పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/254

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

258

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

శ్లో. “కచభారాత్కుచ భారః కుచభారాద్భీతిమేతి కచభారః
     కచకుచభారాజ్జఘనం కో౽యంచంద్రాననే; చమత్కారః"

అనే శ్లోకంలో కొంతవివాద పడ్డట్టున్నూ విన్నాను. లక్ష్మణకవిగారు గౌరవభంగం లేకుండా రాజులవల్లనూ సంపన్నగృహస్థుల వల్లనూ జీవితయాత్ర గడుపుకొన్న మనస్వి మాముత్తాత జమీందారు స్వయంగా తన దగ్గిఱకువచ్చి కోరుకోవలసినది అని ప్రార్థించినా కోరుకోని యశస్వి. వీరిపదవులన్ని మంత్రిపదవికి చాలా పైమెట్టులోనే వుంటాయి. భీష్ముండేమన్నాడు?

"అర్థస్య పురుషోదాసః" అనలేదా? మనువేమన్నాడు; “నశ్య వృత్త్యాకదాచన"

యెంతపెద్ద ఐశ్వర్యాన్ని అనుభవించే వారైనా, “శాకం పచతి స్వేగృహే" తెగలోవుండే నిస్పృహులకు (నిస్పృహస్య తృణంజగత్) దాసోహం అనడానిక్కారణం అందరికీ గోచరమే.

మాగాపు శరభకవిగారిపేరు వినడమేకాని పెద్దాపురపు రాజుగారు సదరు కవిగారిని యెప్పుడూ సందర్శింపని కారణంచేత రాజుగారు స్వయంగా ముమ్మిడివరం దాపునవున్న మాగాంగ్రామానికి వెళ్లేటప్పటికి పుట్టగోచీ పెట్టుకొనిదొడ్లో అరఁటితోఁటలో యేవోపాదులకు గొప్పుతవ్వుతూ (రాజరు దెంచునప్పటి కరంటులతోఁటకు గొప్పు) శరభకవిగారు కనపడేటప్పటికి రాజాగారు కవి వినేటట్టు “ఇతఁడేనా శరభకవి" అనేటప్పటికి కవికి మనసునొచ్చి అరవైపద్యాలు యీ క్రింది శైలితో ఆశువులోచెప్పి రాజుగారిని నిర్ఘాంతపోయేటట్టుచేసేట్ట. అందులో వొకపద్యం మాత్రం నాకిప్పుడు కొంచెం తరువాయిగా జ్ఞాపకంవుంది. శైలికి వుదాహరిస్తాను.

మ. “ఇతఁడా రంగదభంగసంగరచమూ హేతిచ్చటాపావకో
      ద్యత కీలాశలభాయమానరిపురాడ్ధారా శ్రుధారా నవీ
      నతరంగిణ్య బలాసమా (కొంతమఱిచాను) ... ... ...
      ... ... ... వత్సవయి తిమ్మక్ష్మావిభుండీతఁడా?"

యెందు కీలా చెప్పవలసి వచ్చిందో స్పష్టంగా తెలుస్తూనే వుంది. అయినా కొంచెం వివరిస్తాను. తనకు నేను నౌకరునుగాను. ఇండిపెండెంటు తరగతిలో వాణ్ణి. యెప్పుడూతన దర్శనానికి వెళ్లలేదు. కనక నన్ను చూడడానికి రావడం బాగానేవుంది. కాని, ఈయనా? అని అనక, నిస్సాకారంగా నన్ను ఇతఁడా? అని అంటాఁడా? సరే! ఆయన నన్ను వొక్క సారి - ఇతఁడా అన్నాఁడు కనక ఆయన్ని నేను 60 సార్లు “యితఁడా?" అంటే సరిపోతుంది అని శరభకవిగారు. ఆ విధంగా తన సామార్థ్యాన్ని ప్రకటించారని చెప్పుకుంటారు. ఆ యీ ధార చూస్తే శంకరకవిగారి హరిశ్చంద్రోపాఖ్యానంలో వున్న-