చదువుతూ అందుండే చమత్కారాన్ని వివరిస్తూ “యిలావుండాలి కవిత్వమంటేను. ఇప్పటికవిత్వాలు వెధవకవిత్వాలు” అనడానికి మొదలెట్టేసరికి, నాకేమో కొంతయిబ్బందిగా తోఁచి "అయ్యా! యిదెవరికవిత్వమండీ!" అంటూ మెల్లిగా ప్రశ్నిస్తూ సమీపానికిచేరి వకటిరెండు నిమిషాలు వారివెనకాల హంగుచేసి తర్వాత "అయ్యా మీరిప్పుడు మెచ్చుకుంటూవుండే కవికికూడా పూర్వం కొందఱుకవులు వుండి వుంటారుకదా! ఆ కవుల కవిత్వాన్ని మీవంటి ప్రాజ్ఞులెవరో యీలాగే పఠించి ఆనందించడం జరక్కపోదుగదా! ఆసమయంలో తాత్కాలికపు కవుల కవిత్వాన్ని మీలాగే నిందించడం జరిగే యెడల మీరిప్పుడు మెచ్చే కవి కవిత్వంకూడా "వెధవ కవిత్వ" పదానికి గురికావలసి వస్తుందేమో? ఆలోచించండీ!” అంటిని. దానితో ఆయనకు కోపమైతే వచ్చిందిగాని ఆకోపాన్ని ఆఁపుకొని “మీరెవ?” రంటూ నన్ను ప్రశ్నించారు. సమీపంలో వున్నవా రెవరో “ఫలానా" అని చెప్పారు. అంతటితో మాకూ మాకూ స్నేహభావం కుదిరింది. చెప్పొచ్చేదేమిటంటే? ప్రాచీన నవీనత్వాలు కవిత్వాన్ని మెచ్చడంలో లేశమూ కూడా వుపకరించవు. కాని సర్వసామాన్యంగా ప్రాచీనుల కవిత్వాన్ని అభినందించడమున్నూ నవీనుల కవిత్వాన్ని యీసడించడమున్నూ కనబడుతుంది. యెవరెన్ని వుదాహరణాలు చూపినా ఆ వ్యవహారం అమల్లో వుండేదే కాని పోయేదికాదు.