పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

200

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శ్లో. “చరమగిరికురంగీశృంగకండూయనేన, స్వపితి పునరిదానీ మంతరిందోః కురంగః" అంటే అర్థమేమిటంటే? పడమటి కొండ అనఁగా, అస్తగిరియందు వుండే ఆడలేడి తనయొక్క కొమ్ముతో గోకుతూవుంటే, ఆ సౌఖ్యాన్ని అనుభవిస్తూ చంద్రమండలంలో వుండే మొగలేడి సుఖిస్తూ వుందని వర్ణించాఁడన్నమాట. ఫలితార్థం చంద్రాస్తమయం అవుతోవుందని తేలింది. యిన్ని తికమక లెందుకు చంద్రాస్తమయ మవుతూందనే చెప్పరాదా? అని శంకిస్తారేమో? ఆ తికమకలు వుంటేనే ఆ రచన కవిత్వమనిపించుకుంటుందని తెలుసుకోవాలి. సరే ప్రస్తుతం వ్రాస్తాను. కాళిదాసు కవిగారి గుట్టూ మట్టూ తెలుసుకోవడానికి ప్రచ్ఛన్నంగా వచ్చి వున్నావాఁడే కనక ఆ రచనలో వుండే లోపాన్ని కనిపెట్టి - "బాబూ! ఆఁడలేడికి కొమ్ము లుంటాయాండి?" అంటూ మెల్లిగా శంకించాడు. శంకించేటప్పటికి కవిగారు తాను పడ్డ పొరపాటును గ్రహించుకున్నారు. అన్నా గడ్డి అమ్మకొనేవాఁడికి కూడా దొరుకడ్డాంకదా? అని మనస్సులో విచారం పుట్టింది. దానితో సవరణ తోఁచింది కాదు సరికదా! ఉత్తరార్థంకూడా స్ఫురించిందికాదు. ఆ కంగారంతా మన కాళిదాసుగారు కనిపెట్టి అయ్యా! "శృంగ" అనేచోట- “తుండ" అంటే కుదురుతాదండి. అన్నాఁడఁట! అప్పుడు అర్థం. ముట్టితో గోఁకడం కనక సరిపోతుందన్నమాట. ఆ సవరణ వినేటప్పటికి కవిగారికి మరీ గాబరా పుట్టిందఁట! ఆ గాబరామీఁద ఉత్తరార్ధం అసలే స్ఫురించక "బ్రే" కేసినట్టయిందఁట! అది కాళిదాసు కనిపెట్టి- “తరవాయి సెలవిప్పించండి బాబూ! యింటా” నన్నాట్ట. కవిగారు కంగారుతో - బెల్లంకొట్టిన రాయిలాగ వుండిపోయారనిన్నీ అదంతా గ్రహించి కాళిదాసు - 'అయ్యా! సెలవైతే తరవాయి నాను పూర్తిచేసుకుంటా’ నన్నాఁడనిన్నీ కవిగారు ఆమాటవిని అత్యాశ్చర్యపడి– “యేమీ నీవు కవిత్వం కూడా చెప్పగలవా?" అని అడిగారనిన్నీ దానికి కాళిదాసు- ‘బాబూ! బాగా చెప్పలేనుగాని యీమాత్రం నేనే కాదండి; మా కాళిదాసుగారి నౌకర్లందఱున్నూ చెపుతారండి' అంటూ వుత్తరార్ధాన్ని శ్||లో పరిణతరవిగర్భ వ్యాకులా పౌరుహూతీః దిగపి ఘనక పోతీహుంకృతైః క్రన్దతీవ" అని పూర్తి చేసినట్టున్నూ దానితో కాళిదాసును జయించాలని డబ్బా డవాలీ కట్టుకొని పెద్ద అట్టహాసంగా బయలుదేఱి వచ్చిన కవిగారు హడిలిపోయి 'కాళిదాసుగారి నౌకర్లే యింతింత కవులయితే ఆయనయెంతవాఁడో?" అనుకొని- “చచ్చినంత కలగంటే పెందరాళ్లే మేలుకో" మన్నారనుకొని డేరా సామాను బళ్లకెక్కించి వుదయం కాకుండానే వచ్చినతోవను ప్రయాణం కట్టినట్టు గోదావరి డి. అమలాపురం, తాII కాట్రేవుకోన కాపురస్థులు శ్రీమల్లాది నరసింహశాస్త్రుర్లుగా రనేవారు చెప్పఁగా విన్నాను. ఆయన బహుశః నాయీడువారే అని జ్ఞాపకం. ఆయీ శ్లోకం యే గ్రంథంలోనో యిటీవల చూచినట్టు కూడా జ్ఞాపకం. ఆ గ్రంథం కాళిదాసు చేసినదని జ్ఞాపకం లేదు. యే మహాకవిదో? యీ శ్లోకాన్నిబట్టి యింత