పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

284

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

అన్నచోట- “దుష్ప్రాపయశాః’ అనే విశేషణంకూడా పైతరగతిలోకే చేరుతుంది. దీనికి సమాసం మాత్రమే ప్రదర్శించి వ్యాఖ్యాత వూరుకోవడంకూడా నావూహనే బలపరుస్తూవుంది. పైఁగా యీశ్లోకం ఉత్తరార్ధంలో... “మహిషీసఖః" అని దిలీపమహారాజుకు వేసినవిశేషణం నిరర్థకమైతే కాదుగాని మహిషీశబ్దానికి రాజభార్య అనే అర్థంకన్న గేదె అనే అర్ధమే శీఘ్రంగా వుపస్థితం సర్వానుభవసిద్ధమే కనక దానికి సఖుఁడనడంవల్ల దిలీపుఁడు దున్నపోతు వంటివాఁడనికూడా ధ్వనితమవుతూ విజ్ఞులు విచారించవలసివుంటుంది. ఈ మహిషీ సఖత్వం (దున్నపోతు వంటివాఁడవడం) యింతటితో శాంతించదు. యితఁడు దున్నపోతు వంటివాఁడు కనకనే వసిష్ఠుఁడు పశుప్రాయులకు విహితకృత్యంగా వుండే పసులకాపరితనాన్ని ఆజ్ఞాపించాఁడని కూడా వకదోషాన్ని ఆపాదిస్తుంది. పూర్వకాలంలో అంతటితో శాంతిస్తుందేమో కాని యీ రోజుల్లో యింకా కొంతదాఁకా డేకుతుంది. యేమిటంటారా? బ్రాహ్మలు అనాదిగా బ్రాహ్మణేతరులను అవమానించడానికే పూనుకొనేవా రనిన్నీ అందుచేతనే కాళిదాసు దిలీపునికి - చక్రవర్తికి అలాటి విశేషాన్ని వాడి వున్నాఁడనిన్నీ వసిష్ఠుఁడు సర్వ మంత్రద్రష్ట అయివుండిన్నీ “కర్తు మకర్తు మన్యధాకర్తుం" శక్తికలవాఁడై వుండిన్నీ కూడా తన్ను సంతానార్ధం ప్రార్ధించిన మహారాజుకు పశులకాపరితనాన్ని అందులో తనయింటి పసులకాపరితనాన్ని ఆదేశించాఁడంటూ అపవదించడానికి అవకాశాన్ని యిస్తూవుందో? లేదో? విజ్ఞులు విచారించవలసిం దని విషయాంతరాన్ని వుపక్రమిస్తాను -

“వాచమాదదే వదతాంవరః” (56 శ్లో)

“దిలీపుఁడు మాటాడెను" అనడానికి, "వాక్కును స్వీకరించెను" అని కాళిదాసు వ్రాశాఁడు. ఆదానమంటే స్వీకరించడం అర్థంకదా! స్వీకరించడమంటే? ప్రతి గ్రహించడమేనా కాదా? అయేయెడల ప్రతిగ్రహించడానికిన్నీ యివ్వడానికిన్నీ సంబంధం నియతంగా వుండాలి. కాళిదాసు యే తాత్పర్యంతో ఆ వాక్యం వ్రాశాఁడో? అలాటి అర్థం రాదుసరిగదా! బొత్తిగా లగించని అర్థం మఱొకటి వస్తూవుంది. యెవరో తనకు దానం చేస్తేవారి వాక్కును దిలీపుఁడు పరిగ్రహించాఁడనే అర్థం రాకుండా చేసేవారుం టారనుకోను. సహృదయత్త్వమంటూ వుంటేనో! “నచశంకావచోత్తరమ్.”

“గురుణా బ్రహ్మయోనీనా" (64 శ్లో)

యిక్కడకూడా మహిషీ శబ్దానికి తగిలే దోషం వంటిదే శీఘ్రోపస్థితమైన అర్ధంచేత తగిలి తీరుతుందని పైకి వెడుతూన్నాను.