పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుక్కిటి పురాణ కథలు

199

ఉ. "రాతిరి మేము పస్తుహయరత్నము పస్తు కవీంద్రగాయక, వ్రాతముపస్తు
     నర్మసచివాగ్రణి పస్తు.... ముద్దుకోమలి..... పస్తిఁక నేమి సెప్పదున్?”

యీ పద్యంలో మొదట కొంతజ్ఞాపకంరాక బొట్టుపెట్టి వదలేశాను. వ్రాయకుండానే తెలుస్తుందని కొంత వదిలేశాను. కవులు గుఱ్ఱాలతో మఱికొందఱు కవులతో గాయకులతో నర్మసచివులతోకూడా బయలుదేఱేటప్పుడు సొంత డేరా వుండవలసిందే కాని మహారాజావారి దర్శనము అయి వారి సప్లయి అందేలోపున సొంతడేరా వుండకపోతే కొత్తవూళ్లో వీరిని భరించతగ్గ గృహస్థెవఁడుంటాఁడు? అందుచేతేకదా! పూర్వము యెవరో కవి యేనుఁగునున్నూ కవీశ్వరుణ్ణీ రాజు భరించవలసిందే కాని తదితరులు భరించ లేరని చెప్పివున్నాఁడు- "సుకవితా యద్యస్తి రాజ్యేనకిమ్"- అనే భర్తృహరి వాక్యంకూడా మహాకవుల సంపత్తి సామాన్యం కాదని తెలుపుతుంది, భర్తృహరివాక్యాని కిది అర్థంకాదని కొందఱనవచ్చును. కాకపోవుఁగాక- “సుకవీంద్ర బృంద రక్షకుఁడెవ్వఁడనిన వీఁడను నాలుకకుఁ దొడవైనవాఁడు" అనే సీసచరణం వగయిరాలు కవుల ఐశ్వర్యాన్ని తెలుపుతూ వున్నాయి కదా! అది ఆలా వుంచుదాం. కవిగారు వచ్చి డేరాలోదిగారు. కాళిదాసుకు ముందే ఈసంగతి తెలిసి దేవిని ప్రార్థించాఁడు, దేవి “ఆకవి నీకన్న వొకజన్మం యెక్కువగా నన్ను వుపాసించాcడు, నీకుసాధ్యుఁడు కాఁడు, ఉపాయాంతరం చూచుకొ"మ్మంది. ఆ పట్లాన్ని కాళిదాసుకు యేమీ తోఁచిందికాదు. తానేమో తొమ్మిదిజన్మాలల్లో దేవిని వుపాసించినట్టున్నూ ఆ కవి పదిజన్మాలల్లో వుపాసించినట్టున్నూ దేవిస్పష్టంగా చెప్పింది. ఆలోచించి, ఆలోచించి కాళిదాసు వకగడ్డి అమ్మకునేవాఁడివేషం వేసుకుని పచ్చగడ్డికావిడి బుజాన్ని పెట్టుకొని కనుచీఁకటి పడుతూవుండఁగా ఆ కొత్తకవిగారి డేరా దగ్గిఱికివచ్చి తొంగిచూస్తూ వున్నాఁడఁట! అప్పుడు ఆ కొత్తకవీశ్వరుఁడు "గడ్డికావిడి యెంత కేస్తా?” వని బేరమాడేటప్పటికి మనకాళిదాసన్నాట్ట, "అయ్యా! యీ గడ్డి కాళిదాసుగారి గుఱ్ఱానికి వాడుకగా ప్రతీరోజూ అమ్మకునేదండి. మీకమ్మేదిలే"దన్నాట్ట! అనేటప్పటికి ఆకవి “వోరీ! మేము యిప్పడే యీవూరికి వచ్చాము. మా గుఱ్ఱానికి నీవు అమ్మకపోతే కొత్తవూల్లో గడ్డి సంపాదించడం కష్టం, కాళిదాసుగారు నీ కిచ్చేదానికంటె రెట్టింపుఖరీదు యిస్తా" మంటూ బతిమాలేటప్పటికి మనగడ్డి కావటివాఁడు (కాళిదాసు) "బాబూ! ఆరు నాకు రోజూ రాత్రి కూడుకూడా పెట్టిస్తా"రన్నాట్ట! దానిమీఁద కవిగారు "మేమున్నూ పెట్టిస్తా" మన్నారఁట! అనేటప్పటికి మొగమాట పడ్డట్టు నటించి కాళిదాసు గడ్డికావడి వారికి వేసి అక్కడే భోంచేసి “బూబూ!” యీ రేతిరిక్కడే తొంగుంటానని చెప్పి ఆ కవిగారిగుట్టూ మట్టూ కనుక్కోవడానికి అక్కడే పడుక్కున్నాఁడఁట! తర్వాత తెల్లవాఱగట్ల చంద్రాస్తమయం అవుతూ వుండంగా ఆ కవిగారు మేలుకుని ఆ చంద్రుణ్ణి యీ విధంగా వర్ణించడానికి మొదలెట్టారఁట!