పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిసన్మానం

245

1) “ఒకసమయం సందర్భం లేకుండా ఒకటేరాగం, ఒకటే మెడపట్లు, ఒకటే తదరినాంతోం; పైఁగా త్యాగయ్య మాదేశంలో పుట్టాఁడని గర్వం”

కవులను గురించిన వాక్యాలకన్న ఈ వాక్యం యీ వ్యాసకర్తగారికి కొంత వుద్దేశం లోపల వున్నట్టే సూచిస్తుంది. త్యాగయ్య పుట్టినదేశం అఱవదేశం కనక ఆ మాటనుబట్టి దక్షిణాదిగాయకులను తట్టాబాజీచేసే వుద్దేశంతో వ్యాసకర్తగారి లేఖిని ప్రవర్తించిందను కోవడానికి అవకాశం వుంది. మొత్తం వ్యాసకర్తగారికి, కవులన్నా గాయకులన్నా బొత్తిగా పడదని ఆయా వాక్యాలు చెపుతూవున్నాయిగాని కొన్ని మాటలవల్ల యీయన అంతో యింతో యీ రెండిటియందున్నూ ప్రవేశం కలవారనికూడా తేలుతూవుంది. కవులకూ కుక్కలకున్నూ పోలిక చెప్పడానికి యింతవరకు నాకు ఆధారం అంత పనికివచ్చేది కనపడలేదుగాని గాయకులకుమాత్రం వకాయన చెప్పిన సంగతి జ్ఞాపకం వస్తూవుంది. దాన్ని వివరిస్తాను. భైరవరాగమంటూ వకరాగం వుందికదా! ఆరాగం కుక్కల ధ్వనులనుబట్టే ఏర్పడ్డదని శ్రీకృష్ణగానచటికా భాగవతులు సెలవిస్తూవుంటే విన్నాను. భైరవశబ్దం కూడా దాన్ని తెలుపుతూనే వుంది. ఆ రాగాన్ని పాడని గాయకులు వుండరు కనక యీ “బదరీబాదరాయణ" సంబంధాన్నిపట్టి వ్యాసకర్తగారి రచన కొంత సమర్థనీయంగా తోస్తుంది. వ్యాసకర్త సంస్కృతాంధ్రాలు అప్రధానంగా నున్నూ యింగ్లీషు ప్రధానంగానున్నూ అభ్యసించినవారుగా తోస్తారు. సంస్కృతాంధ్రాలు చదివినవారికంటె యింగ్లీషు చదివినవారి రచన మృదువుగా వుంటుందని పలువురంటారు. నాకు ఇంగ్లీషు రాకపోవడంచేత వ్యాసకర్తగారి రచనయందుండే మార్దవం పొడకట్టడం లేదేమో? ఆసంగతిని వ్యాసకర్తగారే వివరిస్తారు కనక విస్తరించేది లేదు. కవులను కుక్కలను చేయడానిక్కూడా వక ఆధారం దొరికింది. సుమారు యిప్పటికి యిరవై యేళ్లనాఁడు వొకానొక సంస్థానంలో దివాన్‌జీగారి యింటివద్ద దివాన్‌జీ గారికి సూత్రభాష్యం పాఠం చెప్పడానికి వొక విద్వత్కవిశిఖామణి దయచేశారు. ఆ సమయంలో అక్కడ ఒక వుద్యోగి మంచి వాచాలకతాశక్తి కలవాఁడు, అంతో యింతో కవిత్వంచెప్పేవాఁడు, హాస్యప్రాయంగా మాట్లాడేవాఁడు, దివానుగారితో బాగా చనువున్నవాఁడు కూర్చుని వున్నాఁడు. యీయన వచ్చిన కవిశిఖామణిని "దయచేయండి కవిశునకంగారూ!” అని సగౌరవంగా ఆహ్వానించేటప్పటికి దివాన్‌జీగారు నిలువునా నీరయిపోయి– “సరిలే! నేర్చుకున్నావు, నీకు సమయా సమయాలుగాని, యెవరి నేమాట అనాలో, యెవరిని యేమాట అనకూడదో అనే పరిశీలనగాని బొత్తిగా తెలియదు, యెల్లప్పుడూ వొకటేహాస్యం దిక్కుమాలినహాస్యం" అంటూ చీవాట్లు పెట్టడానికి ఆరంభించేటప్పటికి, ఆ తాబేదారు లేశమూజంకక - "యేమిటీ? నాకా తెలియకపోవడం మీకా? వినండి. పూర్వపు రాజులు వేలకువేలు వెచ్చించి యేనుఁగులను కొని వాట్ల