పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వున్న విషయం కల్పితం కాకపోవచ్చును కాని భోజ కాళిదాసుల వివాదమున్నూ, వారిద్దఱున్నూ దీనికోసం ఆయాదేశాలు తిరగడమున్నూ, అందులో ద్వీపంగాని ద్వీపం ఆరోజుల్లో పనికట్టుకొని వెళ్లడమున్నూ యీ సమస్తమున్నూ కల్పనే అని నా అభిప్రాయం. కాని వినేవాళ్లకు నిశ్చయంగా ఈలా జరిగివుంటుందేమో? అనే భ్రాంతినిమాత్రం పుట్టిస్తుంది. యింతకున్నూ ఈ రెండో కథవల్ల తేలేసారాంశం ఐశ్వర్యంకన్న విద్యకే యెక్కువ గౌరవం యివ్వవలసి వుంటుందనియ్యేవే. యీ మాట అందఱున్నూ అంగీకరించేదే కాని యెవరోతప్ప విద్వాంసులలో చాలామంది ఐశ్వర్య వంతులను ఆశ్రయిస్తూనే వుంటారు. "మహాభాష్యం వా పాఠయేత్ మహారాజ్యం వా పాలయేత్" అంటూ అనాదిగా వినఁబడుతుంది. భవతు. యెందరో రాజులు జ్ఞానులై రాజ్యపరిత్యాగం చేసిన కథలున్నూ వున్నాయి. యెందఱో విద్వాంసులు అజ్ఞానులై ధనార్థం చేయరాని పనులుకూడా చేసినట్టున్నూ కొన్ని కథలు వున్నాయి. వాట్ల విషయం చర్చించడానికి యీ వ్యాసాన్ని వుపక్రమించ లేదు కనుక స్పృశించి వ్యాసం ముగించఁబోతూ వున్నాను. కవికి భాషాజ్ఞానమున్నూ, వ్యాకరణాది జ్ఞానమున్నూ యెంత అవసరమో, యీలాటి పుక్కిటిపురాణాలు దేశాటనంవల్ల మఱీ యెక్కువగా తెలుస్తాయి. మఱిచిపోయినవి మఱిచిపోఁగా యింకా కొన్ని పుక్కిటి పురాణాలు జ్ఞప్తిలో వున్నాయి. అందులో కొన్ని అసభ్యపుగాథలుకూడా వున్నాయి. అవి అసభ్యులు చెప్పకుంటూవుంటే విన్నవే. కవికి సభ్యమనీ అసభ్యమనీ అంటూ భేదంతో పనివుండదు. సర్వమున్నూ వినవలసిందే, తెలుసుకోవలసిందే. యీమాట వక సందర్భంలో వక సంస్థానంలో వ్యాఖ్యానించే వున్నాము. ఆ మాటలు వుదాహరించి వ్యాసాన్ని ముగిస్తాను

(నానారాజసందర్శనమునుండి)

“శ్రీ వెలయంగ సత్కవిత చెప్పెడివాఁడనఁ బండితుండునుం
 గావలె లౌకికోత్తరుఁడు గావలె బుద్ధివిశేషధుర్యఁడుం
 గావలె భోగి యోగియును గావలెఁ గొంటెలలోనఁ గొంటెయున్
 గావలె మంచి చెడ్డలనకన్ సకలంబు నెఱుంగఁగావలెన్
 గావున నెల్లరున్ గవులు గాఁదగ రట్టికవీంద్రుభావముం
 గేవలు లాదరింతురె? ... ... ... ... ... ... ..."

చాలును. అవసరమైనంతవఱకే వుదాహరించాను. యిందులో - 'అనకన్‌' అనేచోట వ్యతిరేకక్త్వార్ధకం కళగదా? దానికి ద్రుతమేలా చేరిందంటూ కొందఱు శంకిస్తారు. దీనికి ప్రౌఢవ్యాకరణంలో నన్నయభట్టుగారి ప్రయోగాన్ని చూపి చేసిన సమర్ధనం వుంది.