పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


రచించేటప్పటికి ఆయుఃపరిమితి సరిపోయిందనిన్నీ అందుచేతే యుద్ధకాండ మఱివకరు రచించడం తటస్థించిందనిన్నీ వక కథ చెప్పకుంటారు. యీ కథకు సంబంధించి - “శ్లో. అద్య ధారా నిరాధారా... అద్య ధారా సదాధారా" అనే శ్లోకద్వయం కనపడుతుంది. ఆయీ కథలు కొన్ని పురాణాల్లో వుండే సందర్భాలను అనుసరించి కనపడతాయి. భోజరాజుగారి శిరస్సులో అంటే మెదడులో యేదో కప్పపిల్ల చేరినట్టున్నూ, దాన్ని అశ్వనీదేవతలు "ఆపరేష"ను చేసినట్టున్నూ వక కథ వుంది. యిప్పటికాలంలో అయితే ఆ “ఆపరేషను" దేవతలదాఁకా వెళ్లవలసిలేదుగాని అప్పుడు దేవతలదాఁకా వెళ్లింది. ఆయీ కథల నిజానిజాలు తేల్చడం చాలాకష్టం. యింతదాఁకా వుదహరించిన కథలవల్ల కాళిదాసుగారు వేశ్యాలోలుఁడైనప్పటికీ కేవల శ్రోత్రియపుత్రుఁడున్నూ, శ్రోత్రియుఁడున్నూ అయిన భవభూతి ఆయన యెడల యెక్కువ ఆదరాన్నే చూపించేవాఁడనిన్నీ తన వుంపుడుకత్తెకున్న కాళిదాసుకున్నూ సంబంధం వుందనే అంశం భోజరా జెఱిఁగీకూడా అతనియందు ప్రేమగానే వుండేవాఁడనిన్నీ తేలడమేగాకుండా అంతటి మహారాజున్నూ మహాకవీనిన్నీ అయిన భోజుఁడు వుంచుకొన్న సానికి కూడా కాళిదాసురసికత్వం మనశ్చాంచల్యాన్నయితే కలిగించి ప్రేమింపచేసింది కాని తుట్టతుదకు అర్ధరాజ్యాపేక్ష అట్టి వలపు మగణ్ణికూడా చంపించివేసిందనిన్నీ యెన్నో విశేషాలు ధ్వనిమర్యాదచేత బయలుదేఱతాయి, ఆయా మాదిరి విశేషాలు ధ్వనించేకథ లింకా వీరికి సంబంధించిన వున్నాయి. వ్యాసం పెరిగిపోతూవుంది. అందుచేత వాట్లను వదులుకొని చదువరుల వినోదార్థం వొక శ్లోకానికి సంబంధించిన పుక్కిటి పురాణకథను వుదహరిస్తాను

యీ కథ నేను విని యిప్పటికి 48 యేండ్లు దాఁటవచ్చింది. కథ మాత్రం నిజం కాదేమోకాని శ్రోత్రపేయంగామాత్రం వుంటుంది. యీకథే కాదు; మనవారి మతంలో యెన్నో పురాణగాథలు యీలాటివే, అంటే అర్ధవాదాలే. అర్ధవాదాలంటే లేని అర్ధాన్ని ప్రయోజనాంతరాపేక్షతో వుపన్యసించడమే. ఆశ్లోకం తుట్టతుదను వుదాహరిస్తాను. కథ మొదలెడ్తూ వున్నాను - వొకానొక మహాకవి భోజరాజుగారి దర్శనం నిమిత్తం బయలుదేఱి ధారానగరానికి వచ్చాఁడఁట! వచ్చి వూరు వెలపల డేరా వేసుకొని మకాం చేశాఁడఁట! “కవులకు డేరా లుంటాయా?” అని సందేహిస్తారు కాఁబోలును! సందేహించకండి, యిప్పటి అస్మదాదులనుబట్టి వెనుకటి మనకవులందఱినిన్నీ యీలాటివాళ్లే అనుకోకండి. ఆ కవులు విదేశీయ ప్రభుపరిపాలనలో వున్నవాళ్లు కారుకదా!- “ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి కేలూఁత యొసంగి యెక్కించుకొనియె" అనే పద్యం వగయిరాలు జ్ఞాపకం తెచ్చుకోండి. అంతదాఁకా యెందుకు? తురగా రామకవి యీకాలాని కెంతోపూర్వుఁడు కాcడు - అతనిదే యీ క్రిందిపద్యం-