పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

269


శిష్టావారి విశిష్టత్వం

ఎట్టిదో నాకు గోచరించినంతలో కొంచెం వ్రాయవలసిన ప్రసక్తి కలిగింది. ఏ మహావ్యక్తిని గూర్చి వ్రాయవలసిన ప్రసక్తి కలిగిందో, ఆ వ్యక్తికిన్నీ నాకున్నూ సుమారు ముఫ్ఫై మూఁడేండ్ల కాలమునుండి గాఢమయిన పరిచయం వుంది. యీ పరిచయాని క్కారణం నేను బందరు (ప్రస్తుతం కాలేజీగా మాఱిన) హైస్కూలుకు తెలుఁగు పండితుఁడుగా వెళ్లడమే. వ్రాయఁదలఁచుకొన్న మహావ్యక్తిషడ్దర్శనీ పారగులు శ్రీ శిష్టానరసింహ శాస్త్రులుగారు. వ్రాసే వ్యక్తి యేదో మాదిరిని నాలుగు తెలుఁగు ముక్కలూ నాలుగు సంస్కృతపు చెక్కలూ కలగాపులగంచేసి నలుగురి నోళ్లల్లో ఎలాగో పడి పైకి వచ్చిన నేను. యెవరినేనా మెచ్చవలసివచ్చినా లేక యీసడించవలసివచ్చినా ఆవలివారిని యే విషయంలో ఆయా పనులకు గుఱిచేయవలసి వస్తుందో ఆయా విషయాలలో యీవలి వ్యక్తికి ఆవలివారిని మించిన పాండిత్యం వుండడం ఆవశ్యకం. అదిలేని పద్ధతిని మెచ్చిన మెప్పుగాని యీసడించిన యీసడింపుగాని విజ్ఞలోకం ఆదరించదు. ప్రస్తుతం యెవరిని గూర్చి నేను యీ అభినందనం వ్రాయవలసి వచ్చిందో ఆ నరసింహ శాస్రుల్ల గారికి ‘షడ్దర్శనాలయందున్నూ మహారాజాస్థానాలలో పరీక్ష యిచ్చి పొందిన సర్టిఫిక్కెట్లు వున్నాయి. నాకు ఆలాటి సర్టిఫిక్కెట్లు లేవు. నా ప్రధాన గురువు బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారు మాత్రం షడ్దర్శనీవేది చర్ల బ్రహ్మయశాస్త్రి గురువరేణ్యుఁడు ధరాభరణ! మాకు" ఇత్యాదులు చూడఁదగు. దీనివల్ల నాకు- “సంధ్యావందనం నమ్మగురువు కిల్లా" అనే దోషం తొలఁగినట్లయిందే కాని ఆ మహావ్యక్తిని గూర్చి అభినందించే యోగ్యత కలగనే లేదు. యిట్టి స్థితిలో నేను బందరు శిష్యుల కోరికమీఁద యిటీవల షష్టిపూర్తి దరిమిలాను బందరుకు మూడోసారి తలవనితలంపుగా వెళ్లడం తటస్థించింది. వెళ్లిన మూఁడోనాఁడే అపారమైన పడిశభారంతో నలగడంవల్ల ఆంధ్రజాతీయ కళాశాలావరణంలో కూప కూర్మంవలె వుండవలసిన వాణ్ణయినాను. పలువురు ఆప్తులు రావడంలో శ్రీ శాస్త్రులుగారున్నూ దయచేయడం తటస్థించింది. వారు కొత్తగా రచించిన "ఇందిరాపరిణయం” అనే నాటకాన్ని నాకు యిస్తూ వారికి నాయందు వుండే అవ్యాజమైన ప్రేమకు స్ఫోరకంగా వుండే మాటలు వాక్రుచ్చినారు, ఆ మాటలు నేను “యథావద్వస్తు వర్ణనం” గానే జమకట్టుకొనే యెడల నాకు వుండే అధికారం యే యూనివర్సిటీకి కూడా వుండకపోవలసి వస్తుందని