పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పోషణకు వేలకువేలు ఖర్చుపెట్టేవారు. ఇప్పుడో? వున్న యేనుఁగులను అమ్మివేయడమే కాకుండా వేలకువేలు ఖర్చుపెట్టి రకరకాలు కుక్కలను కొని వాట్ల పోషణకు వేలకువేలు ఖర్చుచేస్తూ వున్నారు. ఆకాలంలో సమర్థులైన కవులను అష్టదిగ్గజాలని వాడడం గౌరవంగా వుండేది. యీ కాలంలోనో? ఆపేరుకు గౌరవంలేదు. రాజానుమతోధర్మః కాఁబట్టి శునకపదమే బాగుంటుందో? మరోపదంబాగుంటుందో చూడం"డని వుపన్యసించడానికి మొదలుపెట్టేటప్పటికి దివాన్‌జీగారు 'పక్కున' కడుపు పగిలేటట్టు నవ్వారఁట! యీ యితిహాసాన్ని బట్టి చూస్తే వ్యాసకర్తగారి రచన సమర్థనీయంగా తోస్తుంది. యింకా లోఁతుకు పోయి విచారిస్తే - "నానృషిః కురుతే కావ్యమ్" అని వుండడంచేత కవులు ఋష్యంశ సంభూతులని తేలుతుంది. ఆఋషి తండ్రి పేరు శునకశబ్దంకాకతీరదు. యిదిన్నీ శునశ్శేఫ-శునఃపుచ్చ-శునోలాంగూలపదాలతో వ్యవహరింపఁబడే ఋషులు వేదకాలంలోనే వున్నట్టు వేదమే ప్రమాణంగా కనపడుతుంది. యీ శబ్దాలు సాధించడానికే “శేఫ పచ్ఛలాంగూలేషుశునః" అంటూ పాణిన్యాచార్యుల వారు వకసూత్రాన్ని నిర్మించి వున్నారు. యీ కాలంలో క్రమంగా ఋషికులజులైన బ్రాహ్మణుల గౌరవం తగ్గినట్టే పూర్వకాలంలో బుషులంతగా గౌరవించిన శునకగౌరవం కూడా తగ్గిపోయిందని వ్యాసకర్తగారు ఆలోచించి మళ్లా వాట్ల గౌరవం వాట్లకు నిలిపే వుద్దేశంతో రచన సాగించి వుంటారేమో? మొత్తం యివన్నీ వుత్ప్రేక్షలు, అన్యబుద్ధి అప్రత్యక్షంకదా! యిప్పటి వాళ్ల కవిత్వం బొత్తిగా నచ్చక వ్యాసకర్తగారు వారి యేవగింపును యీద్వారాగా వెలిపుచ్చినట్టు తోస్తుంది. గాన విషయం కూడా డిటోగానే తోస్తుంది. అయితే వారి అభిప్రాయం యిది కాదేమో? కాదని వారు చెపితే మాత్రం వచ్చేసువాసన ఆఁగుతుందా? ఆఁగదు. అయితే సర్వజన సాధారణంగా ఆహ్లాదానికి యేర్పడ్డ సంగీత సాహిత్యాలమీఁద వ్యాసకర్తగారికీ ద్వేషాని క్కారణమేమో? అదిన్నీ విచారణీయమే. దానికి సమాధానం కనపడుతుంది, యేమిటంటే ఆ విద్యలను వీరు ద్వేషించడంలేదు. ప్రస్తుతం ఆవిద్యలను ప్రకటించేవారి ప్రజ్ఞాలోపాన్ని ద్వేషిస్తున్నారంటే సరిపోతుందిగా! ఆ సరిపోతుంది. కాని ఆయన తరపున మనమా? జవాబు చెప్పడం. ఆయనే చెపుతారు, లేదా? పత్రికవారేనా చెపుతారు. వారూ చెప్పరు. వీరూ చెప్పరంటారా? యీ కాలంలో కవులకున్న గౌరవ మింతే కాఁబోలు ననుకోవడమే. వ్యాసకర్తగారి వ్యాసాన్ని పలువురు కవులు చదివి వుంటారుకదా! వారెవరున్నూ కిక్కురుమనక వూరుకుంటే మీరే దీన్ని కదపడం యెందుకు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం నామీఁద వుంటుంది. జవాబు కేముంది? యెవరు దీన్ని కదిపితే ఆ ప్రశ్న వారికే వస్తుంది. తగినంత వుద్దేశం లేకపోయినా వ్యాసకర్తగారికి కవులంటే పరమాసహ్యం అన్నంత వరకు దొంగాఁడి చేతులో పెట్టినా సారం తేలకమానదు. పయిగా ఆయన వుద్దేశాన్ని బట్టి చూస్తే కవి గాయకులంటే