పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పుక్కిటి పురాణ కథలు

201


పుక్కిటిపురాణాన్ని యేమహానుభావుఁడు కల్పించాఁడో? కాని వినడానికి మాత్రం చాలా సొంపుగావుంది. కాళిదాసును జయించే యిచ్ఛతో వచ్చి డేరాలో మకాంచేసిన ఆకవిపేరు యెవ్వరో విన్నట్టు జ్ఞాపకం లేదు. అసలు చెప్పినవారు చెప్పినట్టేలేదు. చెప్పేవుంటే యింతవఱకూ జ్ఞాపకంవుండి ఆకాస్తాజ్ఞాపకం వుండకపోదు. మనకు ఈ కథవల్ల మహాకవులనిపించుకొనేవా ళ్లందఱూ కొన్ని జన్మలయందు దేవీ వుపాసన చేసివుంటారనిన్నీ అట్టివారు వొకరిని వొకరు జయించి పేరు పొందవలసివస్తే వుపాసనాబలిమికంటేకూడా వుపాయం యెక్కువ అవసరమనిన్నీ ప్రస్తుతం కాళిదాసుకు అంటఁగట్టిన కథవల్ల తెలుసుకోవలసి వుంటుంది. ఉత్తరార్థానికి అర్థం కొంచెం వ్రాస్తాను. తూర్పుదిక్కనే వొకానొక సంపూర్ణ గర్భవతి సూర్యుఁడనే శిశువును కనఁబోతూ ప్రసవవేదన పడుతూ వుందా? అన్నట్టు ఆఁడపావురాపిట్టలధ్వని వినబడుతూందని వత్తరార్ధతాత్పర్యం. యీలాటికథలు నాచిన్నతనం మొదలు బందరులో నేనుస్కూలు టీచరీకి ప్రవేశించేవరకూ దేశాటనం చేయడంలో ఎన్నో వినివున్నాను. యెన్నో ప్రాస్తావికాలు, శ్లోకాలూ పద్యాలూ వినివున్నాను. అవన్నీ బందరు ప్రవేశించేవరకూ వాచోవిధేయంగా వుండేవి. క్రమంగా బందరు టీచరీ రోజుల్లోనే ఆయీగాథలున్నూ వీట్లకి సంబంధించిన శ్లోకాలూ, పద్యాలూ నున్నూ అంతరించాయి. యిప్పడేకొంచెమో జ్ఞప్తిలో వున్నాయి. పనిలోపని యీలాటి కల్పనే యింకొకటి కాళిదాసుకు సంబంధించిందే వుదహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. వొక రోజున కాళిదాసుగారికిన్నీ భోజరాజుగారికిన్నీ వాదం వచ్చిందఁట! యేమనంటే? "ఐశ్వర్యం యెక్కువా? కవిత్వం యెక్కువా?" అని - భోజరాజుగారు "ఐశ్వర్యానికే" అగ్రస్థానాన్ని యిచ్చి వాదించడానికి మొదలెట్టారు. కాళిదాసుగారో? "కాదు కవిత్వానికే అగ్రస్థానం యివ్వా"లన్నారు. సరే! యిది తేలడం యేలాగ? తేల్చుకోవడానికి దేశాలమ్మట బయలుదేఱారు. భోజరాజుగారు వస్తూవున్నారంటే ప్రతీరాజున్నూ యెదురుగా వచ్చి గౌరవంచేసి గౌరవంచేసి తీసుకు వెళ్లి పెద్ద పెద్ద మేడలూ, పువ్వులతోఁటలూ బసయేర్పఱచి సమస్తసదుపాయాలున్నూ జరిగించేవాఁడు. కాళిదాసుగారిని యేరాజున్నూరమ్మన్నట్టేలేదు. యేపండితుఁడి యింట్లోనో యింత “తదన్నంతద్రసం"గా కాలక్షేపం చేస్తూ శ్రమపడుతూ తిరుగుతూ వున్నాఁడు. మధ్య మధ్య భోజరాజుగారు "యేం నీవాదం వోడిపోయిందా?" అని డెకాయిస్తూ వుండేవాఁడుః కాళిదాసు- “యింకా పదండి ముందు చెపుతా" ననేవాఁడు. యీలా కొంతదేశం తిరిగారు. అంతట వొకానొక మకాం సింహళంలో రాజధానిలో పడింది. దీన్నిబట్టి ఆకాలంలో మనదేశస్థులు "సిలోనుకు" కూడా వెళ్లేవారని తేలుతుంది. అక్కడ జరిగిన విశేషమేమిటంటే? ఆదేశపప్రభువు కొన్ని మాసాలనుంచి వూరూ పేరూ లేనివ్యాధిలో వున్నాఁడఁట! యెందఱో ఘనవైద్యులు వస్తూనూవున్నారు, చూస్తూనూవున్నారు. 'తమకువున్న