పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/198

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

202

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


బాధయేమిటి?' అని ప్రశ్నిస్తే ఆయన 'సాతత్ర చిత్రాయతే' అని మాత్రం జవాబు చెపుతారు. మళ్లా మళ్లా గుచ్చిగుచ్చి అడిగితే మళ్లా మళ్లా ఆలాగే జవాబు చెబుతాడు. యీ వ్యాధికి వైద్యులు చేసే వైద్యమేమీ కనపడలేదు. రాణీగారేమి, మంత్రులేమి చేయవలసిన ప్రయత్నాలు యెన్ని చేయాలో అన్నీ చేస్తూవున్నారు. గ్రహజపాలు, భూతవైద్యజపాలు వకటేమిటి? మహారాజుకు లోటేముంటుంది కనక దేశదేశాలనుంచి వైద్యులు వస్తూ వున్నారు. నెత్తిన గుడ్డేసుకొని వెఱ్ఱిమొహాలతో నిష్క్రమిస్తూనూ వున్నారు. ఆసమయంలోనే మన భోజరాజుగారు దయచేశారు. పేరు వినీవినడంతోటట్టుగానే మంత్రులు వగయిరాలు యెదురువెళ్లి గౌరవించారు. తగిన బస యేర్పఱిచారు. యేముంది?

"సాతత్ర చిత్రాయతే" అన్న వాక్యాన్ని విన్నారు. కర్తవ్యం తోఁచలేదు, వూరుకున్నారు. కాళిదాసుగారికి ఆలాటి సమయంలో దర్శనంయేలా అవుతుంది? కవి నని లేదా? కాళిదాసు ననే చెపుతాఁడనుకోండి! ఆ సమయంలో కవిత్వం యెవరిక్కావాలి?

"ఆతురస్య భిషజ్మిత్రమ్" అనికదా! అభియుక్తులు చెపుతారు. అందుచేత మనవాఁడునేను వైద్యుణ్ణనియ్యేవే చెప్పాఁడు. విన్నవాళ్లు “పోవయ్యా! నీతాతవైద్యులంతా వచ్చారు, బోల్తాగొట్టి పోయారు." అంటూ యీసడించడానికి మొదలుపెట్టారు. 'కాదు నేను తప్పకుండా రాజుగారి వ్యాధిని కుదురుస్తాను! నా ప్రజ్ఞ చూడండి. యెందఱినో చూచామన్నారుకదా! పోయిందేమిటి? నన్ను కూడా చూడండి!' అంటూ రాజ పురుషులని బతిమాలడాని కారంభించాఁడు. కాని ఆదరించినట్టు లేదు. తరవాత మెల్లిగా అంతఃపుర పరిచారికలలో కాస్త పెద్దగా తల తిప్పుకొనే దాసీలను ఆశ్రయించడానికి మొదలు పెట్టాఁడు. అందులో యెవత్తో వకత్తి అమ్మగారిచెవిని బడేసింది. “పోనీ యీయన వైద్యాన్ని కూడా చూద్దా"మని ఆపత్తులో వున్న రాణీగారు ఆయన్ని వెంటఁబెట్టుకు రావలసిందని ఆ దాసీకి ఆజ్ఞాపించారు. కాళిదాసుగారు కోటలోకి దయచేశారు. రాజుగారి దర్శనానికి వెళ్లారు. ప్రాణమాత్రావశిష్టులై మంచంమీఁద పరుండివున్న రాజుగారిని అందఱూ అడిగినట్టే “యేమిటి? తమకు వున్న బాధ" అని ప్రశ్నించారు- రాజుగారు యథాపూర్వంగానే 'సాతత్రచిత్రాయతే' అని జవాబిచ్చారు. కాళిదాసు దేవీ ప్రసాదలబ్ధ కవితావైభవుఁడవడంచేత పరేంగితజ్ఞత్వం కలవాఁడుకనుక, ఆ వ్యాధివారికి యెలా కలిగిందో అంతా క్షణమాత్రంలో అవగతంచేసుకున్నాఁడు. యిక్కడికి రాకపూర్వమే సర్వే సర్వత్రా యీ- 'సాతత్ర చిత్రాయతే' పాట "రోళ్లా రోకళ్లా" పాడుతూనే వున్నది కనక యిదివఱకే దాని ముక్కూమూలమూ కాళిదాసుకు అవగతమైవుందనుకోవలసి వుంటుంది. ఆపట్లాన్ని వైద్యం ఆరంభించాఁడు. యేలాగంటే? ఆ వైద్యం యీ శ్లోకమే- శ్లో. చిత్రాయ త్వయియోజితే తనుభువా సజ్జీకృతం