పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిసన్మానం

247


గడ్డిపరకలకన్నా కనిష్ఠంగా కనపడుతూ వున్నట్టు విస్పష్టమవుతుంది. అలా కనపడితే కనపడనివ్వండిగాని ఆసంగతిని బయట పెట్టడం యెందుకో? నాకు గోచరించడంలేదు. అంత నీచంగా కనపడుతూవున్న కవుల సన్మానాల్లో పాలుగొనకపోవచ్చును, లేదా? జరిగే సన్మానాలను తగినంత యత్నంచేసి ఆఁపుచేయవచ్చునుగాని దిక్కుమాలిన కుక్కలతో సామ్యం చెప్పడం యెందుకోసమో? కొందఱు యెక్కువ ప్రౌఢంగా మాట్లాడడానికి మొదలు పెట్టి తుదకు- "టెంకాయ పిచ్చికొండ” చేయడమున్నూ లోకంలో కనపడుతుంది. ఇది ఆ తెగలోకే చేరుతుందేమో? కొందఱు భక్ష్యపదార్థాలను పోల్చి మాట్లాడడం కలదు. ఆలాగే కుక్కల అఱపుతో కవుల కవిత్వాలకు చుట్టరికం కల్పివున్నారేమో? వ్యాసకర్తగారు. యేమేనా యీవ్యాసం వ్రాయడం కవులని తిట్టడానికి తప్ప కుక్కలని తిట్టడానికని కనపడడం లేదు. చూడండీ! యీ వాక్యాన్ని

“ఎప్పటినుంచో ఉన్నవాణ్ణి పండితుణ్ణి నేనిక్కడ వుండఁగానేనా? మీ ఆటలు సాగడం అంటూ, మిఠాయిదుకాణం పొయిలోనుంచి దూకింది మఱోకుక్క"

యీ వాక్యం పండిత కవులమీఁద వ్యాసకర్తగారికి వున్న కోపాన్ని పూర్తిగా వెల్లడిస్తూ వుంది.

“ఇంతలో మొరుగుడు శాస్త్రంలో మర్మం తెలిసిన మఱో కవి తల్లజుడు" అనే వాక్యం చెప్పనే అక్కరలేదు. వెనక శ్రీనాథుగారు కొండవీటిలో యెక్కడపడితే అక్కడే కవిత్వం చెప్పేవాళ్లు బయలుదేరడం చూచి వక గాడిదను వుద్దేశించి - కొండవీటిలో గాడిద! నీవునున్ గవిని గావుగదా? అంటూ ఒక హేలగా వక పద్యాన్ని చెప్పినట్టు వినడం. అయితే ఆయన లోకోత్తరుఁడైన కవి కనక ఆయన దృష్టిలో సామాన్యులు నచ్చక ఆలా చెప్పినా కొంత సమర్థనీయం కావచ్చు. వ్యాసకర్తగారు ఆలాటి మహాకవి అని తోఁచడంలేదు. అంతటి మహాకవి కాదు కొంతటికవేనా అయివుంటే - “తపోచిహ్నాలు” అని వ్రాయ తటస్థించదనుకుంటాను. వ్యావహారికభాషలో యెలా వ్రాస్తే యేముంటాది వ్యావహారిక భాషలోనేనా యీలాటిలోపాలు సహ్యాలు కావు. వాటి జవాబు చూస్తేనేకాని యీ వ్యాసం వారెందుకు వ్రాసిందీ తేలదు. జవాబులుగా వ్రాసిన మాట మాత్రం సత్యం. యెవరుగాని దీన్ని- "కాలినిపోయేదాన్ని నెత్తినిరుద్దుకో" వలసి మాత్రం లేదుగాని మొత్తం కవులందఱు కలిగించుకోవలసినంత అనాలోచన లేదా? తొందరపాటు దీనిలో కనబడుతూంది. కవుల తరువాత గాయకులకున్నూ వారి తర్వాత సన్యాసులకునూ కలిగించుకోవలసిన ప్రసక్తి దీనిలోవుంది. యెవరిక్కావాలి? దీరి కూర్చున్నవాణ్ణి కనక తోఁచీ తోఁచని యీ మాటలు రెండూ నేను వ్రాశానుగాని యితరులు కలగఁజేసుకోరు. ఆలా అనడానికిన్నీ వల్లకాదు.