పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


భయపడుతూన్నాను. యింకోటి : ఆలా నేను సంతోషించే పక్షంలో నావంటి అమాయకుఁడంటూ ప్రపంచకంలో లేకపోవలసి వస్తుంది కూడాను. అందుచేత నాశక్తిని గుర్తెఱిఁగినయ్యేవే నేను శాస్త్రుల్లుగారి కవిత్వాన్ని గూర్చి నాల్గు మాటలు వ్రాయవలసి వ్రాస్తున్నాను.

శాస్త్రుల్లుగారు తెలుఁగులోకూడా కొన్నిపొత్తములురచించియున్నారు. కాని ప్రస్తుతం నాకభిప్రాయార్థంగా యిచ్చింది సంస్కృత నాటకం. దీన్ని గూర్చి సంక్షేపరూపంగా భగవంతుఁడు తోపించిన అభినందనాన్ని మిక్కిలిగా క్రోడీకరించి వ్రాస్తున్నాను. సంస్కృత పత్రికకే పంపితే యెన్నో రెట్లు వ్రాయవలసిన నాటకమిది యనుట నిర్వివాదము. యీశాస్త్రుల్లుగారు ‘షడ్దర్శనీపారగు" లనేసందర్భాన్ని లోకంతోపాటు నేనున్నూ విశ్వసించేవాణ్ణే గాని, యేమాత్రమో కవనం అల్లఁగలరనే తప్ప సంస్కృతంలో యింతటి ధారాశుద్ధి గలవారనే విశ్వాసం నాకు యితః పూర్వంలేదు, లేనేలేదు. అందుక్కారణం వారిగ్రంథాలు నేను శ్రద్ధగా చదవకపోవడమే. వీరుకవులనే కాదు, మహాకవులని, అందులో ఆధునికుల పుంతలోనివారు కారని, యే మురారి మహాకవి ధారతోనో పోల్చతగ్గధార వీరిదని వీరి యిందిరా పరిణయం నాకుబోధించింది. యిట్టినిరాఘాటమైన ధారతో నిర్దుష్టంగా కవిత్వం చెప్పేవీరికి ప్రపంచకంలో కవులలో స్థానం యెందుకు లేకపోయిందా! అని సంశయం కలుగుతూవుంది. కాని శాస్త్రజ్ఞులెవరున్నూ కవులనిపించుకోడానికి చాలా అభిజాత్యం పెట్టుకుంటారనిన్నీ నాచిన్నప్పుడెఱుఁగుదును. శాస్త్రం చదువుకున్నవాళ్లంటే కవిత్వం చెప్పుకొనే వాళ్లకు యెంతోగౌరవం వుండటమున్నూ, కవిత్వం చెప్పేవాళ్లంటే శాస్త్రజ్ఞులకు యీసడింపున్నూ సర్వసామాన్య విషయాలే కాని నాచిన్న నాఁటికి కొత్తవికావు. అందులో తెలుఁగులో కవిత్వం చెప్పేవాళ్లంటే సంస్కృతపండితులు బొత్తిగా తోcటకూరలో పురుగువంతుగా చూడడం నేను అనుభవ సిద్ధంగానే యెఱుఁగుదును. యీ కారణం చేతనే మా పరమ గురువులు బ్రహ్మయ్యశాస్త్రులుగారికి జంకుతూ జంకుతూ చాటునా మాటునా మేము శాస్త్రాభ్యాసకాలంలో కవిత్వాన్ని సాగించేవాళ్లం. దానిక్కూడా వారు అంగీకరించేవారు కారన్నమాట. అందుకే మేము శాస్త్రవ్యాసంగానికి అడ్డుతగలని పద్ధతిని కవిత్వం చెప్పకోడానికి అభ్యనుజ్ఞ పుచ్చుకోవలసి వచ్చింది. ఆపద్ధతి కవిత్వమే మా ధాతురత్నాకరరచన. ప్రస్తుతం శిష్టాకవిగారు - కాదు, పండితుడుగారు - నిరాఘాట రచనాధురంధరులై వుండికూడా యేసంస్థానానికిన్నీ కవినని వెళ్లినట్లు కనపడదు. అప్పయ్య దీక్షితులంత వారిక్కూడా యీతలతిక్కవున్నట్టు- “పిళ్ళః కవిరహం విద్వాన్" అనే వాక్యంవల్ల స్పష్టపడుతుంది. పూర్వకాలంలో మాట నేను చెప్పలేనుగాని నావిద్యాభ్యాస కాలానికి కవి అనిపించు కోవడంకంటె పండితుఁడనిపించుకోవడమే గౌరవాపాదకమని నేను బాగా